గబ్బర్‌ సింగ్‌ గురితప్పాడు... | TDP Leaders Counter Attack On Pawan Kalyan | Sakshi
Sakshi News home page

గబ్బర్‌ సింగ్‌ గురితప్పాడు...

Mar 15 2018 10:43 AM | Updated on Mar 22 2019 5:33 PM

TDP Leaders Counter Attack On Pawan Kalyan - Sakshi

సాక్షి, అమరావతి : జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పై టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగారు. చంద్రబాబు నాయుడు, లోకేశ్‌పై చేసిన వ్యాఖ్యలను పవన్‌  వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. గబ్బర్‌ సింగ్‌ గురి తప్పాడంటూ.. తక్షణమే చంద్రబాబు, లోకేశ్‌కు పవన్‌ క్షమాపణ చెప్పాలని డొక్కా మాణిక్య వరప్రసాద్‌ గురువారమిక్కడ డిమాండ్‌ చేశారు.  అర్థం పర్థం లేని విమర్శలు చేయడం సరికాదని  ఆయన అన్నారు.

లోకేశ్‌ పెద్ద నాయకుడు అవుతాడనే..
పవన్‌ టీడీపీనే టార్గెట్‌ చేశారని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మండిపడ్డారు. కేంద్రం కుట్రలో భాగంగానే పవన్‌ మాట్లాడరని, ఆయన బీజేపీతో కుమ్మక్కయ్యారని ధ్వజమెత్తారు. బీజేపీ సహకారం లేకున్నా సీఎం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారన్నారు. పవన్‌ తన కార్యకర్తలకు సూచనలు ఇవ్వకుండా టీడీపీని టార్గెట్‌ చేశారన్నారు. కేంద్రం కుట్రలో భాగంగానే పవన్‌ వ్యాఖ్యలు ఉన్నాయని, ఎర్ర చందనం స్మగ్లింగ్‌ అరికట్టడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. 90 శాతం ఎర్ర చందనం అక్రమ రవాణాను నిరోధించామని చినరాజప్ప తెలిపారు. డబ్బులు తీసుకోండి...జనసేనకు ఓటెయ్యండని పవన్‌ చెప్పడం విచారకరమన్నారు. నీతుల చెప్పే పవన్‌ డబ్బులు తీసుకోమని ఎలా చెబుతారని ప్రశ్నించారు. లోకేశ్‌ రాబోయే రోజుల్లో పెద్ద నాయకుడు అవుతాడని పవన్‌ టార్గెట్‌ చేశాడని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాలో ఎమ్మెల్యేలు  ఉన్నారనడం బాధాకరమని చినరాజప్ప అన్నారు.

పవన్‌ పార్ట్‌టైం పొలిటీషియన్‌
పవన్‌ కల్యాణ్‌ బీజేపీ స్క్రిప్ట్‌ చదువుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. రాజకీయాలు ఎన్నికల సమయంలో చేయాలని హితవు పలికారు. ‘చంద్రబాబుపై పవన్‌ అర్థంలేని ఆరోపణలు చేశారు. ఏ ఉద్దేశంతో సీఎం, లోకేశ్‌పై విమర్శలు చేశారు. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటి. బీజేపీపై ఎందుకు విమర్శలు చేయలేదు. ఆ పార్టీ ఆడినట్లు ఎందుకు ఆడుతున్నారు. లోకేశ్‌ అవినీతి గురించి ఒక్క ఆధారాన్ని చూపించండి. శేఖర్‌ రెడ్డికి లోకేశ్‌కు ఏమి సంబంధం. లోకేశ్‌కు శేఖర్‌రెడ్డికి సంబంధం ఉందని ప్రధానమంత్రి మోదీ మీకు చెప్పారా?. బీజేపీ ఓ వైపు జనసేన, మరోవైపు వైఎస్‌ఆర్‌ సీపీని పెట్టుకుని రాజకీయాలు చేస్తోంది. ప్రత్యేక హోదా ఇస్తామన్న మోదీ పేరు పవన్‌ తన ప్రసంగంలో ఎందుకు ప్రస్తావించలేదు. పవన్‌ పార్ట్‌టైం పొలిటీషియన్‌. రాష్ట్ర సమస్యలపై అతడికి అవగాహన లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏనాడైనా ప్రధాని, కేంద్ర మంత్రులను కలిశారా?. పవన్‌ వల్ల కాపులకు ఎలాంటి ఉపయోగం లేదు. ఏనాడైనా కాపుల కోసం కృషి చేశారా?. రాజకీయ ఉనికి కోసమే పవన్‌ టీడీపీపై విమర్శలు చేశారు.’ అని బోండా ఉమ మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement