సీఎం పదవిపై శివసేన ఆశలు!

Sanjay Raut Crucial Comments Ahead Assembly Polls - Sakshi

ముంబై : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ, దాని మిత్రపక్షం శివసేన మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి. గత ఎన్నికల్లో ఒంటరిగా ఎన్నికల బరిలో దిగిన శివసేన ఆ తర్వాత బీజేపీతో జట్టుకట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంత్రిమండలి తాజా విస్తరణలో భాగంగా శివసేనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అయితే కేంద్ర మంత్రి మండలిలో కేవలం ఒకే కేబినేట్‌ పదవి దక్కడంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న శివసేన.. రాష్ట్రంలో తమకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలని పట్టుబట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శివసేన పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్‌ రౌత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తమకు సీఎం పదవి కేటాయించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ విషయం గురించి స్థానిక మీడియాతో మాట్లాడుతూ..‘ఠాక్రే డిప్యూటీ అయ్యేందుకు ఇష్టపడరు. ఆ కుటుంబానికి చెందిన వారెవరైనా అధినేతగా ఉండేందుకే ప్రాధాన్యం ఇస్తారు. రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో ఠాక్రే కుటుంబానికి ఉన్న ప్రతిష్ట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆదిత్య ఠాక్రే ఎన్నికల బరిలో నిలవాలా లేదా అన్న విషయంపై పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రేదే తుది నిర్ణయం. అయితే డిప్యూటీగా కాకుండా చీఫ్‌గా ఉండేందుకే తను ఇష్టపడతాడు’ అంటూ ఉద్ధవ్‌ ఠాక్రే తనయుడు, శివసేన యూత్‌ వింగ్‌ చీఫ్‌ ఆదిత్య ఠాక్రేను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. శివసేన యువసేన విభాగం ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనుందన్న నేపథ్యంలో సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ క్రమంలో ఉద్ధవ్‌ ఠాక్రే వారసుడు క్రియాశీల రాజకీయాల్లో అడుగుపెట్టనున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా గత ఎన్నికల్లో విడిగా పోటీ చేసినప్పటికీ ఫలితాల అనంతరం శివసేనతో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిం‍దే. అయితే మిత్రపక్షంగా ఉన్నప్పటికీ శివసేన.. అనేక మార్లు బీజేపీ తీరుపై విమర్శలు గుప్పించింది. కాగా లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వాటన్నింటినీ మరచి మరోసారి ఎన్డీయే కూటమిలో చేరింది. ఇక తాజాగా మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో ఇరుపార్టీల మధ్య మరోసారి విభేదాలు తలెత్తాయి. ఈసారి ఏకంగా ముఖ్యమంత్రి పీఠంపై శివసేన కన్ను వేయడంతో రాజకీయ పోరు రసవత్తరంగా మారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top