
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. ఏకంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డిని టార్గెట్ చేస్తూ రేవంత్ వ్యాఖ్యానించడం, ఆయనపై కుంతియాకు ఫిర్యాదు చేయడం పార్టీలో కలకలం రేపుతోంది. రేవంత్ వ్యవహారశైలిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా ఆయన ఏ వ్యూహంతో అలా మాట్లాడారో అర్థం కాక కేడర్ తలలు పట్టుకుంటోంది. అనవసర విషయంలో రేవంత్ జోక్యం చేసుకున్నారనే అభిప్రాయాన్ని సీనియర్లు, పార్టీలోని ఇతర నేతలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
హుజూర్‌నగర్... మల్కాజ్‌గిరి ఎంపీ
హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిత్వంపై రేవంత్ కయ్యానికి కాలు దువ్వినట్లే వ్యవహరించారనే అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది. మల్కాజిగిరి ఎంపీగా ఉన్న ఆయన సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గం అది కూడా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ సొంత నియోజకవర్గంతో ఏం సంబంధమనే ప్రశ్న పార్టీ నేతల్లో వినిపిస్తోంది. ఉత్తమ్ మూడుసార్లు గెలిచిన స్థానంలో తన అభ్యర్థి ఫలానా వ్యక్తి అంటూ ఉత్తమ్ ప్రకటించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. టీపీసీసీ అధ్యక్ష రేసులో ముందు వరుసలో ఉన్న రేవంత్ లాంటి నాయకుడు అలా మాట్లాడి ఉండాల్సింది కాదని, పార్టీపై పట్టు రావాలంటే కొంత ఓపిక అవసరమని, పార్టీలో పదవులు చేజారే పరిస్థితులు కొనితెచ్చుకోవడం సరికాదని టీపీసీసీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించడం రేవంత్ వ్యాఖ్యలపై పార్టీలో నెలకొన్న అభిప్రాయానికి అద్దం పడుతోంది.
ఇక భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అయితే అసలు హుజూర్‌నగర్ అభ్యర్థి ఎవరనేది చెప్పడానికి రేవంత్ ఎవరని ప్రశ్నించడం గమనార్హం. అయితే రేవంత్ సన్నిహితులు మాత్రం ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. పార్టీ అభ్యర్థి ఎవరనే విషయాన్ని హైకమాండ్ చెబుతుందని, ఫలానా నాయకుడిని అభ్యర్థిగా ప్రతిపాదించడంలో తప్పేముందంటున్నారు. మొత్తంమీద రేవంత్ వ్యాఖ్యల కలకలం పార్టీలోనూ, రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశం కావడంతో మరోసారి రాష్ట్ర రాజకీయం రేవంత్ చుట్టూనే తిరుగుతోంది.
అధిష్టానం దృష్టికి...
రేవంత్ వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపడంతో ఈ అంశం అధిష్టానం దృష్టికి కూడా వెళ్లిందని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా గురువారం అధిష్టానం పెద్దలతో మాట్లాడినట్లు సమాచారం. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ భేటీలో కూడా రేవంత్ వ్యాఖ్యల అంశం ప్రస్తావనకు వచ్చింది. పార్టీలో పెండింగ్‌లో ఉన్న క్రమశిక్షణ వ్యవహారాల కోసం గురువారం గాంధీ భవన్ లో కమిటీ అధ్యక్షుడు కోదండరెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రేవంత్–హుజూర్‌నగర్ విషయం ప్రస్తావనకు వచ్చిందని, రేవంత్‌పై పత్రికల్లో వచ్చిన వార్తలను కమిటీ పరిశీలించినట్లు సమాచారం.