కాంగ్రెస్‌ చీఫ్‌గా మళ్లీ రాహుల్‌?

Rahul Gandhi is should return as Congress president - Sakshi

డిసెంబర్‌లోగా బాధ్యతలు స్వీకరిస్తారంటున్న పార్టీ వర్గాలు

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీకి రాహుల్‌ గాంధీ మరోసారి అధ్యక్షుడు కానున్నారా? ఈ సంవత్సరం చివరిలోగా మరోసారి పార్టీ పగ్గాలు చేపట్టనున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమిస్తున్నాయి ఢిల్లీ కాంగ్రెస్‌ వర్గాలు. పార్టీలోని వివిధ వర్గాల నుంచి తీవ్రంగా వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో రాహుల్‌ గాంధీ మరోసారి అధ్యక్ష పదవి చేపట్టనున్నారని వారు గట్టిగా చెబుతున్నారు. ప్రియాంక గాంధీని పార్టీ అధ్యక్షురాలిని  చేయాలని పలువురు సీనియర్‌ నేతలు భావిస్తున్నప్పటికీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రస్తుతం అందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీకి ఉత్తరప్రదేశ్‌ చాలా కీలకమని, అందువల్ల ఆ రాష్ట్రంపై మాత్రమే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని సోనియాగాంధీ ఇప్పటికే ప్రియాంక గాంధీకి సూచించారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అధ్యక్షురాలిగా తాను ఉన్నప్పటికీ.. తన ఆరోగ్యం బాగా లేకపోవడం వల్ల.. రాహుల్‌ మరోసారి పూర్తి స్థాయి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని సోనియా కోరుకుంటున్నారని పేర్కొన్నాయి.

ఈ సంవత్సరం చివరినాటికి కొత్త అధ్యక్షుడి ఎన్నిక పూర్తవుతుందని పేర్కొన్నాయి. రాజస్తాన్‌లోని ఉదయపూర్‌లో డిసెంబర్‌ నెలలో ఏఐసీసీ భేటీ జరిగే అవకాశముందని వెల్లడించాయి. 17 మంది పార్టీ సీనియర్‌ సభ్యులతో ఒక పాలసీ అండ్‌ స్ట్రాటెజీ గ్రూప్‌ను బుధవారం సోనియాగాంధీ ఏర్పాటు చేశారు. ఆ బృందంలో రాహుల్‌ గాంధీ సభ్యుడిగా ఉన్నారు కానీ ప్రియాంక గాంధీ లేకపోవడం గమనార్హం. రాహుల్‌కు సన్నిహితులైన పలువురు యువ నేతలకు కూడా ఈ బృందంలో చోటు దక్కింది. దాంతో రాహుల్‌ మరోసారి క్రియాశీలకం కానున్నారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

సోనియా గాంధీ నేతృత్వంలోని ఆ బృందంలో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్, సీనియర్‌ నేతలు రాహుల్‌ గాంధీ, ఏకే ఆంటోనీ, అహ్మద్‌ పటేల్, గులాం నబీ ఆజాద్, మల్లిఖార్జున్‌ ఖర్గే, కపిల్‌ సిబల్, ఆనంద్‌ శర్మ, కేసీ వేణుగోపాల్, గౌరవ్‌ గొగొయి, సుశ్మిత దేవ్, రాజీవ్‌ సతవ్, జ్యోతిరాదిత్య సింధియా, రణ్‌దీప్‌ సింగ్‌ సుర్జేవాలా.. తదితరులున్నారు. ఈ గ్రూప్‌ ఏర్పాటు గురించి పార్టీ తరఫున అధికారిక ప్రకటన ఏదీ వెలుపడలేదు. కానీ సభ్యులకు వ్యక్తిగతంగా సమాచారమిచ్చారని పార్టీ వర్గాలు తెలిపాయి. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఈ బృందం భేటీ అవుతుందని, ఎకానమీ, పౌరసత్వ సవరణ బిల్లు, పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం.. తదితరాలపై చర్చించనుందని వెల్లడించాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top