జనసేన కాదు.. భజన సేన

roja commented on pavan kalyan - Sakshi

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా మండిపాటు

తప్పు చేసిన చంద్రబాబును కాపాడటమే పవన్‌ కల్యాణ్‌ ధ్యేయం

సాక్షి ప్రతినిధి, ఏలూరు: సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ది జనసేన కాదు, భజన సేన అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా విరుచుకుపడ్డారు. గురువారం పోలవరం ప్రాజెక్టు యాత్రకు వచ్చిన అమె మీడియాతో మాట్లాడారు. తల్లి తెలుగుదేశం పార్టీ అయితే జనసేన పిల్ల టీడీపీ అని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడు తప్పు చేసినా పవన్‌ కల్యాణ్‌ కాపాడటానికే వచ్చి వెళ్తున్నారే తప్పా, ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెబుతున్న ఆయన ఎక్కడా ప్రశ్నించడం లేదని ధ్వజమెత్తారు.

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురించి మాట్లాడటానికి పవన్‌ కల్యాణ్‌కు ఏ అర్హత ఉందని నిలదీశారు. రోజా ఇంకా ఏం మాట్లాడారంటే... ‘‘అనుభవం లేని నారా లోకేశ్‌ ఎమ్మెల్సీ, మంత్రి అయ్యారు. పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచి ఆయన చావుకి కారణమైన చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. అలాంటి వారికి పవన్‌ కల్యాణ్‌ భజన చేస్తున్నారు. భుజాన మోస్తున్నారు. పార్టీ పెట్టకముందే వైఎస్‌ జగన్‌ ఎంపీగా ఎన్నికయ్యారు.

అనుభవం ఉంటేనే రాజకీయాల్లోకి రావాలని పవన్‌ అంటున్నారు. ఏ అనుభవం ఉందని చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌ ఏ అనుభవం ఉందని జనసేన పార్టీ పెట్టారు.  పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించడానికి కాదు, ప్యాకేజీల కోసమే జనసేన పార్టీ పెట్టారు.. చంద్రబాబుకు భజన చేయడానికే పార్టీ పెట్టారని అర్థమవుతోంది. ’’ అని రోజా మండిపడ్డారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top