రాహుల్‌కు కేజ్రివాల్‌ ఆదర్శం కావాల్సింది!

Rahul Gandhi Should Take Lessons From Arvind Kejriwal - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘మీరు మందిర్‌–మసీదు వివాదంలో పడిపోయారో మీ పిల్లలు ఆలయాల్లో పూజారులు అవుతారు తప్ప, ఇంజనీర్లు కాలేరు’ అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌  ఢిల్లీలో న వంబర్‌ నాలుగవ తేదీన ‘సిగ్నేచర్‌ బ్రిడ్జి’ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ‘డ్యామ్‌లు ఆధునిక దేవాలయాలు’ అంటూ పంజాబ్‌లో బాక్రానంగల్‌ డ్యామ్‌ ప్రారంభోత్సవం సందర్భంగా భారత తొలి ప్రధాన మంత్రి జవహర్‌ లాల్‌ నెహ్రూ చేసిన వ్యాఖ్యలను కూడా ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా దేశంలో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అభివద్ధికి నెహ్రూ చేసిన కషిని కూడా ప్రస్తావించారు.

స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సేల్‌), భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (బీహెఈఎల్‌), ఖరగ్‌పూర్‌లో ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ), కోల్‌కతా, అహ్మదాబాద్‌లో ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్, బాబా ఆటమిక్‌ రీసర్చ్‌ సెంటర్, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), ఢిల్లీలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఏమ్స్‌)తదితర ప్రతిష్టాకర సంస్థలన్నీ నెహ్రూ కషి ఫలితమేనని గుర్తు చేశారు. పనిలో పనిగా ఢిల్లీలో పిల్లల విద్యకోసం 6,500 తరగతి గదులను తన ప్రభుత్వం కొత్తగా నిర్మించిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలను దష్టిలో పెట్టుకొని అయోధ్యలో రామాలయ నిర్మాణ అంశాన్ని రాజేస్తున్న నేపథ్యంలో బీజేపీ  కరుడుగట్టిన హిందూత్వాన్ని ఎదుర్కోవడంలో భాగంగా కేజ్రివాల్‌ ఇదంతా మాట్లాడారు. ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి మానిష్‌ సిసోడియా ఇటీవల ఎన్‌డీటీవీ షోకు హాజరైనప్పుడు ఆయన్ని అయోధ్య వివాదం గురించి ప్రశ్నించగా, ‘హిందు, ముస్లిం సామాజిక వర్గాలతో చర్చలు జరపాలి. ఇరు వర్గాలు ఒప్పుకుంటే అక్కడో యూనివర్శిటీని నిర్మించాలి’ అని సూచించారు. ఇదీ ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకులు కరుడుగట్టిన హిందూత్వ వాదాన్ని ఎదుర్కొంటున్న విధానం.

జవహర్‌ లాల్‌ నెహ్రూ కుటుంబానికి చెందిన రాహుల్‌ గాంధీ మాత్రం బీజేపీ హిందూత్వ వాదాన్ని ఎదుర్కోవడానికి గుళ్లూ గోపురాలు తిరుగుతున్నారు. పూజలు, పునస్కారాలు చేస్తున్నారు. తాను జంధ్యం ధరించే బ్రాహ్మణుడినేనని తోటి వారితో చెప్పించుకుంటున్నారు. గోత్రాలను కూడా తవ్వి తీస్తున్నారు. తాను విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు అది భారీ కుదుపులకు గురయిందని, రక్షించాల్సిందిగా ఆ శివుడిని వేడుకోకాగానే విమానం ఎలాంటి కుదుపులు లేకుండా క్షేమంగా గమ్యం చేరుకుందని, దాంతో ఆ క్షణం నుంచి తాను శివభక్తుడిగా మారిపోయానని రాహుల్‌ చెప్పుకుంటున్నారు. ఆ లెక్కన ఆ విమానంలో ఎంత మంది శివభక్తులు తయారయ్యారో! రాహుల్‌ అనుసరిస్తున్నది మధువైన హిందుత్వమని, కరుడుగట్టిన బీజేపీ హిందూత్వాన్ని ఎదుర్కోవడానికి ఇదే సరైన మార్గమని ఆయనకు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మేథావి శశిథరూర్‌ కితాబ్‌ కూడా ఇచ్చారు.

లౌకికవాద కుటుంబానికి చెందిన రాహుల్‌ గాంధీ గతంలో దేవున్ని విశ్వసించిన దాఖలాలు లేవు. నమ్మడం, నమ్మక పోవడం ఆయన వ్యక్తిగత విషయం. ఇప్పుడు ఆయన ప్రతి ఎన్నికల సందర్భంగా ప్రతి రాష్ట్రంలోని గుళ్లూ గోపురాలు తిరుగుతూ దాన్ని సామాజిక అంశం చేశారు. నమ్మిన సిద్ధాంతాల పట్ల నిబద్ధత ఉండాలిగానీ, ఓట్ల కోసం ఆత్మవంచన చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏనాడు దేవుడిని నమ్మకపోయినా ఐదు పర్యాయాలు తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించడమే కాకుండా 94 ఏళ్లపాటు జీవించిన ఎం. కరుణానిధిని, దేవుడిని నమ్ముతాడో, లేదో తెలియని నేటి అరవింద్‌ కేజ్రివాల్‌ను రాహుల్‌ గాంధీ ఆదర్శంగా తీసుకొనే ఉంటే రాజకీయాల్లో రాణించే అవకాశం మరింత మెరుగ్గా ఉండేది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top