సీమలో సైకిల్‌కు పంక్చరే..!

In Rayala Seema TDP Party Going To Collapse By This Election - Sakshi

సాక్షి, నెట్‌వర్క్‌ : వైఎస్సార్, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో సరికొత్త రాజకీయ సమీకరణలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి అత్యధిక శాతం ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఐదేళ్లలో ఎలాంటి అభివృద్ధి జరగకపోవటం.. అడుగడుగునా అవినీతి తాండవించడంతో ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు.  విలువలకు వలువలు ఊడదీసి అనైతిక రాజకీయాలు చేస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దిగజారుడు రాజకీయాలను సహించేది లేదని.. విలువలతో కూడిన రాజకీయాలకు, విశ్వసనీయతకు ఓటేస్తామని ఘంటాపథంగా చెబుతున్నారు. 

క్లీన్‌ స్వీప్‌ దిశగా ‘వైఎస్సార్‌’ 

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సొంత గడ్డ వైఎస్సార్‌ కడప జిల్లా. సౌమ్యుడు, అందరికీ తలలో నాలుకగా ఉండే వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకు గురికావడం.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ ఎక్కడ ఎలాంటి అరాచకాలకు పాల్పడుతుందోనన్న భయం అంతటా నెలకొంది. వైఎస్‌ కుటుంబానికి కంచుకోట అయిన ఈ జిల్లా 2014 ఎన్నికల్లో ఒక్కచోట తప్ప 9 నియోజకవర్గాల్లో వైఎస్సార్‌ సీపీ విజయబావుటా ఎగురవేసింది.

చంద్రబాబు వైఎస్సార్‌ సీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి.. ఒకరికి మంత్రి పదవి కట్టబెట్టిన తీరును ప్రజలు ఏవగించుకుంటున్నారు. జిల్లాలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితులు, తాగునీటి సమస్యను పరిష్కరించడంలోను, కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణంలోను ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పులివెందుల, బద్వేలు, రాజంపేట, కడప, రైల్వే కోడూరు, రాయచోటి, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరుతోపాటు కడప, రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గాల్లో గెలుపు వైఎస్సార్‌ సీపీదేనని టీడీపీ శ్రేణులు సైతం బాహాటంగానే చెబుతున్నాయి. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పులివెందులలో ఈసారి గతం కంటే ఎక్కువ మెజార్టీ వస్తుందని ఆ నియోజకవర్గానికి చెందిన ఎం.జోసఫ్‌ నర్మగర్భంగా చెబుతున్నారు.

జిల్లాలో క్షేత్రస్థాయి పరిస్థితులు సైతం ఆయన చెప్పినదానికి తగ్గట్టుగానే ఉన్నాయి. వైఎస్సార్‌ సీపీ కంచుకోటల్లో ఒకటైన ఈ జిల్లాను ముఖ్యమంత్రి చంద్రబాబు ఐదేళ్లూ విస్మరించి.. ఎన్నికలకు ముందు తానేదో చేసినట్టు చెప్పుకోవడాన్ని కడప నగరానికి చెందిన కె.రవికుమార్‌ అనే ప్రైవేటు ఉద్యోగి ప్రశ్నించారు. వైఎస్‌ హయాంలో చేసిన అభివృద్ధి తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నది ఆయన వాదన.

గత ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ తరఫున గెలిచిన ఆదినారాయణరెడ్డి పార్టీ ఫిరాయించిన తీరును జమ్మలమడుగుకు చెందిన బాలమ్మ తప్పుబట్టారు. ‘నీతిగా ఉండాల్సిన పని లేదా?’ అని ప్రశ్నించింది. ‘మారినోడు మారినట్టు ఉండకుండా ఇప్పుడు రాంసుబ్బారెడ్డితో కలిపి మరో తప్పు చేశాడు. వాళ్లి ద్దరూ కలిస్తే సరిపోతుందా. వారి వర్గాలు కలవాల్సిన పని లేదా?’ అని సాక్షాత్తు ఓ పోలీసు అధికారి ప్రశ్నించడం గమనార్హం.

ఈసారి ఏమైనా కనీసం రెండు సీట్లలోనైనా వైఎస్సార్‌ సీపీని దెబ్బతీయాలన్న చంద్రబాబు పాచిక పారే అవకాశమే కనిపించడం లేదు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఈ జిల్లా పెట్టని కోటగా నిలిచినందునే చంద్రబాబు వివక్ష చూపారని ప్రజలు భావిస్తున్నారు. జిల్లాలో విస్తారమైన ఖనిజ సంపద ఉన్నా.. ఎలాంటి కొత్త పరిశ్రమలు రాలేదు. రాయచోటి, బద్వేలులో ఫ్లోరైడ్‌ సమస్య పీడిస్తోంది.

ఇలాంటి అంశాలను ప్రభు త్వం పట్టించుకోకపోవడాన్ని ప్రజలు నిల దీస్తున్నారు. అందుకే ఈ జిల్లాలో ప్రజల తీర్పు ఏకపక్షంగా ఉండబోతోంది. వైఎస్సార్‌ సీపీ మొత్తం పది సీట్లనూ కైవశం చేసుకునే దిశగా ఓటరు తీర్పు ఉంది. జిల్లాలో ఫ్యాన్‌ గుర్తు క్లీన్‌స్వీప్‌ చేయడం తథ్యమని రాయచోటికి చెందిన కె.నాగిరెడ్డి అనే టీ కొట్టు యజమాని చెప్పారు.   

‘అనంత’ అభిమానం 

అనంతపురం జిల్లా శింగనమల, రాప్తాడు, పుట్టపర్తి, కదిరి, గుంతకల్లు, కల్యాణదుర్గం నియోజకవర్గాల్లో ఫ్యాన్‌ గాలి హోరున వీస్తోంది. రాయదుర్గం, పెనుకొండ, మడకశిర, అనంతపురం, ధర్మవరం, ఉరవకొండ, హిందూపురం, తాడిపత్రి నియోజకవర్గాల టీడీపీ నేతల్లో గుబులు రేపుతోంది. హిందూపురం ఎమ్మెల్యే, ప్రస్తుత టీడీపీ అభ్యర్థి సినీ నటుడు బాలకృష్ణ వ్యవహార శైలితో స్థానికులు విసిగిపోయా రని, ఈసారి ఆయనకు కనువిప్పు కలిగిస్తారని ప్రైవేటు ఉద్యోగి ఆర్‌.వెంకటస్వామి వ్యాఖ్యానించారు.

అనంతపురానికి చెందిన చిరు వ్యాపారి చిన్నం వెంకటసూరి మాట్లాడుతూ.. పేదోళ్లను పట్టించుకోని ఈ ప్రభుత్వం ఇక ఉండకూడదని, రాజన్న రాజ్యం తిరిగి రావాలి’ అని వ్యాఖ్యానిం చారు. పెనుకొండకు చెందిన వెంకారెడ్డి అనే రైతు మాట్లాడుతూ.. జిల్లాలో ముందెన్నడూ లేనివిధంగా కరువు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి తవ్విన కాలువల్లోనే ప్రస్తుతం నీళ్లు వస్తున్నాయని, అందుకే ఈసారి రైతులంతా చాలా జాగ్రత్తగా ఓటు వేయాలని నిర్ణయించుకున్నారని చెప్పారు.

మంత్రిగా ఉన్న ఓ నాయకురాలి కీలక అనుచురులు ఎందరో వైఎస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరారు. టీడీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలు ప్రజలకు రోత పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్‌ జగన్‌ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల సభలు మంచి ఊపుతెచ్చాయి. నియోజకవర్గాల వారీ సమస్యలను ఆయన ప్రస్తావించి.. ఇవేవీ పరిష్కరించనప్పుడు వీళ్లకు మళ్లీ ఛాన్స్‌ ఎందుకివ్వాలంటూ వేస్తున్న ప్రశ్నలు ప్రజల్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. సంక్షేమ పథకాల అమలు విషయంలో కులాలు, మతాలు, పార్టీలనే భేదం ఉండదని జగన్‌ ఇస్తున్న హామీపై జనానికి నమ్మకం కలగటంతో ఈసారి మా ఓటు ఫ్యానుకే అంటున్నారు.   

పడిపోయిన టీడీపీ గ్రాఫ్‌ 

2014 ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలలో 8 వైఎస్సార్‌ సీపీ, 6 టీడీపీ గెలుచుకున్నాయి. ఈసారి టీడీపీ గ్రాఫ్‌ మరింతగా దిగజారింది. చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పంలోనూ వైఎస్సార్‌ సీపీ హవా కనిపి స్తోంది. జిల్లా ప్రజల్ని కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాల వారీగా విభజించి పబ్బం గడుపుకోవాలని చూస్తున్న చంద్రబాబు ఎత్తులు ఫలించే పరిస్థితి లేదని గ్రామాల్లో వెల్లువెత్తుతున్న నిరసనను బట్టి అర్థమవుతోంది.

2014తో పోలిస్తే ఈసారి టీడీపీ బాగా గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటున్నది. జిల్లాలో 1,800కు పైగా పైగా చెరువుల్ని పూడ్చివేయించిన ఘనత చంద్రబాబుకే దక్కింది. చంద్రబాబు పాలనలో రైతులు ఇక్కట్లు పాలయ్యారని చంద్రగిరికి చెందిన జగన్నాథనాయుడు చెప్పారు. ఈ పరిస్థితుల్లో వైఎస్సార్‌ సీపీని గెలిపిస్తే మేలు కలుగుతుందన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో వైఎస్సార్‌ సీపీ విజయం సాధించింది. 

సొంత జిల్లాలోనూ సీఎంకు ఎదురీతే
చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోనూ సైకిల్‌కు ఎదురుగాలి వీస్తోంది. ఆయన మనస్తత్వం, వ్యక్తిత్వం తెలిసిన ప్రజలు ఆయన తీరును ఈసడించుకుంటున్నారు. ‘ఈసారి ఎన్నికల్లో ఆయన పాచికలేవీ పారవు’ అని ఓ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ తెలిపారు. కనిపించని ప్రవాహమేదో చాపకింద నీరులా వ్యాపించిందని, అదే వైఎస్సార్‌ సీపీకి అత్యధిక సీట్లు తెచ్చిపెడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

‘ఇప్పుడు అందరి చూపు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ వైపే ఉంది’ అని పూతలపట్టుకు చెందిన న్యాయ విద్యార్థి నరసింహులు చెప్పారు. ‘ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు పవన్‌ కళ్యాణ్, కేఏ పాల్‌ను రంగంలోకి దించినా అది సక్సెస్‌ కావటం లేదు. ఈసారి వైఎస్సార్‌ సీపీకి ఒక చాన్స్‌ ఇవ్వాలన్నదే ప్రజలందరి అభిప్రాయం’ అని మదనపల్లికి చెందిన కిరణ్‌ చెప్పారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top