ఢిల్లీలో.. గల్లీలో...

protesters Protests at gandhi bhavan - Sakshi

‘పారాచూట్‌’లకు టికెట్లు ఇవ్వొద్దంటూ పలువురు ఆశావహుల నిరసనలు

సాక్షి, హైదరాబాద్‌/న్యూఢిల్లీ: ఢిల్లీలోనూ, గల్లీలోనూ రోజూ అదే లొల్లి. ధర్నాలు, ఆందోళనలు, నిరసనల హోరు. గాంధీభవన్‌లో నిత్యం అదే దృశ్యం. కొద్దిరోజులుగా చేరికలతో నిండిన ఉత్సాహం... అభ్యర్థుల జాబితా ప్రకటించే సమయం సమీపిస్తున్న కొద్దీ ఉద్రి క్తంగా మారుతోంది. పారాచూట్‌ (టీఆర్‌ఎస్‌ నుంచి చివరి నిమిషంలో కాంగ్రెస్‌లో చేరిన వారు) నేతలకు పార్టీ టికెట్లు ఇవ్వద్దని పలువురు ఆశావహులు కాంగ్రెస్‌ అధిష్టానాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. పార్టీని నమ్ముకుని ఇన్నాళ్లు సేవ చేసినవారిని విస్మరిస్తే సహించబోమంటున్నారు.

కొంతమంది పారాచూట్‌లకు టికెట్లు ఇస్తున్నారన్న ప్రచారం నేపథ్యంలో హైదరాబాద్‌లోని గాంధీభవన్, ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆశావహులు ఆందోళన చేస్తున్నారు. పార్టీ గెలిచే స్థానాలను పొత్తుల పేరుతో కూటమి పక్షాలకు కట్టబెట్టవద్దంటూ నినదిస్తున్నారు. వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల నేతల ఆందోళనలతో గాంధీభవన్‌ అట్టుడుకుతోంది. రోజురోజుకూ నిరసనలు పెరుగుతుండటంతో గాంధీభవన్‌లో హైటెన్షన్‌ నెలకొంది. ఆదిలాబాద్‌ జిల్లా ఖానాపూర్‌ సీటును మాజీ ఎంపీ రమేశ్‌ రాథోడ్‌కు ఇవ్వొద్దంటూ ఆ పార్టీ నేత హరినాయక్‌ మద్దతుదారులు చేస్తున్న నిరాహార దీక్షలు మూడోరోజుకు చేరుకున్నాయి.

ఆ స్థానాన్ని హరినాయక్‌కు కేటాయించకుంటే పార్టీ చిత్తుగా ఓడిపోవడం ఖాయమని ఆయన మద్దతుదారులు ఆందోళన కొనసాగిస్తున్నారు. మూడు రోజులుగా దీక్ష చేస్తున్న కార్యకర్తల ఆరోగ్యం క్షీణించింది. మేడ్చల్‌ జిల్లా మల్కాజిగిరి స్థానం కాంగ్రెస్‌ నేత నందికంటి శ్రీధర్‌కే కేటాయించాలని ఆయన మద్దతుదారులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో హోరెత్తించారు. పటాన్‌చెరువు టికెట్‌ను వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె.రాములుకు కేటాయించాలని కార్యకర్తలు డిమాండ్‌ చేస్తున్నారు.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని వేములవాడ సీటును ఆది శ్రీనివాస్‌కు ఇవ్వొద్దని పలువురు కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. వేములవాడ టికెట్‌ను ఏనుగు మనోహర్‌రెడ్డికి కేటాయించాలని కార్యకర్తలు నినాదా లు చేశారు. వరంగల్‌ వెస్ట్‌ స్థానాన్ని టీడీపీకి కేటా యించనున్నారన్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డితోపాటు ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు.

ఢిల్లీలోనూ నిరసనలు...
స్టేషన్‌ ఘన్‌పూర్‌ నుంచి టికెట్‌ ఆశిస్తున్న మాజీ మంత్రి విజయరామారావు, చేవెళ్ల నుంచి జీబీ శ్యాం రావు, ధర్మపురి నుంచి గడ్డం రాజేశ్, మల్కాజిగిరి నుంచి ఆవుల రాజుయాదవ్, కంటోన్మెంట్‌ సీటు ఆశిస్తున్న విజయరామరాజు తదితరులు ఆదివారం తెలంగాణభవన్‌లో ధర్నా చేపట్టారు.

కాంగ్రెస్‌లో ఎవరికి టికెట్‌ ఇచ్చినా కలసి పనిచేస్తామని, కానీ పారాచూట్‌లకు ఇస్తే అంగీకరించబోమన్నారు. ఖైరతాబాద్‌ స్థానాన్ని టీడీపీకి ఇవ్వొద్దని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్‌రెడ్డి పార్టీ పెద్దలను కలసి కోరారు. ఈసారి సీటు తనకు కేటాయించాలని కోరినట్టు సమాచారం. ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఓయూ జేఏసీ నేతలకు, ఉద్యమకారులకు కాంగ్రెస్‌ ఐదు సీట్లు ఇవ్వాలని ఓయూ జేఏసీ అధ్యక్షుడు విజయ్‌కుమార్, మానవతారాయ్‌ తదితరులు ధర్నా చేపట్టారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top