మీకు ప్రచారనిధులు ఎక్కడివి?

Rahul Gandhi Questions Narendra Modi Over Source Of Funding - Sakshi

ప్రధాని మోదీకి రాహుల్‌ ప్రశ్న

ఆగ్రా/మహువా: టీవీ చానెళ్లలో 30 సెకన్ల ప్రకటనకు లక్షలాది రూపాయలు ఖర్చవుతుండగా ఈ ఎన్నికల్లో ప్రధాని మోదీ చేసుకుంటున్న భారీ ప్రచారానికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. స్నేహితుడు అనిల్‌ అంబానీకి లాభం కలిగేలా రఫేల్‌ ఒప్పందం షరతులను ప్రధాని మోదీ మార్చారని ఆరోపించారు. సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌ సిక్రి, గుజరాత్‌లోని మహువాల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో రాహుల్‌ మాట్లాడారు. ‘ఎక్కడ చూసినా నరేంద్ర మోదీ ప్రచారమే కనిపిస్తోంది. టీవీల్లో 30 సెకన్ల ప్రకటన, పత్రికల్లో చిన్న ప్రకటనకు లక్షల్లో ఖర్చవుతోంది. ఈ డబ్బంతా మోదీకి ఎవరిస్తున్నారు? కచ్చితంగా అది మోదీ జేబులో డబ్బు మాత్రం కాదు’ అని పేర్కొన్నారు. ప్రజల సొమ్మును నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీ, లలిత్‌ మోదీ, విజయ్‌ మాల్యా వంటి పరారైన నేరగాళ్లకు ప్రధాని మోదీ దోచిపెట్టారని ఆరోపించారు.

‘ఏడాదికి రెండు కోట్లు ఉద్యోగాలు, ప్రతి బ్యాంకు అకౌంట్‌లో రూ.15 లక్షలు.. అంటూ ప్రజలను మోసం చేసి మోదీ అధికారంలోకి వచ్చారన్నారు. తాము మాత్రం చేయగలిగిందే చెబుతామన్నారు. న్యాయ్‌ పథకం ద్వారా ప్రతి నిరుపేద మహిళ బ్యాంకు అకౌంట్‌లో ఏడాదికి రూ.72 వేలు జమ చేస్తామన్నారు. ‘ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడకుండా న్యాయ్‌కు అవసరమైన నిధులను సమకూరుస్తాం. మధ్య తరగతిపై భారం వేయం. పన్ను భారం పెంచం. అనిల్‌ అంబానీ, నీరవ్‌ మోదీ వంటి వారి నుంచి వీటిని రాబడతాం’ అని రాహుల్‌ వివరించారు. రఫేల్‌ డీల్‌ విషయంలో ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు వివరణ కోరిన నేపథ్యంలో రాహుల్‌ కాస్త వెనక్కి తగ్గారు. రూ.30 వేల కోట్ల మేర తన మిత్రుడు, పారిశ్రామిక వేత్త అయిన అనిల్‌ అంబానీకి అనుకూలంగా ప్రధాని మోదీ రఫేల్‌ ఒప్పందం షరతులను మార్చారని రాహుల్‌ ఆరోపించారు. యూపీఏ హయాంలో కుదిరిని ఒప్పందంలో 126 ఫైటర్‌ జెట్లను కొనుగోలు చేయాల్సి ఉంది. కానీ, మోదీ ఈ ఒప్పందాన్ని 36 ఫైటర్‌ జెట్లకే పరిమితం చేస్తూ, అత్యధిక ధర చెల్లించేలా మార్చారు. ఎలాంటి అనుభవం లేని అనిల్‌ అంబానీ సంస్థకు రూ.30 వేల కోట్లు లబ్ధి చేకూర్చారు. దీనిపై దర్యాప్తు చేస్తామని చెప్పగానే సీబీఐ డైరెక్టర్‌ను రాత్రికి రాత్రే ప్రభుత్వం మార్చేసింది’ అని ఆరోపించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top