క్యాస్టే...  బూస్ట్‌

Politics around the castes in Madhya Pradesh and Chhattisgarh - Sakshi

మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో కులాల చుట్టూ రాజకీయాలు  

ఓబీసీలు, అగ్రవర్ణాలదే ఆధిపత్యం

బలపడుతున్న దళితులు

మధ్యప్రదేశ్‌లో 65% ఓట్లు కుల ప్రాతిపదికగానే..

భారత రాజకీయాలు, ఎన్నికల్లో కులాల పాత్రను వేరుగా చూడలేం. ఈ ఒక్క రాష్ట్రానికి అది మినహాయింపు అని చెప్పలేం. చిన్న కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి పెద్దరా ష్ట్రాలైన మధ్యప్రదేశ్, యూపీ వంటి రాష్ట్రాలవరకు ప్రతిచోటా కుల సమీకరణాలు అత్యంత కీలకంగా మారాయి. అందుకే పార్టీలన్నీ సోషల్‌ ఇంజనీరింగ్‌పైనే దృష్టి పెడుతున్నాయి. సెంటర్‌ ఫర్‌ ద స్టడీ ఆఫ్‌ డెవలపింగ్‌ సొసైటీస్‌ (సీఎస్‌డీఎస్‌) జరిపిన అధ్యయనంలో మధ్యప్రదేశ్‌లో పోలయ్యే ఓట్లలో 65% కులం ఆధారంగా పడేవేనని వెల్లడైంది. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇంత ఎక్కువ శాతంలో కులం ఓట్లు పడవు. ఇక్కడ చాలా కులాలు ఉన్నప్పటికీ అగ్రవర్ణాలు, ఓబీసీలదే ఆధిపత్యం.

రాష్ట్ర జనాభాలో 55% ఉన్న ఈ వర్గం (రాజ్‌పుత్, యాదవ, బ్రాహ్మణ వర్గాలు) బీజేపీకి సాంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఇందులో అగ్రవర్ణాలు 22%. ఎస్సీ, ఎస్టీల జనాభా 37%. వీరిలో ఎస్సీలు కాంగ్రెస్‌కు అండగా ఉండగా.. ఎస్టీల్లో మెజారిటీ బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఎస్సీ, ఎస్టీల జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ.. మిగిలిన కులాలతో పోలిస్తే సరైన చైతన్యం లేకపోవడంతో రాజకీయంగా వీరు ప్రభావం చూపలేకపోతున్నారు. దీంతో మధ్యప్రదేశ్‌లో అగ్రవర్ణాలు, ఓబిసీలదే పైచేయిగా ఉంది. ప్రధాన పార్టీలు కూడా ఈ రెండు వర్గాలపైనే ప్రధానంగా దృష్టి సారించాయి. ప్రస్తుత సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్, మాజీ సీఎం ఉమాభారతి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాకేశ్‌ సింగ్‌లు ఓబీసీలే కావడం రాష్ట్రంలో వారి పరపతి ఏ స్థాయిలో ఉందో చెబుతోంది. 

కుల సమీకరణాలు మారుతున్నాయ్‌ 
2018లో ఈ కుల సమీకరణాల్లో మార్పు వచ్చింది. ఓబీసీలకు రాజకీయంగా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండటంతో అగ్రవర్ణాలు బీజేపీ పట్ల అసంతృప్తిగా ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ చట్టానికి సవరణలు చేయడంపైనా.. బీజేపీ వైఖరి అగ్రవర్ణాలకు రుచించలేదు. ఈ విషయంలో కాంగ్రెస్‌ తమకు మద్దతుగా ముందుకు రాకపోవడంతో వారు ఆ పార్టీని కూడా తప్పుపడుతున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మధ్యప్రదేశ్‌ జనాభా 7 కోట్లు కాగా.. ఇందులో 52% అగ్రవర్ణాలు, ఓబీసీలున్నారు. ఎస్సీలు 16%, ఎస్టీలు 21% ఉన్నారు. మొత్తంగా రాష్ట్ర జనాభాలో 91% హిందువులుండగా.. ముస్లింలు 7%, ఇతర మైనారిటీలు 2%గా ఉన్నారు. 

ఓబీసీలదే మెజారిటీ
సంఖ్యాపరంగా చూస్తే ఈ ఛత్తీస్‌గఢ్‌లో 42% ఉన్న ఓబీసీలదే (కుర్మీలు, సాహులు) మెజారిటీ. బ్రాహ్మణులు, యాదవులు ఉన్నప్పటికీ రాజకీయాలను ప్రభావితం చేసే సంఖ్యలో లేరు. అందుకే కాంగ్రెస్, బీజేపీలు ఓబీసీలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 2.56 కోట్లు కాగా.. వీరిలో ఎస్సీలు 12.82%, ఎస్టీలు 30.62%. మొత్తం జనాభాలో 93.25% హిందువులు. ఓబీసీల్లో ఎక్కువ మంది కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచారు. అయితే, అజిత్‌జోగి హయాంలో కాంగ్రెస్‌ తమను చిన్నచూపు చూసిందన్న కోపంతో బీజేపీ వైపు మళ్లారు. అజిత్‌జోగి, రమణ్‌ సింగ్, భూపేష్‌ భగేల్, తామ్రధ్వాజ్‌ సాహులు రాష్ట్రంలో పేరొందిన ఓబీసీ నేతలు. 

తల్లీకొడుకుల సవాల్‌! 
ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టినీ ఆకర్శిస్తున్న స్థానం దంతేవాడ నియోజకవర్గం. ఇందుకు కారణం.. తల్లీకొడుకులు వేర్వేరు పార్టీలనుంచి బరిలో ఉండటమే. నక్సలైట్ల చేతిలో చనిపోయిన సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మ భార్య దేవతికి (సిట్టింగ్‌)కి ఈసారి కూడా ఆమెకే కాంగ్రెస్‌ టికెట్‌ కేటాయించింది. ఈ స్థానం నుంచి ఈసారి మహేంద్ర కర్మ కుమారుడు ఛవీంద్ర కర్మ ఎస్పీ టికెట్‌పై బరిలో దిగారు.  ఇన్నాళ్లూ తల్లికి రాజకీయాల్లో చేదోడువాదోడుగా ఉన్న చవీంద్ర బరిలో ఉండటంతో పోటీ రసవత్తరంగా మారింది. పోటీ చేయొద్దంటూ సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు.. ఛవీంద్రను కలిసి బతిమాలినప్పటికీ ఫలితం కనిపించలేదు. ‘అమ్మకు నేను వ్యతిరేకం కాదు. కానీ కాంగ్రెస్‌ నేతలు ఇచ్చిన బూటకపు హామీలపైనే నా పోరాటం’ అని ఛవీంద్ర పేర్కొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top