లష్కర్‌ బరిలో సైకిల్‌!

TDP Participate in Secunderabad Lok Sabha Election - Sakshi

సికింద్రాబాద్‌ లోక్‌సభ నుంచి టీడీపీ పోటీ!!   

ఇప్పటివరకు ఒక్కసారి కూడా గెలవని పార్టీ

ఈసారి సత్తా చాటుతామంటున్న తమ్ముళ్లు

ఎమ్మెన్‌కు టికెట్‌పై దాదాపుగా ఏకాభిప్రాయం  

సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్‌ లోక్‌సభ బరిలో నిలిచేందుకు తెలుగు తమ్ముళ్లు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ స్థానం నుంచి ఇంతవరకు ఒక్కసారి కూడా గెలవని టీడీపీ పోటీకి సై అంటోంది. గతంలో వివిధ ఎన్నికల్లో ఇతర పార్టీ లతో పొత్తులో భాగంగా టీడీపీ పోటీ చేయలేదు. పోటీ చేసిన సందర్భాల్లోనూ విజయం దక్కకపోవడమే కాకుండా కనీసం రెండో స్థానంలో కూడా నిలవలేదు. అయినప్పటికీ సికింద్రాబాద్‌ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో టీడీపీకి బలముందని, గతంలో టీడీపీతో పొత్తుపెట్టుకున్న మిత్ర పక్షాల అభ్యర్థులు గెలవడానికి, ఓడినప్పుడు వారు రెండో స్థానంలో నిలవడానికీ టీడీపీ బలమే కారణమని చెబుతున్నారు. ఇటీవల  ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమతో పొత్తు వల్లే లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని వివిధ సెగ్మెంట్లలో కాంగ్రెస్‌ రెండో స్థానంలో నిలవగా, బీజేపీ అభ్యర్థులు వారికంటే వెనకబడటానికి కారణమని చెబుతూ ముషీరాబాద్, సనత్‌నగర్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్‌ వంటి వాటిని ప్రస్తావిస్తున్నారు. ఎల్‌బీనగర్‌లో కాంగ్రెస్‌ తరఫున సు«ధీర్‌రెడ్డి గెలిచేందుకు కూడా టీడీపీ తోడ్పాటే కారణమని చెబుతూ, ఈసారి సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం టిక్కెట్‌ ఇవ్వాలని కోరుతున్నారు.

టికెట్‌ ఎవరికిచ్చినా సరే..
హైదరాబాద్‌ జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఎమ్మెన్‌ శ్రీనివాసరావు, సనత్‌నగర్‌ నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన కూన వెంకటేశ్‌గౌడ్, టీడీపీ రాష్ట్ర నాయకులు బీఎన్‌ రెడ్డి, లంకెల దీపక్‌రెడ్డి, అంబర్‌పేట నియోజకవర్గ ఇన్‌చార్జి వనం రమేశ్, సికింద్రాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి మేకల సారంగపాణి తదితరుల పేర్లు ఈ సందర్భంగా ప్రస్తావనకు వస్తున్నాయి. సికింద్రాబాద్‌ నుంచి పార్టీ ఎలాగైనా పోటీ చేయాలని కోరుతూ పలువురు నాయకులు సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి రావుల చంద్రశేఖరరెడ్డి వద్ద బుధవారం అర్ధరాత్రి వరకు చర్చలు జరిపినట్లు సమాచారం. తమలో ఎవరికి టిక్కెట్‌ దక్కినా ఫరవాలేదనే అభిప్రాయంతోపాటు జిల్లా అధ్యక్షుడు ఎమ్మెన్‌ శ్రీనివాసరావుకు కేటాయించాల్సిందిగా దాదాపు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది.

ముషీరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు దశాబ్దాల నుంచి వేచి చూసినప్పటికీ, పొత్తుల్లో భాగంగా ఆయనకు ఇప్పటి వరకు అవకాశం లభించకపోవడంతోపాటు, జిల్లా అధ్యక్షునిగా ఉన్నప్పటికీ ఇంతవరకు పోటీ చేయకపోవడం తదితరమైనవి పరిగణనలోకి తీసుకొని ఆయనకు కేటాయిస్తే తమకేం అభ్యంతరం లేదని, అందరం కలిసి పనిచేస్తామనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా, ఆ మేరకు తీర్మానం చేసి పంపించాల్సిందిగా రావుల సూచించినట్లు తెలిసింది. సికింద్రాబాద్‌ నుంచి టీడీపీ పోటీలో దిగడం దాదాపు ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నేతలు మాత్రం పార్టీ ఆదేశిస్తే పోటీ చేసేందుకు తాము సిద్ధమని చెబుతున్నారు. లష్కర్‌ నుంచి పార్టీ రంగంలో ఉండాలనే తలంపుతోనే బుధవారం సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ స్థాయి  విస్తృత సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి తలసానిలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎలాగైనా పోటీ చేయాలనే తలంపుతోనే అధికార పార్టీపై విరుచుకుపడ్డట్లు తెలుస్తోంది. మరోవైపు ఎంతోకాలంగా విభేదాలతో దూరమైన ఎమ్మెన్, మేకల సారంగపాణి ఏకమయ్యారు. మేకల ప్రాధాన్యాన్ని చాటేందుకే ఆయన అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఈ సమావేశం నిర్వహించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

15 శాతం ఓట్లే..
లష్కర్‌లో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ అంతో ఇంతో సత్తా చాటిన సందర్భం 1987లో డాక్టర్‌ ప్రతాప్‌రెడ్డి పోటీ చేసినప్పుడు తప్ప మరెప్పుడూ వెల్లడి కాలేదు. ఆయన రెండో స్థానంలో నిలవగా, ఆ తర్వాత  1996లో ఎం.రామచంద్రరావు, 1998లో డాక్టర్‌ అల్డాడి రాజ్‌కుమార్, 2009లో సుధీష్‌ రాంభొట్ల  మూడో స్థానానికే పరిమతమయ్యారు. 1996లో టీడీపీ అభ్యర్థి ఎం. రామచంద్రరావుకు కేవలం 15.45 శాతం ,  1998 ఎన్నికల్లో  టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ అల్లాడి రాజ్‌కుమార్‌కు 21.58 శాతం  2009 ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి సుధీష్‌ రాంభొట్లకు 15.68 శాతం ఓట్లే లభించడం గమనార్హం. ఈ నేపథ్యంలో తెలంగాణలో పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో.. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్‌లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయిన పార్టీకి ఏమేరకు ప్రజల మద్దతు ఉందనేది ఎన్నికల్లోనే తేలనుంది.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top