
అమరావతి : ప్రధాని నరేంద్ర మోదీ మేనియా తగ్గిపోయిందని, గుజరాత్, రాజస్థాన్‌లో కాంగ్రెస్ పుంజుకుంటోందని పీసీసీ ప్రెసిడెంట్ రఘువీరా రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే రాహుల్ సూర్యుడిగా ఉదయిస్తాడని ఆయన జోస్యం చెప్పారు. మోదీ ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేస్తున్నాడనీ, బడ్జెట్‌లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన పత్రికా ప్రకటనలో తెలిపారు. చంద్రబాబు నాయుడి బలహీనతలే రాష్ట్రానికి శాపమయ్యాయి. వెంటనే అధికార ప్రతిపక్షాలు రాజీనామా చేయాలని పేర్కొన్నారు. విభజన హామీలో ఇచ్చిన ఏ ఒక్కటీ మోదీ ప్రభుత్వం నెరవేర్చలేదని అన్నారు. కేంద్రంలో బీజేపీకి, రాష్ట్రంలో టీడీపీకి ఇదే చివరి బడ్జెట్ కావాలని ఎద్దేవాచేశారు.
స్వామినాథన్ కమీషన్ సిఫారసులను అమలు చేస్తామని ఎన్నికల ముందు హామి ఇచ్చిన బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిందేమిటో అందరికీ తెలుసనీ విమర్శించారు. ఈ బడ్జెట్‌లో కూడా రైతు మద్దతు ధర గురించి మాట్లాడారు కానీ చేసేదేం ఉండదనీ ధ్వజమెత్తారు. ఆరోగ్య బీమా పథకం కూడా 2016-17 బడ్జెట్‌లోనే ప్రకటించింది. కానీ అమలుకు మాత్రం నోచుకోలేదు. మళ్లీ ఇప్పుడు కొత్తగా ప్రకటించారు. ప్రత్యేక హోదా, రాజధానికి నిధులు, రెవెన్యూ లోటు భర్తీ, రైల్వే జోన్, పోలవరం నిధులపై స్పష్టత, దుగ్గరాజపట్నం, కడప ఉక్కు పరిశ్రమ ఇలా ఏ ఒక్క దాని గురించి కూడా బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదని పత్రికాప్రకటనలో పేర్కొన్నారు.