రేవంత్‌కు తెలిసింది ఒట్లు.. తిట్లే! | BRS Working President KTR at Lakshettipet Farmers Conference | Sakshi
Sakshi News home page

రేవంత్‌కు తెలిసింది ఒట్లు.. తిట్లే!

Jul 22 2026 3:53 AM | Updated on Jul 22 2026 3:53 AM

BRS Working President KTR at Lakshettipet Farmers Conference

యువత, రైతన్నలు తిరగబడితే కాంగ్రెస్‌ నాయకులు బయట తిరగలేరు 

లక్షెట్టిపేట రైతు సదస్సులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ‘ఢిల్లీలో పార్లమెంట్‌ వద్ద వేలాది యువత నిరసనతో కేంద్రాన్ని ఎలా గడగడలాడించిన్రో చూస్తున్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఇదే పరిస్థితి ఎదురవుతుంది. యువత, రైతన్నలు తిరగబడితే కాంగ్రెస్‌ నాయకుడు బయట తిరగలేరు.’అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో మాజీ ఎమ్మెల్యే ఎన్‌.దివాకర్‌రావు అధ్యక్షతన జరిగిజన రైతు సదస్సులో ఆయన మాట్లాడారు. ‘కాంగ్రెస్‌ తెచ్చిన కరువుతో రైతులు అల్లాడుతున్నారు. అన్ని గండాలను దాటిన రేవంత్‌రెడ్డి గండం రైతులు దాటలేకపోతున్నారు. 

రైతులకే కాక అన్ని వర్గాలకు ఈ ప్రభుత్వం మోసం చేసింది. 31నెలలు అయిపోయింది. ఇంకా 29నెలలే ఉంది. యువ సంగ్రామ సదస్సుతో ప్రభుత్వాన్ని ఎండగట్టాం. యువత చేతికి రేవంత్‌రెడ్డి దొరికితే పొట్టు పొట్టు కొట్టేటట్టు ఉన్నారు. పాము సొంత పిల్లల్ని తిన్నట్లు రేవంత్‌రెడ్డి రైతులను చెప్పలేని కష్టాలు పెడుతున్నారు. నాలుగు సార్లు రైతుబంధు ఎగ్గొట్టారు. కన్నెపల్లి వద్ద 94మీ.ఎత్తులో నీరు పారుతున్నా అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీలు నడిపిస్తే, రోజుకు 3టీఎంసీల ఎత్తిపోయవచ్చు. 

ఎన్డీఎస్‌ఏ కన్నెపల్లి నీళ్లు ఎత్తిపోయొద్దని చెప్పిందా? అని ప్రశ్నించారు. గోదావరి, ప్రాణహిత నదులు పారుతున్నా పరిపాలించే వారికి సోయి లేక కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్క మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగితే రూ.400కోట్లతో ఎల్‌అండ్‌టీ సంస్థ రిపేరు చేస్తామని చెప్పినా ప్ర భుత్వం పట్టించుకోలేదు. ఆయన గురువు చంద్రబాబు పట్టిసీమ లిఫ్టు నడిపిస్తున్నారు. బీఆర్‌ఎస్‌ వాళ్లది రక్తం చల్లండి అంటే ప్రశాంత్‌రెడ్డి, సూర్యాపేట జిల్లాలో రైతులు రక్తం చల్లారు. సీఎం రేవంత్‌రెడ్డికి తెలిసింది ఒట్లు, తిట్లు మాత్రమే.’అని విమర్శించారు. 

ఈ సందర్భంగా వరంగల్‌లో రైతు డిక్లరేషన్‌పై కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌గాందీ, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు ఇచ్చిన హామీలపై వీడియోను ప్రదర్శించారు. ఏ జాతి నీది అంటున్నారని, తెలంగాణలో ఓ ఎమ్మెల్యేను రూ.50లక్షలతో కొనుగో లు చేసేందుకు వెళ్లిన జాతి తమదికాదని ధ్వజమెత్తారు. తెలంగాణలో రెండే జాతులున్నాయని, ఒకటి ప్రేమించేది, మరోటి రాష్ట్రానికి ద్రోహం చేసే జాతి అన్నారు. కాగా, వరిధాన్యం కాపాడుకునేందుకు వెళ్లి గాలివానకు గోడ కూలి చనిపోయిన నలుగురు రైతులు తనుగుల నాగరాజు, తనుగుల అభిరాం, నెల్కి లచ్చన్న, గుండారపు వెంకటేశ్‌ కుటుంబాలకు కేసీఆర్‌ ఆదేశాల మేరకు పార్టీ తరఫున ఒక్కొక్కరికి రూ.5లక్షలు అందజేస్తున్నట్లు కేటీఆర్‌ తెలిపారు. 

ఈ సదస్సు లో ఆసిఫాబాద్, బాల్కొండ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, ప్రశాంత్‌రెడ్డి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్సీలు జీవన్‌రెడ్డి, నారదా సు లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, కోరుకంటి చందర్, కోనేరు కోనప్ప, దాసరి మనోహర్, నాయకులు రామ్మోహన్‌రావు, జాన్సన్‌నాయక్, విజిత్‌రావు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement