యువ మంత్రం.. పార్టీల తంత్రం

Social media usage in pilitics - Sakshi

కొత్త ఓటర్లను ఆకర్షించేలా వ్యూహాలు

విస్తృతంగా సోషల్‌ మీడియా వినియోగం

యువతను భాగస్వాములను చేస్తూ కార్యక్రమాలు

‘‘యువ ఓటర్లూ.. ఎన్నికల్లో చురుకుగా పాల్గొనండి. మీ ఓటుతో ప్రజాస్వామ్య పండుగలో భాగస్వాములు కండి..’’.. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ శనివారం ఉదయం చేసిన ట్వీట్ల సారాంశమిది. ఇలాంటివి మామూలే కదాని చాలామంది అనుకోవచ్చు.. కానీ ఒక్క కర్ణాటక ఎన్నికల్లోనే కాదు.. ఏడాదిలోగా జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లోనూ యువ ఓటర్లే కీలకం కానుండటంతో ఈ పిలుపునకు ప్రాధాన్యమేర్పడింది.

దేశంలో దాదాపు 15 కోట్ల మంది వరకూ ఉన్న యువ (18 నుంచి 23 ఏళ్ల మధ్య వయసు వారు) ఓటర్లను ఆకర్షిం చేందుకు ప్రధాన పార్టీలు తమదైన రీతిలో ప్రణా ళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. 2014 ఎన్నికల్లో బీజేపీ విజయంలో యువ ఓటర్లే కీలక పాత్ర పోషించడంతో ఆ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి బీజేపీ ఇప్పట్నుంచే వ్యూహాలు రచిస్తుండగా.. రాహుల్‌ గాంధీ ఆధ్వర్యంలో తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్న కాంగ్రెస్‌ కూడా అదే తరహా ఆలోచనలతో ముందుకెళుతోంది.

యువ ఓటర్లపై ఎందుకు టార్గెట్‌?
ఎన్నికల గెలుపోటముల్లో ఏయే అంశాలు నిర్ణాయక పాత్ర పోషిస్తాయనేది పరిశీలిస్తే... అధికారంలో ఉన్నవారిపై వ్యతిరేకత, కుల సమీకరణాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటివరకు ముందంజలో ఉండేవి. ఇప్పుడు వీటికి తోడుగా యువ ఓటర్లు వచ్చి చేరారు. 2014 ఎన్ని కల్లో మోదీ ప్రధాని కావడంలో యువ ఓటర్లది కీలక పాత్రేనన్న అంచనాలున్నాయి.

సోషల్‌ మీడియా విస్తృతి పెరుగుతున్న సమయంలో.. మోదీ దానినే వేదికగా చేసుకుని యువ ఓటర్లను ఆకర్షించారు. వాస్తవానికి అప్పట్లో భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌ వినియోగించేవారి సంఖ్య 14 కోట్లు మాత్రమే.. 2019 నాటికి ఈ సంఖ్య ఏకంగా 69 కోట్లకు చేరుతుందన్న అంచనాలున్నాయి. అందువల్ల ఈ సారి ఇతర పార్టీలూ సోషల్‌ మీడియా దారిలో ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నా యి.

దీనికితోడు 2019లో ఓటేయబోయే యువ ఓటర్ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో.. రాజకీయ పార్టీలన్నీ వారిపైనే దృష్టి సారించాయి. యువ ఓటర్లు స్వతంత్రంగా ఆలోచించి నిర్ణ యాలు తీసుకుంటారని.. తమ కుటుంబం మద్దతు ఇస్తోంది కదాని ఏదైనా ఒక రాజకీయ పార్టీకే ఓటేసే పరిస్థితి ఉండదనే అంచనాలు ఉన్నా యి. ఈ నేపథ్యంలో యువ ఓటర్లు ఏ పార్టీవైపు మొగ్గు చూపిస్తే ఆ పార్టీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

యువ నాయకత్వంపై కాంగ్రెస్‌ దృష్టి  
రాహుల్‌గాంధీ కర్ణాటక ఎన్నికల ప్రచార సభలకు యువత పోటెత్తడంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి యువ ఓటర్లను మరింతగా ఆకర్షించడానికి ఆ పార్టీ వ్యూహకర్త శామ్‌ పిట్రోడా వ్యూహాలు రచిస్తున్నారు. భారత్‌ భవిష్యత్‌ అన్న పేరుతో కాలేజీ స్థాయిలో విద్యార్థులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. నాయకత్వ లక్షణాలున్న యువకులను గుర్తించి రాజకీయాల్లో రాణించేలా వారికి శిక్షణ ఇచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

ప్రభుత్వాల పనితీరుతోపాటు విధాన నిర్ణయాల వెనుక ఉండే రాజకీయ పరిస్థితులు వంటి అంశాలపై ఈ యువ నేతలకు అవగాహన కల్పించేందుకు బూట్‌ క్యాంపులు నిర్వహించాలన్నది కాంగ్రెస్‌ యోచనగా కనిపిస్తోంది. ‘మేం వింటున్నాం’ పేరుతో దేశవ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో విద్యార్థులతో ముఖాముఖి చర్చలకూ ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.

కాం గ్రెస్‌ సీనియర్‌ నాయకులు పి.చిదంబరం, అజయ్‌మాకెన్, సచిన్‌ పైలట్‌తోపాటు శామ్‌ పిట్రోడా వంటివారు వాటిలో పాల్గొంటారు. కాంగ్రెస్‌ విధానాల ద్వారా దేశానికి జరిగిన మేలు ఏమిటో వివరించడం ఈ ముఖాముఖి చర్చల ముఖ్య ఉద్దేశం. ఇక ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో ‘అభివృద్ధి ఎక్కడ?’ పేరుతో యువత పాల్గొనేలా పోస్టుకార్డు ఉద్యమాన్ని కాంగ్రెస్‌ చేపట్టనుంది.

యూనివర్సిటీలే లక్ష్యంగా బీజేపీ
యువతలో ప్రధాని మోదీకి ఉన్న ఛరిష్మానే బీజేపీ ప్రధానంగా నమ్ముకుంది. ఒక ప్రణాళిక ప్రకారం మోదీ స్వయంగా యువతతో నేరుగా అనుసంధానమయ్యే అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటున్నారు. మన్‌ కీ బాత్‌ కార్యక్రమం, నమో యాప్‌ ద్వారా నూతన భారత్‌ ఆవిర్భావానికి తీసుకున్న చర్యల్ని యువతలోకి తీసుకువెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు విద్యార్థుల్ని ఆకర్షించడం కోసమే ఎగ్జామ్‌ వారియర్స్‌ అన్న పుస్తకాన్ని కూడా మోదీ రాశారు.

ఇక ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా యువ ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎన్నో యూనివర్సిటీల్లో ఏబీవీపీ ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టింది. ఈశాన్య రాష్టాల్లో గిరిజన యువత కోసం ప్రత్యేకంగా విద్య, క్రీడలకు సంబం«ధించిన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. హిందూత్వ కార్డును కూడా యువ ఓటర్లపై ప్రయోగించడం, ఏబీవీపీ కార్యకర్తలు స్వయంగా హాస్టళ్లకు వెళ్లి మోదీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది.

బీజేపీ ముఖ్యంగా మిలీనియం ఓటర్లను ఆకర్షించి, వారిని పార్టీలో చేర్చుకునే పనిలో ఉంది. ఇందుకోసం మిలీనియం ఓటర్‌ క్యాంపెయిన్‌ పేరుతో ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. ఏబీవీపీ కార్యకర్తలు ప్రతీ మండలం తిరుగుతూ ఓటర్లను గుర్తించే పని మొదలు పెట్టారు.

లోక్‌సభకు ఓటేసే యువ ఓటర్ల తీరు..
2014 ఎన్నికల్లో మొత్తం ఓటర్లు  - 83.41 కోట్లు
ఆ ఎన్నికల్లో కొత్త (యువ) ఓటర్లు - 11.72 కోట్లు
2019లో మొత్తం ఓటర్లు (అంచనా) - 85 కోట్లకుపైగా
కొత్త ఓటర్లు (దాదాపుగా) - 15 కోట్లు
మిలీనియం ఓటర్లు  (2000)సంవత్సరంలో పుట్టినవారు) - 2 కోట్లు

వ్యూహాలు ఎలా మారుతున్నాయంటే?  
యువ ఓటర్లను ఆకట్టుకునే వ్యూహాలు ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉన్నాయి. 2014 ఎన్నికల్లో కొత్త ఓటర్లను ఆకర్షించడానికి కాంగ్రెస్‌ నిర్దిష్టమైన ప్రయత్నాలేవీ చేయలేదు. కానీ బీజేపీ మాత్రం పకడ్బందీ వ్యూహాలు రచించింది. యువ ఓటర్లను ఆకట్టుకోవడానికి మోదీ సోషల్‌ మీడియాను బాగా వినియోగించుకున్నారు. ‘చాయ్‌ పే చర్చ’ వంటి కార్యక్రమాల్లోనూ యువత పాల్గొనేలా చూసుకున్నారు.

2015–17 మధ్య కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో ఫేస్‌బుక్‌తో పాటుగా వాట్సాప్‌ ప్రచారం కూడా యువ ఓటర్ల ను ఆకర్షించేలా సాగింది. బిహార్‌ ఎన్నికల సమయంలో నితీశ్‌కుమార్‌ కొన్ని కామిక్‌ వీడియోలను తయారు చేసి ప్రచారానికి వినియోగించుకున్నా రు. ఇక పంజాబ్‌ ఎన్నికల్లో అమరీందర్‌ సింగ్‌ కాఫీ విత్‌ కెప్టెన్‌ అనే కార్యక్రమంలో కాలేజీల్లో లీడర్లని కూడా భాగస్వాముల్ని చేసి ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఇక 2019 నాటికి సోషల్‌ మీడియా ప్రచారం ఉధృతంగా సాగే అవకాశాలున్నాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top