ఏఎన్‌యూ(పెదకాకాని): దేశ ఐక్యత, సమగ్రతను బలోపేతం చేయడంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని వర్సిటీ వీసీ ఆచార్య కె.గంగాధరరావు అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మై భారత్ కేంద్రం గుంటూరు వారు నిర్వహిస్తున్న అంతర రాష్ట్ర యువజన మార్పిడి సమ్మేళనం రెండో దశ కార్యక్రమం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఏఎన్‌యూలో జరిగిన ఈ కార్యక్రమానికి త్రిపుర రాష్ట్రం నుంచి మొత్తం 37 మంది యువతి యువకులు పాల్గొన్నారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ సమ్మేళనంలో సంస్కృతి, ఉపాధి అవకాశాలు, సాంకేతికత వంటి అంశాలపై పరస్పర అవగాహన పెంపొందించుకోవడంతో పాటు ప్రాంతీయ జానపద నృత్య ప్రదర్శనలు, క్షేత్రస్థాయి సందర్శనలు వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మై భారత్ గుంటూరు జిల్లా ఉపసంచాలకులు కిరణ్మయి దేవిరెడ్డి తెలిపారు. ప్రొఫెసర్ కె. గంగాధరరావు మాట్లాడుతూ దేశ ప్రజల మధ్య ఉన్న భావోద్వేగ బంధాలను బలోపేతం చేయడంలో ఇటువంటి యువజన సమ్మేళనాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎనన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఎం.సుధాకర్, మై భారత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంచాలకులు అంశుమాన్ ప్రసాద్ దాస్ మాట్లాడారు. కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ ఆర్.శివరాం ప్రసాద్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.సింహాచలం, ఓఎస్‌డీ ప్రొఫెసర్ ఆర్‌వీఎస్‌ఎస్‌ఎన్ రవి కుమార్, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ దివ్యతేజోమూర్తి తదితరులు గౌరవ అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో యువత సాంస్కృతిక నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.


