ముందస్తు ఎన్నికలు మరింత ముందుకు..!

Sense of Early Polls For Parliament As BJP Lost in rajasthan - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రాజస్థాన్‌లోని రెండు లోక్‌సభ, ఒక అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించడం పట్ల కేంద్రంలోని పాలకపక్షం భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో ఆందోళన మొదలైంది. బీజేపీ పట్లనున్న వ్యతిరేకత కారణంగానే కాంగ్రెస్‌ పార్టీ మండల్‌ గఢ్‌ అసెంబ్లీ స్థానాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా అల్వర్, అజ్మీర్‌ లోక్‌సభ స్థానాలను భారీ మెజారిటీతో కైవసం చేసుకొందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ వ్యతిరేకత మరింత పెరగక ముందే, అంటే ఈ ఏడాదే రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్‌ ఎన్నికలకు వెళ్లడం మంచిదని బీజేపీ మేధావులు యోచిస్తున్నట్లు తెల్సింది. పార్లమెంట్‌లో గురువారం నాడు కేంద బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఒక్క ఎన్నికల తేదీలను తప్ప ఎన్నికలకు సంబంధించిన అన్ని అంశాలను ప్రకటించారని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఓ కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు.

పట్టణ ప్రాంతాల్లో బలంగా ఉన్న బీజేపీ పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా పట్టును కోల్పోతుందని గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళి తెలియజేయడంతో బడ్జెట్‌లో గ్రామీణ ప్రాంతాలకు అధిక ప్రాధాన్యతనిచ్చిన విషయం తెల్సిందే. గిట్టుబాటు ధరలు లేక గతేడాది రైతులు దేశవ్యాప్తంగా ఆందోళన చేయడం కూడా బడ్జెట్‌లో రైతులకు ప్రాధాన్యం ఇవ్వడానికి కారణం.

బడ్జెట్‌ కేటాయింపులను ప్రచారం చేసి గ్రామీణ ప్రాంతాలను ఆకర్షిస్తామంటే సరిపోదని, సాధ్యమైనంత త్వరగా పార్లమెంట్‌ ఎన్నికలకు వెళ్లడం మంచిదని పార్టీ సీనియర్లు భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని మోదీ కూడా ముందస్తు ఎన్నికలకు మొగ్గు చూపుతున్నారని గత కొన్ని రోజులుగా తెగ ప్రచారం అవుతున్న విషయం తెల్సిందే.

‘2014 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ పిలుపునకు స్పందించి ప్రజలు పార్టీకి ఓటేశారు. ఈ సారి చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేకత పెరిగినందున ఆయన పిలుపు అంతగా ప్రభావం చూపే అవకాశం లేదు. ముందస్తు ఎన్నికలకు వెళ్లడమే మంచిది’  అని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని మరో బీజేపీ నాయకుడు వ్యాఖ్యానించారు.

‘రైతుల సంక్షేమం కోసం భారీ పథకాలు ప్రకటించినంత మాత్రాన రైతులు ఓట్లు వేస్తారని భావించలేం. ఆ పథకాల ప్రయోజనాలు సిద్ధించినప్పుడు మాత్రమే రైతులు ప్రభుత్వాన్ని ప్రశంసిస్తారు. ఆ ప్రయోజనాలు వారికి దక్కాలంటే మరింత కాలం నిరీక్షించాల్సి ఉంటుంది’ మరో బీజేపీ సీనియర్‌ మంత్రి వ్యాఖ్యానించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top