నేడు మధ్యప్రదేశ్‌లో బలపరీక్ష

Supreme Court asks Kamal Nath to face floor test Friday - Sakshi

బలం నిరూపించుకోవాలని కమల్‌నాథ్‌కు సుప్రీంకోర్టు ఆదేశం

నేడు ప్రత్యేకంగా సమావేశం కానున్న మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ

న్యూఢిల్లీ/భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని కమల్‌నాథ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశ పరిచి, బలం నిరూపణ జరపాలని స్పీకర్‌ ఎన్‌పీ ప్రజాపతిని ఆదేశించింది. కాంగ్రెస్‌కు చెందిన కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా కాషాయ దళంలో చేరడం, ఆయనతోపాటు 22 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు శాసన సభ్యత్వానికి రాజీనామా చేయడంతో కమల్‌నాథ్‌ ప్రభుత్వం సంక్షోభంలో పడిన విషయం తెలిసిందే.

సభలో విశ్వాస పరీక్షను ఎదుర్కోకుండా కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో అసెంబ్లీని 26వ తేదీకి స్పీకర్‌ వాయిదా వేయడాన్ని సవాల్‌ చేస్తూ బీజేపీ నేత, మాజీ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్, మరో ఎంపీ పిటిషన్లు వేశారు. గురువారం ఈ పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ హేమంత్‌ గుప్తాల ధర్మాసనం దాదాపు 8 సూచనలను వెలువరించింది. ‘అనిశ్చిత పరిస్థితులను చక్కదిద్దేందుకు సభలో విశ్వాస పరీక్ష జరపాలని సూచిస్తున్నాం.

ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సభ మద్దతు ఉన్నదీ లేనిదీ నిర్ధారించేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలి. సభ్యులు చేతులు ఎత్తి విశ్వాసం ప్రకటించాలి’అని స్పీకర్‌ను ధర్మాసనం ఆదేశించింది. ‘బెంగళూరులో ప్రస్తుతం మకాం వేసి ఉన్న 16 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై ఎలాంటి ఒత్తిడులు, అడ్డంకులు లేకుండా చూడాలి. ఇతర పౌరుల మారిదిగానే వారిని స్వేచ్ఛగా ఉండనివ్వాలి’అని మధ్యప్రదేశ్, కర్ణాటక డీజీపీలను ఆదేశించింది. ‘అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలనుకున్న ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించాలి.

సభా కార్యక్రమాలను వీడియో తీయించాలి. నిబంధనలకు లోబడి విశ్వాస పరీక్షను లైవ్‌లో కూడా ప్రసారం చేయవచ్చు. విశ్వాస పరీక్ష సమయంలో సభలో శాంతి, భద్రతలకు విఘాతం కలగరాదు. ఈ కార్యక్రమాలన్నీ మార్చి 20వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు ముగియాలి. ఈ సమాచారాన్ని గవర్నర్‌కు తెలియజేయాలి’అని స్పీకర్‌కు, అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాలపై బీజేపీ హర్షం వ్యక్తం చేసింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top