మంత్రులకు శాఖలు లేకపోయినా మైండ్‌ ఉంది: ఠాక్రే

Shiv Sena Fires On BJP In Saamna Editorial - Sakshi

సాక్షి, ముంబై: మహారాష్ట్రలో కొలువుతీరిన మహా వికాస్‌ ఆఘాడి (శివసేన) ప్రభుత్వంపై ప్రతిపక్ష బీజేపీ విమర్శల బాణం ఎక్కుపెట్టింది. ప్రభుత్వం ఏర్పడి కొద్ది రోజులే అవుతున్నా.. కుదురుకునే సమయం కూడా ఇవ్వకుండా ఎదురుదాడిని ప్రారంభించింది. అధికారంలో కేవలం పదవులు పంపకాల కోసమే మూడు పార్టీలు జట్టుకట్టాయని బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ప్రభుత్వం ఏర్పడి 10 రోజులకుపైగా కావస్తున్నా.. మంత్రులకు శాఖలు (పోర్టుఫోలియో) కేటాయించకపోవడం ముఖ్యమంత్రి వైఫల్యంగా ఎత్తిచూపింది. మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోలేని ఉద్ధవ్‌ ప్రభుత్వం ఇక ప్రజల మంచి పాలన ఏ విధంగా అందించగలదని ప్రశ్నించింది. ఈ మేరకు బీజేపీ సీనియర్‌ నేత అశీష్‌ షెల్లర్‌ శుక్రవారం రాత్రి నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రభుత్వంపై విమర్శలకు దిగారు.

అయితే వీటన్నింటినీ ఉద్ధవ్‌ ప్రభుత్వం గట్టిగానే తిప్పికొట్టింది. తమకు 80 రోజులు ఉండే ప్రభుత్వం కాదని, ఐదేళ్ల పూర్తికాలం పనిచేసే ప్రభుత్వం అని కౌంటర్‌ ఇచ్చింది. ఈమేరకు శనివారం శివసేన అధికార పత్రిక సామ్నాలో ఎడిటోరియల్‌ను ప్రచురించింది. ‘మంత్రివర్గ విస్తరణపై ప్రభుత్వానికి లేని తొందర ప్రతిపక్షానికి ఎందుకు. మా మంత్రులకు శాఖలు (పోర్టుఫోలియో)లు లేకపోయిన తెలివి (మైండ్‌) ఉంది. ప్రభుత్వాన్ని ఎలా నడిపించాలో మాకు అవగహన ఉంది. మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. సర్దుకోవడానికి కొంత సమయం పడుతుంది. దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయి నేతృత్వంలో 22 పార్టీలకు పైగా కలిసి ఎన్డీయేగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఆ ప్రభుత్వం ఐదేళ్లపాటు విజయవంతగా సాగింది. మేం​కూడా అంతే 80 రోజులు పాలించే పార్టీలు కాదు. ఐదేళ్లు కొనసాగే ప్రభుత్వం’ అని ఎడిటోరియల్‌లో పేర్కొంది. కాగా శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో.. ఆ పార్టీ ఎంపీ సంజయ్‌ రౌత్‌ ప్రస్తుతం సామ్నా వ్యవహారాలు చూసుకుంటున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top