కల్వకుంట్ల కుటుంబ పతనానికి ఏమైనా చేస్తా

Sampath kumar commented over kcr - Sakshi

నన్ను, కోమటిరెడ్డి, రేవంత్‌ను రాజకీయాల్లో ఉంచొద్దన్నదే కేసీఆర్‌ భావన

ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కుమార్‌

సాక్షి, హైదరాబాద్‌: దేవుడినైనా ఎదిరిస్తామని అంటున్న టీఆర్‌ఎస్‌ నేతలను, ఆ పార్టీని ఆ దేవుడు కూడా క్షమించడని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎస్‌.సంపత్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు. శనివారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర రాజకీయాల్లో తనతోపాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్‌రెడ్డిలు ఉండొద్దన్నదే కేసీఆర్‌ భావన అని, ఈ విషయం పత్రికల్లో కూడా ప్రచురితమైందని చెప్పారు.

ఈ కుట్ర వెనుక దాగి ఉన్న రహస్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశానని, దీని పరిణామమే రేవంత్‌రెడ్డి ఇంటిపై ఐటీ దాడులని వ్యాఖ్యానించారు. రేవంత్‌ ఇంటి మీద కక్షపూరితంగా జరిగిన ప్రభుత్వ ప్రేరేపిత దాడిని ఖండిస్తున్నానని, రేవంత్‌ కుటుంబానికి కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడేవారిని వేధించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

ఇద్దరు పోలీసు అధికారులు ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ ఉంటున్న ప్రగతిభవన్‌లోకి వెళ్లి ఆయనతో ఏకాంతంగా మాట్లాడి వచ్చిన తర్వాతే ఈ దాడులు జరిగాయని చెప్పారు. ఇన్ని రోజులు గన్‌మన్లను తొలగించి తనను మానసిక క్షోభకు గురిచేసిన ప్రభుత్వం ఇప్పుడు గన్‌మన్లను ఇస్తామని అంటోందని, దీని వెనుక ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. గన్‌మెన్ల సాయంతో తన సమాచారం తెలుసుకోవచ్చనే ఆలోచనతో మళ్లీ గన్‌మన్లను ఇస్తామని అంటున్నారనే అనుమానం తనకుందని, అందుకే గన్‌మన్లను తిరస్కరిస్తున్నానని చెప్పారు. ‘అమ్మతోడు చెప్తున్నా.. కల్వకుంట్ల కుటుంబం పతనం అయ్యేంత వరకు రాహుల్‌ గాంధీ ఇచ్చిన ఖడ్గంతో ఏమైనా చేస్తా’అని సంపత్‌ వ్యాఖ్యానించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top