ముఖం చెల్లక.. అసెంబ్లీకి రాలేక

TDP leaders say that Chandrababu and TDP MLAs intentionally did not come to the House - Sakshi

ద్వంద్వ నీతిని నిలదీస్తారనే భయంతోనే చంద్రబాబు డుమ్మా 

2004లో వ్యతిరేకించి.. ఇప్పుడు మండలి కావాలనడంపై విమర్శలు 

ప్రతిపక్ష నేత వైఖరిని తప్పుపడుతున్న విశ్లేషకులు  

సాక్షి, అమరావతి: శాసన మండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో జరిగిన చర్చకు చంద్రబాబు ముఖం చాటేయక తప్పని పరిస్థితి ఏర్పడిందని టీడీపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. మండలిలో రెండు బిల్లుల్ని ప్రజాస్వామ్యస్ఫూర్తికి విరుద్ధంగా సెలెక్ట్‌ కమిటీకి పంపిన తీరుపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత రావడం, మండలి రద్దుపై గతంలో చెప్పిన మాటలకు, ఇప్పుటి వాదనకు పొంతన లేకపోవడంతో.. కావాలనే చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు సభకు రాలేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నెల 22న మండలిలో వ్యవహరించిన తీరు, బిల్లుల్ని సెలెక్ట్‌ కమిటీకి పంపిన విధానం, గ్యాలరీలో చంద్రబాబు చేసిన హడావుడిపై అసెంబ్లీలో నిలదీస్తారనే అనుమానంతో ఆ మరుసటి రోజు అసెంబ్లీకి డుమ్మా కొట్టారు. తాజాగా మండలి రద్దు తీర్మానం కోసం నిర్వహించిన సమావేశానికీ గైర్హాజరయ్యారు. తాము చేసిన తప్పులపై అసెంబ్లీలో నిలదీస్తారనే భయంతోనే వ్యూహాత్మకంగా సభకు రాకుండా తప్పించుకున్నారనే వాదన వినిపిస్తోంది. 40 సంవత్సరాల అనుభవం, దేశ రాజకీయాల్లోనే సీనియర్‌ నేతగా చెప్పుకుంటూ.. కీలకమైన అంశంపై చర్చ జరుగుతుంటే హాజరుకాకుండా డుమ్మా కొట్టడం ఏంటని రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.  

మండలిపై చర్చించకూడదంటూ  కొత్త పల్లవి 
సోమవారం జరిగిన చర్చకు హాజరుకాకుండా మీడియా సమావేశం పెట్టి తన వాదన వినిపించడానికి చంద్రబాబు పరిమితమవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక టీడీపీ ఎమ్మెల్యేలు అధినేత బాటలో తమ అభిప్రాయాలతో టీవీ ఛానళ్లలో హోరెత్తించడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. శాసన మండలి ఉండాలా? వద్దా? అంశంపై అసెంబ్లీలో చర్చిద్దామని ముఖ్యమంత్రి నాలుగు రోజుల క్రితమే ప్రకటించారు. అయితే మండలిలో జరిగిన వ్యవహారాలపై అసెంబ్లీలో చర్చించకూడదంటూ చంద్రబాబు తమ నిర్ణయాన్ని సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. 2004లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం మండలి పునరుద్ధరణకు అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు, 2007లో మండలి పునరుద్ధరించినప్పుడు చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించారు. తాజాగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రద్దు చేస్తున్నప్పుడు కూడా అదే విధంగా.. మండలి రద్దు చేసే అధికారం సీఎంకు లేదని, అసెంబ్లీకి తీర్మానం చేసే అధికారం లేదని కొత్త పల్లవి అందుకోవడంపై విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒకే అంశంపై పరస్పర విరుద్ధంగా మాట్లాడడం ఆయన స్వార్థ రాజకీయ ప్రయోజనాల్ని తేటతెల్లం చేసిందని అంటున్నారు. 

ఏం చెప్పాలో తెలియకే: టీడీపీలో చర్చ 
అసెంబ్లీకి హాజరైతే ఈ ద్వంద్వ నీతిపై అధికార పక్షం నిలదీస్తుందనే జంకుతో సాకులు చూపి డుమ్మా కొట్టారని చెబుతున్నారు. రెండు వైఖరులపై నిలదీస్తే ఏం చెప్పాలో తెలియకే తాము అసెంబ్లీకి వెళ్లలేదని టీడీపీ ఎమ్మెల్సీ ఒకరు వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో నిలదీస్తే సమాధానం చెప్పే ధైర్యం లేకపోవడం వల్లే చంద్రబాబు వెళ్లలేదనే చర్చ టీడీపీలో జరిగిందని ఆ పార్టీ నేత ఒకరు పేర్కొన్నారు. మండలి రద్దయితే నష్టం వైఎస్సార్‌సీపీకేనని చెబుతున్నా.. తన కుమారుడు రాజకీయ నిరుద్యోగి మారిపోతాడనే ఆందోళనలో చంద్రబాబు ఉన్నారని, ఆ కారణంగానే మండలి రద్దును వ్యతిరేకిస్తున్నారనే టీడీపీ సీనియర్ల మధ్య చర్చ సాగినట్లు తెలిసింది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top