సీఎం పదవిపై సంజయ్‌ రౌత్‌ కీలక వ్యాఖ్యలు

Shiv Sena leader Sanjay Raut Comments on Maharashtra CM Post - Sakshi

ముంబై: ఛాతినొప్పి కారణంగా ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో  చేరిన శివసేన పార్టీ సీనియర్‌ నాయకుడు, ఎంపీ సంజయ్‌ రౌత్‌ బుధవారం డిశ్చార్జ్‌ అయ్యారు. లీలావతి ఆస్పత్రి నుంచి ఇంటికి బయలుదేరిన ఆయన విలేకరులతో క్లుప్తంగా మాట్లాడారు. మహారాష్ట్ర సీఎం పదవి శివసేనదేనని, తదుపరి ముఖ్యమంత్రిగా శివసేన నేత పగ్గాలు చేపట్టనున్నారని ఆయన స్పష్టం​ చేశారు. ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి శివసేన సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైతే.. శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే సీఎం అవుతారన్న వాదన వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
చదవండి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనే!!

సీఎం పదవిని మాకూ పంచాల్సిందే!
ప్రస్తుత అధికార పంపిణీ విషయంలో శివసేన-ఎన్సీపీ మధ్య చర్చలు ప్రారంభమైనట్టు సమాచారం. ఫిఫ్టీ-ఫిఫ్టీ ఫార్ములాను తెరపైకి తీసుకొచ్చిన ఎన్సీపీ.. ముఖ్యమంత్రి పదవీకాలాన్ని చెరిసగం పంచాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. మొదటి రెండున్నరేళ్లు శివసేన సీఎం పదవిని చేపడితే..  ఆ తర్వాతి రెండేన్నరేళ్లు తమకు ఆ పీఠాన్ని అప్పగించాలని ఎన్సీపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నట్టు సమాచారం.  ఈ డిమాండ్‌తో సంకీర్ణ పక్షాల మధ్య పీటముడి కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక, కాంగ్రెస్‌ పార్టీ కీలకమైన స్పీకర్‌ పదవి కోరుతున్నట్టు సమాచారం. మొత్తానికి పదవుల పంపకాలు కొలిక్కి వస్తే... వచ్చేనెలలోపే ఈ మూడు పార్టీలు కలిసి సంకీర్ణ సర్కార్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది.

ఛాతి నొప్పి కారణంగా గత సోమవారం సంజయ్‌ రౌత్‌ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం శివసేన నేత సంజయ్‌రౌత్‌ దూకుడుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి పదవిని చెరిసగం పంచాల్సిందేనని ఆయన బీజేపీకి అల్టిమేటం ఇచ్చారు. అందుకు బీజేపీ ఒప్పుకోకపోవడంతో ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top