ప్రియాంక గాంధీపై కేజ్రీవాల్‌ ఫైర్‌

Priyanka Gandhi Wasting Her Time For Roadshows Says Kejriwal - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ రాజధాని ఢిల్లీలో ఈనెల 12న మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరుగుతున్న నేపథ్యంలో రాజకీయం మరింత వేడెక్కింది. నిన్నటి వరకు బీజేపీ నేతలపై విరుచుకుపడిన ఢిల్లీ సీఎం, ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ తాజాగా కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఢిల్లీలో ప్రచారం చేసి తన సమయాన్ని వృధా చేసుకుంటున్నారని మండిపడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడకుండా ఆప్‌ అభ్యర్థులు ఉన్నచోటే ర్యాలీలు నిర్వహిస్తున్నారని కేజ్రీవాల్‌ విమర్శించారు.   

బీజేపీ, కాంగ్రెస్‌ ముఖాముఖి పోటీపడుతున్న స్థానాల్లో ప్రియాంక, రాహుల్‌ గాంధీ ప్రచారం చేయట్లేదని, యూపీలో కూడా ఎస్పీ, బీఎస్పీ అభ్యర్థులకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పోటీపడుతున్న రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో ప్రియాంక గాంధీ ఎందుకు పర్యటించట్లేదని ఆయన ప్రశ్నించారు. బీజేపీని ఓడించాలని విపక్షాలంతా కలిసి కట్టుగా పోరాడుతుంటే కాంగ్రెస్‌ పార్టీ దానికి భిన్నంగా వ్యవహరిస్తోందన అసహనం వ్యక్తం చేశారు.

కాగా కాంగ్రెస్‌ అభ్యర్థులను విజయాన్ని ఆకాంక్షిస్తూ.. ప్రియాంక గాంధీ బుధవారం ఢిల్లీలో రోడ్‌షోలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రోడ్‌షోకు ముందు ఆప్‌ నేతలతో కలిసి కేజ్రీవాల్‌ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ వ్యవహరిస్తున్న తీరు సరైనది కాదన్నారు. ఆప్‌, ఎస్పీ, బీఎస్పీ అభ్యర్థులకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే వారికే నష్టమన్నారు. కాంగ్రెస్‌లో కొందరు నాయకుల కారణంగానే ఢిల్లీలో పొత్తు కుదరలేదని ఆయన  వెల్లడించారు. కాగా ఆరో విడత సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలకు మే 12న ఎన్నికలు జరుగునున్న విషయం తెలిసిందే. ఏడు స్థానాల్లోనూ ఆప్‌, కాంగ్రెస్‌, బీజేపీ మధ్య తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top