సన్నీ డియోల్‌పై ట్వీట్ల మోత

sunny deols tickles twitter1 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘బోర్డర్‌’ బాలీవుడ్‌ చిత్రం ద్వారా ప్రేక్షకులకు కించిత్తు దేశభక్తి, కించిత్తు జాతీయవాదాన్ని పంచిన బాలివుడ్‌ నటుడు సన్నీ డియోల్‌ మంగళవారం నాడు బీజేపీలో చేరారని తెలియగానే వరుస ట్వీట్లతో ట్విటర్‌ ఉరకలెత్తింది. 2001లో వచ్చిన చిత్రం ‘గదర్‌: ఏక్‌ ప్రేమ్‌ కథా’ చిత్రంలో తన పాకిస్థానీ భార్యను తెచ్చుకోవడానికి అక్కడికి వెళ్లిన సన్నీ పాక్‌ స్థానికులతో పోరాడాల్సి రావడం, ఆవేశంతో రోడ్డు పక్కనున్న బోరింగ్‌ పంపు హాండిల్‌ ఊడపీకి వారిని తుక్కుతుక్కు కొట్టడం తెల్సిందే. ఈనేపథ్యంలో సన్నీ డియోల్‌ బీజేపీలో చేరారని తెలియగానీ పాకిస్థాన్‌లో బోరింగ్‌ పంపులకు గొలుసులతో తాళాలు వేస్తున్నట్లు ప్రతీకాత్మక చిత్రాన్ని ట్వీట్‌ చేశారు. 

బోరింగ్‌ హాండిల్‌ను పట్టుకున్న సన్నీ డియోల్‌ ఫొటోను ట్వీట్‌ చేస్తూ ‘పాకిస్థాన్‌పైకి మరో సర్జికల్‌ స్టైక్స్‌కు వెళుతున్న సన్నీ’ అంటూ కామెంట్‌ చేశారు. మరోసారి పాకిస్థాన్‌ ఎఫ్‌ 16 యుద్ధ విమానం రానియ్యి, దాని సంగతి చెబుతా అన్నట్లు భుజం మీద శతఘ్ని ఎక్కు పెట్టిన సినిమా స్టిల్‌ను మరొకరు పోస్ట్‌ చేశారు. వాటర్‌ మినిస్టర్‌ ఇక సన్నీయేనంటూ ఇంకొకరు కామెంట్‌ చేశారు. కాంగ్రెస్‌ హస్తంకన్నా సన్నీ హస్తం బలమైనదని ఒకరు, సన్నీ బీజేపీలో చేరడం వల్ల పార్టీ రెండుంబావు కిలోల బరువు పెరిగినట్లు మరొకరు కామెంట్‌ చేశారు. ఈ కామెంట్‌ అర్థం కావాలంటే సన్నీకి నటుడిగా మంచి పేరు తెచ్చి పెట్టిన 1993 నాటి ‘దామిని’ చిత్రం దశ్యంలోకి వెళ్లాల్సిందే. ‘జబ్‌ యే దాయి కిలోకా హాత్‌ కిసీ పే పడ్తా హై, తో ఆద్మీ హుడతా నహీ, ఉడ్‌ జాతా హై (ఈ రెండుంబావు కిలోల చేయి దెబ్బ పడిందంటే ఎవరైనా సరే మళ్లీ లేవడు. పోతాడు)’ అంటూ అమ్రేష్‌ పురిని ఉద్దేశించి పవర్‌ ఫుల్‌ డైలాగ్‌ విసురుతారు.

సన్నీ డియోల్‌ ‘బోర్డర్‌’ చిత్రం ద్వారా దేశభక్తిని, జాతీయవాదం స్ఫూర్తిని కలిగించారని కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యానించారు. ఆమె, కేంద్ర రైల్వే మంత్రి పీయుష్‌ గోయల్‌ సమక్షంలోనే సన్నీ డియోల్‌ బీజేపీలో చేరిన విషయం తెల్సిందే. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top