యడ్డీ ప్రమాణాన్ని అడ్డుకోలేం!

Supreme Court Refuses To Stay Swearing-in Ceremony - Sakshi

సుప్రీంకోర్టు స్పష్టీకరణ

కర్ణాటక రాజకీయంపై బుధవారం అర్ధరాత్రి హైడ్రామా

న్యూఢిల్లీ: కర్ణాటక రాజకీయంపై సుప్రీంకోర్టులో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకూ నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.  ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకోవాలని కాంగ్రెస్‌–జేడీఎస్‌లు సుప్రీంలో ఉమ్మడి పిటిషన్‌ దాఖలు చేయగా.. ప్రమాణ స్వీకారంపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్‌–జేడీఎస్‌ కూటమికి మెజార్టీ ఉండగా.. బీజేపీ నేత యడ్యూరప్పను ప్రమాణస్వీకారానికి గవర్నర్‌ ఆహ్వానించారని, దానిని అడ్డుకోవాలని అర్థరాత్రి 12 గంటల సమయంలో కాంగ్రెస్‌–జేడీఎస్‌లు సుప్రీం తలుపుతట్టాయి. అప్పటికప్పుడే వాదనలు వినాలని ఆ పార్టీ తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ఇంటికి వెళ్లి అభ్యర్థించారు. దీంతో జేడీఎస్‌–కాంగ్రెస్‌లు ఉమ్మడిగా దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ కోసం అప్పటికప్పుడు జస్టిస్‌ ఏకే సిక్రీ, జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌లతో కూడిన ప్రత్యేక ధర్మాసనాన్ని సీజేఐ ఏర్పాటు చేశారు. గురువారం తెల్లవారుజామున 2.11 గంటలకు కాంగ్రెస్‌–జేడీఎస్‌ పిటిషన్‌పై ప్రత్యేక ధర్మాసనం విచారణ ప్రారంభించింది. 5.28 గంటలకు మధ్యంతర ఆదేశాలిస్తూ.. ‘ యడ్యూరప్ప ప్రమాణస్వీకారంపై మేం స్టే ఇవ్వలేం. అయితే ప్రమాణస్వీకారం, కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు అనేవి కేసు తుది తీర్పునకు లోబడి ఉంటాయి’ అని స్పష్టం చేసింది.  

గవర్నర్, యడ్యూరప్ప లేఖల్ని సమర్పించండి..
మెజార్టీ ఉన్న కాంగ్రెస్‌–జేడీఎస్‌ కూటమిని ఆహ్వానించకపోవడం అప్రజాస్వామికమని, గురు వారం ఉదయం 9 గంటలకు ప్రమాణస్వీకారం ఉండడం వల్లే అర్ధరాత్రి సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని కాంగ్రెస్‌–జేడీఎస్‌ల తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేశ్‌ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. యడ్యూరప్ప ప్రమాణస్వీకారంపై స్టే విధించాలని, లేదంటే వాయిదా వేయాలని ఆయన ధర్మాసనాన్ని కోరారు. అందుకు సుప్రీం నిరాకరిస్తూ.. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని కర్ణాటక గవర్నర్‌ వజూభాయ్‌ వాలాకు యడ్యూరప్ప పంపిన లేఖ, యడ్యూరప్పను ఆహ్వానిస్తూ గవర్నర్‌ పంపిన సమాధానాన్ని శుక్రవారంలోగా తమ ముందు ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.  తదుపరి విచారణను శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ధర్మాసనం వాయిదావేసింది.

అర్ధరాత్రి పిటిషన్‌ వేయాల్సిన అవసరమేంటి?
ఈ కేసులో కేంద్రం తరఫున అటార్నీ జనరల్‌ వేణుగోపాల్, బీజేపీ ఎమ్మెల్యేలు గోవింద్‌ కర్జోల్, ఉదాసి, బసవరాజ్‌ బొమ్మైల తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీలు వాదనలు వినిపిస్తూ.. ప్రమాణ స్వీకారం వాయిదా, స్టే విధించాలన్న అభ్యర్థనను వ్యతిరేకించారు. ‘యడ్యూరప్ప, గవర్నర్‌ల మధ్య సమావేశంలో ఏం జరిగిందో మనకు తెలియదు. మొత్తం వ్యవహారం అస్పష్టంగా ఉంది. ఇంతవరకూ అన్నీ ఊహాగానాలే’ అని వేణుగోపాల్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి పిటిషన్‌ దాఖలు చేయడాన్ని రోహత్గీ ప్రశ్నిస్తూ.. ‘ఒకరి ప్రమాణ స్వీకారంతో ఏదైనా ఘోరం జరిగిపోతుందా? ఇది చావు బతుకుల సమస్యో లేక ఎవరినో ఉరితీస్తున్న అంశమో కాదు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు పార్టీని ఆహ్వానించడం గవర్నర్‌కున్న రాజ్యాంగ విధి.. ఆయన చర్యలు ఎప్పుడూ న్యాయ సమీక్షకు లోబడి ఉంటాయి. అరుణాచల్‌ ప్రదేశ్‌ కేసులో లాగానే యథాపూర్వ స్థితిని కొనసాగించమని కోర్టు ఆదేశించవచ్చు’ అని రోహత్గీ వాదించారు.  ఆ సయయంలో సింఘ్వీ జోక్యం చేసుకుంటూ.. బలనిరూప ణ కోసం గవర్నర్‌ 15 రోజుల గడువు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. అలా చేయడం వల్ల ప్రలోభాలకు, ఎమ్మెల్యేల కొనుగోలుకు దారితీసే ప్రమాదముందన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top