‘ఇది మహారాష్ట్ర. ఇక్కడ ఎవరి తండ్రి జైళ్లో లేరు’

Sanjay Raut Says No Dushyant in Maharashtra Sena Has Other Options - Sakshi

ముంబై : ‘ఇది మహారాష్ట్ర. ఎవరి తండ్రి అయితే జైలులో ఉన్నారో అటువంటి దుష్యంత్‌ ఎవరూ ఇక్కడ లేరు’ అంటూ శివసేన ఎంపీ(రాజ్యసభ) సంజయ్‌ రౌత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసిన బీజేపీ- శివసేన అత్యధిక సీట్లు దక్కించుకున్న విషయం తెలిసిందే. గురువారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 105 సీట్లు గెలుచుకోగా.. శివసేన 56 సీట్లలో జయకేతనం ఎగురవేసింది. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్‌, ఎన్సీపీ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే శాసన సభ స్థానాలు కైవసం చేసుకున్నాయి. కాగా బీజేపీతో పొత్తు ఖరారైన నాటి నుంచి రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవి తమకు కేటాయించడంతో పాటుగా కేబినెట్‌లో కూడా సముచిత స్థానం కల్పించాలని శివసేన... కాషాయ పార్టీని డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే.

అంతేగాకుండా తొలిసారిగా ఠాక్రే కుటుంబం నుంచి వర్లీ అసెంబ్లీ బరిలో దిగిన శివసేన ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే ఘన విజయం సాధించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవి కోసం మరాఠా పార్టీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. అయితే ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో బీజేపీ మాత్రం సీఎం పదవి పంచుకునేందుకు సుముఖంగా లేనట్లుగానే కనిపిస్తోంది. దీంతో శివసేన కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కాంగ్రెస్‌- ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయంటూ సంకేతాలు జారీ చేస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ, శివసేన పార్టీలు విడివిడిగానే గవర్నర్‌తో భేటీ అవడంతో మహారాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

ఈ క్రమంలో శివసేన ఎంపీ సంజయ్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ‘ బీజేపీ, మేము ఉమ్మడిగానే ఎన్నికలకు వెళ్లాం. కానీ ప్రభుత్వ ఏర్పాటులో మేము ప్రత్యామ్నాయం దిశగా ఆలోచించుకునే విధంగా బీజేపీ మాతో పాపం చేయించకూడదు. రాజకీయంలో సన్యాసులు ఎవరూ ఉండరు. పైగా ఇక్కడ దుష్యంత్‌ ఎవరూ లేరు. ఎవరి తండ్రైతే జైలులో ఉన్నారో ఆయన.. ఇక్కడ మేము ధర్మబద్ధమైన, నిజాయితితో కూడిన రాజకీయాలే చేస్తాం. శరద్‌ పవార్‌ గారేమో బీజేపీ, కాంగ్రెస్‌కు వ్యతిరేక వాతావరణం సృష్టించారు’ అంటూ హరియాణాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తీరుపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

కాగా హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 10 స్థానాలు కైవసం చేసుకున్న జననాయక జనతా పార్టీ(జేజేపీ) అధినేత దుష్యంత్‌ చౌతాలాతో కలిసి బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దుష్యంత్‌కు డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టిన బీజేపీ కేబినెట్‌లో తగిన ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇక దుష్యంత్‌ ప్రమాణ స్వీకారానికి జైలులో ఉన్న ఆయన తండ్రి అజయ్‌ చౌతాలా పెరోల్‌పై బయటకు వచ్చిన నేపథ్యంలో సంజయ్‌ రౌత్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా అధికారంలో ఉన్న సమయంలో అజయ్‌ చౌతాలా ఉపాధ్యాయ నియామకాల్లో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top