‘ఆమె వల్లే ఎమ్మెల్యే అయ్యాను’ | Sampath Kumar Slams Harish rao | Sakshi
Sakshi News home page

‘ఆమె వల్లే ఎమ్మెల్యే అయ్యాను’

Jan 9 2018 3:18 PM | Updated on Mar 18 2019 8:57 PM

Sampath Kumar Slams Harish rao - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజకీయంగా తనను ఎదుర్కోలేక తనపై టీఆర్‌ఎస్‌ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆరోపించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తాను పార్టీ మారబోనని స్పష్టం చేశారు. ‘నేను పార్టీ వీడనని మా అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌కు తెలుసు. టీఆర్‌ఎస్‌లోకి రానని హరీశ్‌రావు, కేటీఆర్‌లకు తెలుసు. డీకే అరుణ నాకు మాతృ సమానురాలు. ఆమె వల్లే నేను ఎమ్మెల్యే అయ్యాను. డీకే అరుణతో నాకు ఎలాంటి విభేదాలు లేవు. మా ఇద్దరి మధ్య విభేదాలున్నాయంటూ కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నార’ని సంపత్‌కుమార్‌ అన్నారు.

ప్రాజెక్టుల విషయంలో వాస్తవాలు మరిచి కాంగ్రెస్‌ పార్టీపై మంత్రి హరీశ్‌రావు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆర్డీఎస్‌ శాశ్వత పరిష్కారానికి అప్పట్లో తమ పార్టీ తుమ్మిళ్ల రిజర్వాయర్‌ను ఎంచుకుందని తెలిపారు. ఆర్డీఎస్ కోసం ఆమరణ దీక్ష చేసి తాను జైలుకు వెళ్లిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాంగ్రెస్ నాయకులను చవటలు, దద్దమ్మలు అంటున్న హరీశ్‌.. ఇప్పుడు వారినే తన పక్కన కూర్చోపెట్టుకున్న సంగతి మరిచిపోయారని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో హుందాగా ఉండాలని, చెప్పుడు మాటల విని అభాసుపాలు కావొద్దని హితవు పలికారు.

Advertisement
 
Advertisement
Advertisement