మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనే!!

NCP Demands Uddhav Thackeray to be the Chief Minister - Sakshi

ముంబై: మహారాష్ట్రలో కొత్త పొత్తు పొడిచే అవకాశం కనిపిస్తోంది. బీజేపీతో కటీఫ్‌ చెప్పిన శివసేన.. ఎన్సీపీ, కాంగ్రెస్‌ పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటులో శివసేనకు మద్దతునిస్తామని ఎన్సీపీ ఇప్పటికే  స్పష్టంచేయగా.. కాంగ్రెస్‌ పార్టీ కూడా సానుకూలంగానే నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌తో చర్చించిన తర్వాత ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్‌ అధికారికంగా ప్రకటించింది. ఇదే విషయమై పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తన నివాసంలో పార్టీ నేతలతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. శివసేన ప్రభుత్వాన్ని బయటినుంచి మద్దతునివ్వాలని కాంగ్రెస్‌ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌ నిర్ణయం కోసం వేచిచూస్తున్న శివసేన ప్రభుత్వ ఏర్పాటులో తమకు మరికొంత గడువు ఇవ్వాలని గవర్నర్‌ కోరింది. ఈ మేరకు ఆ పార్టీ నేతలు గవర్నర్‌ బీఎస్‌ కోశ్యారీని కలిశారు.
(చదవండి: శివసేనకు ట్విస్ట్‌ ఇచ్చిన కాంగ్రెస్‌..!)

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటకు మ్యాజిక్‌ ఫిగర్‌ 145 కాగా.. శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్‌ 44 స్థానాల్లో గెలుపొందిన సంగతి తెలిసిందే. మరో ఆరుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా శివసేన సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు పలికారు. దీంతో సంకీర్ణ కూటమి బలం 160కి చేరుకుంది. దీంతో సునాయసంగా సేన కూటమి సునాయసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో సేన నుంచి ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్నది ఆసక్తి రేపుతోంది. శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే సీఎం అవుతారన్న వాదన వినిపిస్తోంది. ఎన్సీపీ కూడా ఇదే డిమాండ్‌ చేస్తోందని, ఉద్ధవ్‌ను సీఎం చేయాలని, అజిత్‌ పవార్‌కు డిప్యూటీ సీఎం పోస్ట్‌ ఇవ్వాలని ఎన్సీపీ పట్టుబడుతున్నట్టు సమాచారం. అయితే, సీఎం పదవి కోసం గట్టిగా లాబీయింగ్‌ చేస్తున్న ఓ సీనియర్‌ శివసేన నేత.. ఠాక్రే సీఎం అయితే, తిరుగుబాటును లేవనెత్తవచ్చునని స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top