దీదీ కోసం రంగంలోకి దిగిన పీకే టీం!!

Prashant Kishor Team Take Initiative To Lakh Youth To Join Politics In West Bengal - Sakshi

కోల్‌కతా : సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురైన నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని దీటుగా ఎదుర్కొనేందుకు తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ఎన్నికల వ్యూహాలు రచించడంలో దిట్టగా పేరొందిన ప్రశాంత్‌ కిషోర్‌ను తమ పార్టీ వ్యూహకర్తగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పీకే టీం రాజకీయాల్లో యువత (పాలిటిక్స్‌ ఇన్‌ యూత్‌) పేరిట ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. యువతలో రాజకీయ చైతన్యం పెంచే క్రమంలో ప్రత్యేక శిక్షణా తరగతులు ఏర్పాటు చేసే దిశగా ముందు సాగుతోంది. ఇప్పటికే రోజుకు దాదాపు ఐదు వేల మంది ఈ కార్యక్రమంలో తమ పేరు నమోదు చేసుకుంటున్నారు.

ఈ క్రమంలో సెప్టెంబరు నాటికి 5 లక్షల సభ్యత్వాలే లక్ష్యంగా పీకే టీం ప్రణాళికలు రచిస్తోంది. తమ టార్గెట్‌ పూర్తైన  తర్వాత 15 నెలల పాటు శిక్షణా తరగతులు నిర్వహించనుంది. ఇక ఈ ట్రెయినింగ్‌ పూర్తైన తర్వాత యువత తమకు నచ్చిన పార్టీలో చేరే వీలు కల్పించడం విశేషం. మరోవైపు టీఎంసీ కూడా ‘యూత్‌ ఇన్‌ పాలిటిక్స్‌’ పేరిట సోషల్‌ మీడియాలో ఇప్పటికే భారీగా ప్రచార కార్యక్రమాలు చేపట్టింది. తద్వారా లోక్‌సభ ఎన్నికల్లో దూకుడు ప్రదర్శించిన బీజేపీకి... 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కళ్లెం వేయాలని భావిస్తోంది. ఇక బెంగాల్‌లో మొత్తం 40 లోక్‌సభ స్థానాలుండగా.. టీఎంసీ 22 స్థానాల్లో విజయం సాధిస్తే.. బీజేపీ దీదీకి గట్టి పోటీ ఇస్తూ.. ఏకంగా 18 స్థానాల్లో గెలుపొందిన విషయం విదితమే.

కాగా 2014 సార్వత్రిక ఎన్నికల్లో నరేం‍ద్ర మోదీ ప్రధానిగా గెలుపొందడం, నితీష్‌ కుమార్‌ బిహార్‌ ముఖ్యమంత్రిగా విజయం సాధించడం వెనక ప్రశాంత్‌ కిషోర్‌ వ్యూహాలు కీలకంగా పని చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రశాంత్‌ కిషోర్‌ పార్టీ వ్యూహకర్తగా ఉంటే గెలుపు తథ్యమనే భావన నాయకుల్లో బలంగా నాటుకుపోయింది. ఈ క్రమంలో బెంగాల్‌లో క్రమేపీ బలపడుతున్న బీజేపీని నిలువరించేందుకు దీదీ పీకే టీంను ఎంచుకున్నట్లు సమాచారం.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top