రండి.. రండి.. 

Release of BJP and Congress candidates in Rajasthan - Sakshi

అక్కడ దొరక్కపోతే ఇక్కడ టికెటిస్తాం

అసమ్మతి నేతలకు ప్రత్యర్థి పార్టీల టికెట్లు

రాజస్తాన్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ జాబితాలు విడుదల

ఇరుపార్టీల్లోనూ 19 మంది మహిళలు

బీజేపీ జాబితాలో కానరాని ముస్లిం  

రాజస్తాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకతను జయించేందుకు బీజేపీ.. బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్‌ తీవ్రంగా మేథోమధనం చేస్తున్నాయి. ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపికపై మల్లగుల్లాల అనంతరం జాబితాలు విడుదల చేస్తున్నాయి. రాజస్తాన్‌లో ఎట్టిపరిస్థితుల్లోనూ గెలిచే తీరాలన్న పట్టుదలతో ఈ రెండు పార్టీలున్నాయి. అందుకే ఆ పార్టీ నుంచి వచ్చిన వారికి ఈ పార్టీలో.. ఈ పార్టీ నుంచి వచ్చిన వారికి ఆ పార్టీలో టికెట్లు ఇచ్చేస్తున్నాయి. వాస్తవానికి రెండు పార్టీలు కూడా ఎన్నికలకు ముందు.. కేవలం టికెట్ల కోసమే పార్టీలో చేరే వారికి బీ–ఫారం ఇవ్వొద్దనుకున్నాయి. రాహుల్‌ గాంధీ ఒక అడుగు ముందుకేసి పక్క పార్టీలనుంచి వచ్చే వారికి ఎట్టిపరిస్థితుల్లోనూ ‘నో’ చెప్పాల్సిందేనని ఏఐసీసీ సమావేశాల్లో స్పష్టం చేశారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరుగా ఉంది. వసుంధరా రాజేను ఓడించాలంటే.. బీజేపీ నుంచి వచ్చిన నేతలకు టికెట్లు ఇవ్వాల్సిందేనంటూ రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌కే నచ్చజెబుతున్నారు. దీంతో పారాచ్యూట్‌ నేతలకు ఇరు పార్టీలు ఎర్రతివాచీ పరుస్తున్నాయి. మొత్తం 152 పేర్లతో విడుదలైన కాంగ్రెస్‌ జాబితాలో నలుగురు వివిధ పార్టీల నేతలకు టికెట్‌ ఇచ్చింది. జాబితా విడుదలకు నిమిషాల ముందు పార్టీలో చేరిన వారికీ టికెట్‌ ఖరారు చేసింది. అటు, బీజేపీ కూడా కాంగ్రెస్, బీఎస్పీ నుంచి వచ్చిన నేతలకు పిలిచి టికెట్లు ఇస్తోంది. 

ఎమ్మెల్యేలుగా గెలిస్తేనే.. పార్లమెంటుకు
152 పేర్లతో కాంగ్రెస్‌ విడుదల చేసిన తొలిజాబితాలో పలువురు సీనియర్లకు స్థానం దక్కింది. 2019 ఎన్నికలకు రంగం సిద్ధం చేసే ఉద్దేశంతో మాజీ ఎంపీలు, సీనియర్‌ నేతలను కూడా ఎమ్మెల్యేలుగా బరిలో దిగాల్సిందేనని ఆదేశించింది. పాతిక మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలలో 20 మందికి తొలి జాబితాలో చోటు లభించింది. జాబితా విడుదలకు ఒకరోజు ముందే కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ నేత హరీష్‌ మీనాకు డియోలి ఉనియారా టికెట్‌ కేటాయించగా.. మరో ముగ్గురు బీజేపీ నేతలకు టికెట్లు ఇచ్చారు.

సచిన్‌ తొలి ఎన్నికలు 
సీఎం రేసులో ఉన్న సచిన్‌ పైలట్‌కు టోంక్‌ స్థానాన్ని, అశోక్‌ గెహ్లాట్‌కు సర్దార్‌పుర సీటును కేటాయించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం సచిన్‌కు ఇదే మొదటి సారి. టికెట్‌ లభించిన సీనియర్లలో కేంద్ర మాజీ మంత్రి సీపీ జోషి, గిరిజా వ్యాస్, రామేశ్వర్‌ దూది, అజ్మీర్‌ ఎంపీ రఘు శర్మ, దౌశ ఎంపీ హరీశ్‌ మీనా, మాజీ ఎంపీ రఘువీర్‌ మీనా తదితరులున్నారు. గెహ్లాట్‌కు అసెంబ్లీ టికెట్‌ కేటాయించడాన్ని బట్టి ఆయన్ను రాష్ట్ర రాజకీయాలకే పరిమితం చేయాలని నాయకత్వం భావిస్తున్నట్టు అర్థమవుతోంది. కాగా, కాంగ్రెస్‌ తొలి జాబితాలో 19 మంది మహిళలు, 9 మంది ముస్లింలు, 30 మంది ఎస్సీలు, 24 మంది ఎస్టీలు ఉన్నారు.  
16 మందికి విశ్రాంతినిచ్చిన బీజేపీ 
కాంగ్రెస్‌ తొలి జాబితా విడుదలకు ఒకరోజు ముందే 31 మందితో బీజేపీ రెండో జాబితా విడుదల చేసింది. సిట్టింగ్‌లలో 16 మందికి టికెట్‌ నిరాకరించింది. దీంతో రెండు జాబితాల్లో కలిపి మొత్తం 37 మంది సిట్టింగులకు ఉద్వాసన పలికినట్టయింది. 19 మంది మహిళలకు బీజేపీ టికెట్లు ఇచ్చింది. తొలి రెండు జాబితాల్లో ఒక్క ముస్లిం అభ్యర్థి కూడా లేకపోవడం గమనార్హం. రాజే వద్దన్నప్పటికీ దాదాపు 13 మంది సీనియర్‌ నేతల కుటుంబ సభ్యులకు రెండో జాబితాలో చోటు లభించింది.      

అన్నీ పాత ముఖాలే.. 
సిట్టింగుల్లో చాలా మందిపై అసంతృప్తి ఉన్నందున కొత్తవారికి టికెట్లు ఇస్తారనే ప్రచారం బీజేపీలో జోరుగా సాగింది. అయితే తొలి రెండు జాబితాలు చూస్తే మాత్రం ఈ కొత్తదనమేదీ కనిపించలేదు. సిట్టింగులకే ఎక్కువ సీట్లివ్వడంతోపాటు.. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిన వారికీ ఈసారి అవకాశాన్నిచ్చారు. గెలుపు ప్రాతిపదికనే అభ్యర్థుల ఎంపిక జరిగిందని బీజేపీ సీనియర్‌ నేతలంటున్నారు. బికనేర్, షెకావతీ ప్రాంతాల్లో కొత్తవారెవరూ ఆసక్తి చూపకపోవడంతోనే పాతవారికి అవకాశం ఇచ్చామని చెబుతున్నారు. ఎక్కువ సంఖ్యలో కొత్తవారికి అవకాశమిస్తే.. ప్రభుత్వ వ్యతిరేకత ఉందన్న విషయాన్ని అంగీకరించినట్లవుతుందని పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో వసుంధరా రాజే చెప్పారు. ఈ సమయంలో మార్పు మంచిది కాదని ఆమె పేర్కొన్నారు. 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజేకు వ్యతిరేకంగా వెళ్లొద్దనే బీజేపీ నాయకత్వం భావిస్తోందని సమాచారం. ఏదేమైనా ఇరు పార్టీలు గెలుపుకోసం.. నిర్దేశించుకున్న నిబంధనలు పక్కనపెట్టి మరీ ముందుకెళ్తున్నాయి. 

రాజేను ఓడించాలని! 
రాజస్తాన్‌లో రసవత్తర పోరుకు కాంగ్రెస్‌ తెరలేపింది. ముఖ్యమంత్రి, బీజేపీ అభ్యర్థి వసుంధరా రాజేపై మొన్నటివరకు రాష్ట్ర బీజేపీలో కీలకనేతగా ఉండి.. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన మానవేంద్ర సింగ్‌ను పోటీలో నిలుపుతున్నట్లు ప్రకటించింది. మానవేంద్ర సింగ్‌ రాకతో.. ఝాల్రాపటన్‌లో పోటీ ఆసక్తికరంగా మారింది. బీజేపీ మాజీ నేత, మోదీని విమర్శించిన జస్వంత్‌ సింగ్‌ కుమారుడే మానవేంద్ర సింగ్‌. అయితే.. కాంగ్రెస్‌కు అభ్యర్థులు కరువైనందునే మానవేంద్రను బరిలో దించారని రాజే విమర్శించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top