థాక్రే చేతిలోనే రిమోట్‌ కంట్రోల్‌.. సీఎం పదవిని పంచాల్సిందే!

Remote Control of Power Now With Uddhav, Says Shiv Sena - Sakshi

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో​ కింగ్‌ మేకర్‌గా అవతరించిన శివసేన పార్టీ ఆదివారం సంచలన వ్యాఖ్యలే చేసింది. 2014 ఎన్నికలతో పోల్చుకుంటే.. ప్రస్తుత ఎన్నికల్లో తక్కువ సీట్లు వచ్చినా.. ప్రభుత్వానికి సంబంధించి రిమోట్‌ కంట్రోల్‌ తమ చేతిలోనే ఉందని తేల్చి చెప్పింది. 1995 నుంచి 1999 వరకు బీజేపీ-శివసేన కూటమి సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పుడు తన చేతిలోనే ఉందని, ప్రభుత్వం తాను చెప్పినట్టు వినక తప్పదని సేన వ్యవస్థాపకుడు బాల్‌ ఠాక్రే పదేపదే చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఎన్నికల్లో శివసేనతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లోకి వెళ్లినప్పటికీ.. అనుకున్నస్థాయిలో రాణించలేకపోయింది. 2014లో ఒంటరిగా పోటీ చేసి 122 స్థానాలు గెలుపొందిన ఆ పార్టీ ఈసారి 105 స్థానాలకే పరిమితమైంది. అటు శివసేనకు కూడా గతం కంటే స్థానాలు తగ్గాయి.

కానీ, ప్రభుత్వ ఏర్పాటులో ఆ పార్టీది కీలక పాత్ర కావడంతో అధికార పంపిణీ విషయంలో శివసేన గట్టిగా బేరసారాలు జరుపుతోంది. అధికారాన్ని చెరోసగం పంచాల్సిందేనని, సీఎం పదవిని రెండు పార్టీల మధ్య కూడా చెరిసగం పంచాలని శివసేన గట్టిగా డిమాండ్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా థాక్రే వారసుడు ఆదిత్యా ఠాక్రే తొలిసారి పోటీ చేసి.. ఎమ్మెల్యేగా గెలుపొందడంతో సీఎం పదవి కోసం ఆ పార్టీ గట్టిగానే పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో శివసేన అధికార పత్రిక సామ్నాలో తన కాలమ్‌ ‘రోఖ్‌థోఖ్‌’లో సంజయ్‌ రౌత్‌ ఓ వ్యాసాన్ని ప్రచురించారు. ‘2014లో శివసేనకు 63 సీట్లు రాగా.. ఇప్పుడు 56 సీట్లే వచ్చాయి. కానీ, అధికారానికి సంబంధించి రిమోట్‌ కంట్రోల్‌ మాత్రం పార్టీ చేతిలోనే ఉంది. బీజేపీ నీడలోనే శివసేన ఉండిపోతుందన్న భ్రమ పటాపంచలైంది. పులి (శివసేన చిహ్నం) చేతిలో కమలం​పువ్వు (బీజేపీ గుర్తు)  కార్టూన్‌ ప్రస్తుత పరిస్థితిని చెప్పకనే చెబుతోంది. ఎవరినీ తేలికగా తీసుకోవద్దని సూచిస్తోంది’ అని రౌత్‌ ఈ వ్యాసంలో తేల్చి చెప్పారు. సామ్నా ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌గా, పార్లమెంటులో పార్టీ చీఫ్‌విప్‌గా ఉన్న రౌత్‌ తన వ్యాసంలో బీజేపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు విషయంలో తమ డిమాండ్లపై ఏమాత్రం వెనుకకు తగ్గబోమని విస్పష్ట సంకేతాలు ఇచ్చారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top