హనుమతో కలవరం!

RLP preparations for third front in Rajasthan - Sakshi

రాజస్తాన్‌లో బీజేపీ, కాంగ్రెస్‌లకు ఇబ్బందికరమే

మూడో ఫ్రంట్‌కు ఆర్‌ఎల్‌పీ సన్నాహాలు

జాట్‌ వర్గం నేత హనుమాన్‌ బేణీవాల్‌ సారథ్యంలో..

జతచేరిన బ్రాహ్మణ నేత ఘనశ్యామ్‌   

రాజస్తాన్‌లో చిన్న పార్టీలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొన్నటివరకు బీజేపీ వర్సెస్‌ కాంగ్రెస్‌గానే ఉంటుందన్న పోరు ఇప్పుడు మూడో కూటమి రంగంలోకి దిగటంతో మరింత రసవత్తరంగా మారింది. ఇప్పుడు ఈ మూడో కూటమే ఇరు జాతీయ పార్టీలకు చెమటలు పట్టిస్తోంది. గత ఎన్నికల వరకు బీజేపీలోనే బలమైన జాట్‌వర్గం నేతగా ఉన్న హనుమాన్‌ బేణీవాల్‌.. గతనెల 29న రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్‌ పార్టీ (ఆర్‌ఎల్పీ)ని స్థాపించారు. బీజేపీ సీనియర్‌ నేతగా ఉండి.. రాజేతో విభేదించి బయటకొచ్చి భారత్‌ వాహినీ పార్టీ (బీవీపీ)ని ఏర్పాటుచేసిన బీజేపీ ఎమ్మెల్యే ఘన్‌శ్యామ్‌ తివారీ కూడా ఆర్‌ఎల్పీతో కలిశారు. మరికొన్ని చిన్న పార్టీలను కలుపుకుని మూడో ఫ్రంట్‌ ఏర్పాటుకు వీరు సిద్ధమవుతున్నారు. అయితే.. 130 స్థానాలే టార్గెట్‌గా పనిచేస్తున్న ఈ కూటమితో బీజేపీ, కాంగ్రెస్‌ల్లో కలవరం మొదలైంది. 

30 చోట్ల పవర్‌ఫుల్‌ హనుమ 
జాట్‌ వర్గం నేతగా బీజేపీ విజయాల్లో హనుమాన్‌ పాత్ర విస్మరించలేనిది. రాజస్తాన్‌లో 14–15% జనాభా ఉన్న జాట్లు దాదాపు 30 నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. దీంతో హనుమాన్‌ బేణీవాల్‌ ఈ నియోజకవర్గాలను ప్రభావితం చేయగలరనేది సుస్పష్టం. కులాభిమానాలు బలంగా పనిచేసే రాజస్తాన్‌లో ఆర్‌ఎల్పీ ప్రభావం గణనీయంగా ఉంటుందనేది బీజేపీ, కాంగ్రెస్‌లకు జీర్ణించుకోలేని విషయం. ‘అయితే బీజేపీ లేదంటే.. కాంగ్రెస్‌ కొన్నేళ్లుగా ఈ రెండు పార్టీలను చూసి చూసి జనం విసుగెత్తిపోయారు. ఈ పార్టీల అవినీతితో విరక్తిచెందారు. అందుకే రాష్ట్ర ప్రజలు మూడో ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు. వారి నమ్మకాలను వమ్ము చేయబోం’ అని బేణీవాల్‌ ప్రచారంలో పేర్కొంటున్నారు. ఈయన ‘కిసాన్‌ హుంకార్‌ మహా ర్యాలీ’లకు జనం పోటెత్తుతుండటంతో.. ఏ స్థాయిలో ఈయన ప్రభావం ఉండొచ్చనే అంశంపై అంచనాలు మొదలయ్యాయి.  

ఘనశ్యాముడూ కలిస్తే.. 
భారత్‌ వాహినీ పార్టీ (బీవీపీ)ని స్థాపించిన మాజీ బీజేపీ సీనియర్‌ నేత ఘన్‌శ్యామ్‌ తివారీ తక్కువోడేం కాదు. రాష్ట్రంలో 7% ఉన్న బ్రాహ్మణ ఓట్లకు ఘన్‌శ్యామ్‌ తివారీ నేతగా ఉన్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఘన్‌శ్యామ్‌ కూడా సొంతపార్టీ పెట్టుకోవడం బీజేపీకి పెద్ద దెబ్బే. దీనికి తోడు ఘన్‌శ్యామ్‌ కనీసం 20 స్థానాలను ప్రభావితం చేయగలడు. ఈయనకు బ్రాహ్మణులతోపాటు ఇతర అగ్రవర్ణాల్లోనూ మంచి పట్టుంది. దీంతో ఆర్‌ఎల్పీ, బీవీపీ కలిసి మూడో ఫ్రంట్‌గా ఏర్పడి పోటీచేయాలని నిర్ణయించాయి.

ఈ రెండు పార్టీలు కలిస్తే బీజేపీకే ఎక్కువ నష్టం అని రాజకీయ విశ్లేషకులంటున్నారు. అయితే కాంగ్రెస్‌కు కూడా జాట్, బ్రాహ్మణులు, ఇతర అగ్రవర్ణాల ఓట్లు తగ్గతాయనే భావనా వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని మొత్తం 200 సీట్లలో పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించిన హనుమాన్, ఘన్‌శ్యామ్‌లు బీఎస్పీ వంటి పార్టీలతో పొత్తుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతా అనుకున్నట్లుగా జరిగితే.. 130 స్థానాల్లో విజయం సాధిస్తామని ఆయన భావిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆర్‌ఎల్పీ 30 చోట్ల గెలవగలదని బేణీవాల్‌ అంచనా. బీజేపీ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టిన గిరిజన నాయకుడు కిరోలీలాల్‌ మీనా తిరిగి బీజేపీలో చేరడంతో.. మీనా ప్రభావం ఉన్న 70 చోట్ల వదిలిపెడితే.. మిగిలిన 130 సీట్లలో క్రియాశీలకంగా మారాలని వ్యూహాలు పన్నుతున్నారు. 

ఎవరీ హనుమాన్‌?  
హనుమాన్‌ బేణీవాల్‌ 2013 వరకు బీజేపీలో సీనియర్‌ నాయకుడు. వసుంధరా రాజేపై తరచూ అసమ్మతి గళం వినిపించేవారు. 2013 ఎన్నికలకు ముందు కూడా రాజేపై అవినీతి ఆరోపణలు చేయడంతో పార్టీ ఆయన్ను సస్పెండ్‌ చేసింది. దీంతో ఆయన ఎన్నికల్లో ఖిన్వసార్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థిపై 23వేల ఓట్ల మెజార్టీతో నెగ్గారు. గత అయిదేళ్లుగా బీజేపీ, కాంగ్రెస్‌ హయాంలో జరిగిన అవినీతినే ప్రధానాస్త్రం చేసుకొని విమర్శలు చేస్తున్నారు. 15 రోజుల క్రితం ఆర్‌ఎల్పీని స్థాపించి.. రాష్ట్రంలో మూడో కూటమి రాగాన్ని ఆలాపిస్తున్నారు. బలమైన జాట్‌ సామాజిక వర్గానికి చెందిన నేత. జాట్, ముస్లిం, యాదవ, కుమావట్‌ వంటి సామాజిక వర్గాల మద్దతు తమకే ఉంటుందని హనుమాన్‌ భావిస్తున్నారు. 

ముసుగులో ‘డేరా’ వద్దకు... 
గత ఎన్నికల సమయంలో డేరా బాబా ఆశీస్సుల కోసం, ఆయన శిష్యగణం ఓట్ల కోసం రాజకీయ నాయకులు బహిరంగంగా ‘డేరా సచ్చా సౌదా’ కేంద్రాలకు క్యూ కట్టిన విషయం గుర్తుండే ఉంటుంది. కానీ ఇప్పుడు సీన్‌ మారింది. లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి బాబా జైలుపాలయ్యాడు. అయితే ఇప్పటికీ డేరా బాబాను అభిమానించే అనుచరగణం గణనీయంగానే ఉంది. దీంతో రాజకీయ నాయకులు సచ్చా సౌదా కేంద్రాల్లో కీలక వ్యక్తుల మద్దతు కోసం పాకులాడుతున్నారు. కానీ గతంలోలాగా బహిరంగంగా ఆయా కేంద్రాల వద్దకు పోతే విమర్శల పాలవుతామన్న భయంతో రహస్యంగా సచ్చాసౌదాల లీడర్లతో మీటింగ్‌లు పెట్టుకుంటున్నారు. పంజాబ్, హర్యానాల్లో డేరా బాబాకు విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది.

ఈ రాష్ట్రాలను ఆనుకుని ఉన్న జిల్లాల్లో ముఖ్యంగా శ్రీగంగానగర్, హనుమాన్‌నగర్‌ లాంటి ప్రాంతాల్లో చాలామందికి ఇప్పటికీ డేరాబాబా దేవుడికిందే లెక్క. ఎన్నికల వేళ డేరా భక్తగణం అండ ఉంటే ఈజీగా గట్టెక్కవచ్చని నాయకుల అంచనా. అయితే ఇప్పటివరకు ఫలానా నాయకుడికి ఓటేయమని డేరా నుంచి భక్తులకు అధికారిక ఆదేశాలు రాలేదు. గత ఎన్నికల్లో డేరా పాపులారిటీ ఉన్న 11 సీట్లలో 9 సీట్లను బీజేపీ గెలుచుకుంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గాల పరిధిలో డేరాకు దాదాపు 10 లక్షల మంది అనుచరులున్నారు. ఇంత కీలకం కాబట్టే రాజకీయపార్టీల నేతలు డేరా అనుగ్రహం కోసం పాకులాడుతున్నారు. సామాన్య ప్రజల్లో పలచనకాకుండా ఉండేందుకు తమ యత్నాలను సీక్రెట్‌గా కొనసాగిస్తున్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top