వ్యాపారులకు నాయకుడి శఠగోపం

Tdp Leader Illegal Activities - Sakshi

సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా అధికార పార్టీలోని ఓ ప్రముఖ నాయకుడి అరాచకాలకు ఇది పరాకాష్ట. పల్నాడులోని ఒక నియోజకవర్గంలో ఆయన కుటుంబ సభ్యుల అక్రమాలను నిరసిస్తూ ఆ నేతకు టిక్కెట్‌ ఇవ్వొద్దని టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ కుటుంబం అవినీతిపై నియోజకవర్గంలో కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఆ నాయకుడు బంగారం వ్యాపారికి ఫోన్‌ చేసి తన కుమార్తె కోసం డిజైనర్‌ నగలు పట్టుకురావాలని సూచించారు. ఆ వ్యాపారి కొన్ని నగలు పంపగా.. కొన్నింటిని తీసుకుని మిగతావి వెనక్కి పంపించారు.

ఆ నేత తీసుకున్న నగల ఖరీదు సుమారు రూ. కోటిపైనే ఉంటుందని అంచనా. రెండ్రోజులు ఆగి తన నగలకు డబ్బులు ఇవ్వాలని వ్యాపారి ఆ నాయకుడికి ఫోన్‌ చేస్తే స్పందించలేదు. రెండోరోజు నగల వ్యాపారి నేరుగా ఇంటికెళ్లి అడగ్గా.. ‘ఏమయ్యా...నా కూతురు కోసం నగలు పంపించావ్‌. ఆ అమ్మాయికి నగలు నచ్చాయి. తీసుకుంది. ఇందులో సమస్య ఏముంది. నీకూతురైతే ఒకటీ, నాకూతురైతే ఒకటా...’అంటూ సెలవిచ్చారు. ‘అదేంటి సార్‌...కోటి రూపాయలు అంటూ’ ఆ వ్యాపారి బిక్కమొఖం వేశాడు. నాకు పంపిన నగలు మళ్లీ అడుగుతావంటయ్యా...వెళ్లు ...లేదంటే బావుండదంటూ ఆ నాయకుడు కసురుకున్నాడు. ఆ ఊర్లో వ్యాపారం చేస్తున్నందుకు రూ. కోటి పన్ను కట్టాల్సి వచ్చిందని సన్నిహితుల వద్ద ఘొల్లుమన్నాడు ఆ వ్యాపారి. నరసరావుపేటలో ఈ విషయం పెద్ద చర్చనీయాంశమైంది. 

నా స్వీట్ల డబ్బుల మాటేంటి? 
 ఇక ఆ సదరు నాయకుడి అల్లుడు ఆస్పత్రి పెడుతూంటే దాని ఓపెనింగ్‌కు స్వీట్లు కావాలని ఓ వ్యాపారికి కబురు పంపారు. ఆ వ్యాపారి ఖరీదైన స్వీట్లు పంపించారు. బిల్లు రూ.లక్ష వరకూ అయింది. డబ్బులివ్వమని అడగ్గా...‘ఏం తమాషా చేస్తున్నావా..నెలకు రూ.10 లక్షలు వ్యాపారం చేస్తున్నావట. మర్యాదగా నెలకు రూ.లక్ష కట్టు’ అంటూ ఆ వ్యాపారిని బెదిరించారు. చివరకు బతిమలాడుకున్న స్వీటు వ్యాపారి నెలకు రూ.50 వేలు కట్టేలా మాట్లాడుకున్నాడుట. 

ఆందోళనలో పార్టీ శ్రేణులు 
ఆ కుటుంబంపై నియోజకవర్గంలోని టీడీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆయన్ను నిలబెడితే ఓటమి ఖాయమని, అభ్యర్థిని మార్చాలని అధినేతపై ఎంత ఒత్తిడి తెచ్చిన ఫలితం లేకపోయింది. అతనికే టిక్కెట్‌ కేటాయించడంతో ఏం చేయాలో తెలియక పార్టీ శ్రేణులు గందరగోళంలో పడ్డాయి.   

సెట్‌టాప్‌ బాక్సుల పైనా పన్ను వసూలు
బాధలో ఉన్న ఆ స్వీట్‌ వ్యాపారికి దగ్గరికి ఒక ఆటోడ్రైవర్‌ తన గోడు వెళ్లబోసుకున్నాడట. ‘సార్‌. మీకు స్వీట్లు పోయాయి. నేను సెట్‌టాప్‌ బాక్సులు సప్లై చేసేవాడిని. ఒక్కోదానికి రూ.300 వసూలు చేశారు నా దగ్గర. చివరకు ఆ వ్యాపారం వదిలేసుకుని ఆటో నడుపుకుంటున్నా’ అంటూ సెలవిచ్చాడు ఆటోవాలా.    

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top