ఉపఎన్నికల్లో జీ‘హుజూర్‌’.. ఎవరికో?

Political Parties Election Compaign On Huzurnagar Bypoll Election - Sakshi

2009, 2014, 2018 ఎన్నికల్లో వరుసగా ఉత్తమ్‌ విజయం

ఉప ఎన్నికల్లో గెలుపునకు సర్వశక్తులొడ్డుతున్న పార్టీలు

సాక్షి, సూర్యాపేట : హుజూర్‌నగర్‌ నియోజకవర్గం.. ఎన్నికల శంఖారావం ప్రారంభమైనప్పటి నుంచి ఉంది. 1952లో తొలిసారిగా ఈ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగాయి. 1972 ఎన్నికల తర్వాత  ఈ నియోజకవర్గం రద్దయింది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో మళ్లీ నియోజకవర్గంగా ఏర్పాటైంది. ఈ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల్లో మూడుసార్లు పీడీఎఫ్, ఐదుసార్లు కాంగ్రెస్‌ విజయం సాధిస్తే.. స్వతంత్ర అభ్యర్థి ఒకసారి గెలుపొందారు. 2009 ఎన్నికల నుంచి ఈ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ పోటీ చేస్తూ వస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు గెలిచిన రికార్డు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిదే. ఈ ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతుండడంతో ఈ సారి నియోజకవర్గ ప్రజలు ఎవరికి పట్టం కట్టకడతారో..? హుజూర్‌నగర్‌ ఎవరికి దక్కనుందో.. వచ్చే నెల 24న ఓట్ల లెక్కింపుతో తేలనుంది. 

నిషేధం ఉన్నా కమ్యూనిస్టుల ప్రభంజనం..
1952లో హుజూర్‌నగర్‌ ద్విసభ నియోజకవర్గంగా ఏర్పడింది. ఎన్నికల సమయానికి కమ్యూనిస్టు పార్టీపై నిషేధం కొనసాగుతూనే ఉంది. దీంతో కమ్యూనిస్టులు ప్రగతిశీల ప్రజాస్వామ్య కూటమి (పీడీఎఫ్‌)గా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా పలు స్థానాల్లో బరిలో నిలిచి విజయం సాధించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ అప్పట్లో పీడీఎఫ్‌ విజయ దుందుభి మోగించింది. ద్విసభ నియోజకవర్గమైన హుజూర్‌నగర్‌ నుంచి ఈ ఎన్నికల్లో పీడీఎఫ్‌ అభ్యర్థులు జయసూర్య, టి.నర్సింహులు విజయం సాధించారు.

ఈ ఎన్నికల్లో జయసూర్యకు 49,829 ఓట్లు రాగా, సమీప కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కె.ఎల్‌.ఎన్‌.రావుకు 11,972 ఓట్లు వచ్చాయి. అలాగే టి.నర్సింహులుకు 42,421 ఓట్లు పోలైతే, సమీప కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సుమిత్రాదేవికి 11,478 ఓట్లు పడ్డాయి. జయసూర్య మెదక్‌ నుంచి లోక్‌సభకు ఎన్నిక కావడంతో ఏర్పడిన ఖాళీతో ఉప ఎన్నిక జరిగింది. ఈ  ఎన్నికలో ప్రముఖ కమ్యూనిస్టు నేత, కవి ముక్ధుం మొయినుద్దీన్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి జి. ఎస్‌.రెడ్డిపై గెలుపాందారు.

ఆయనకు 31,289 ఓట్లు రాగా, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థికి 20,686 ఓట్లు పోల్‌ అయ్యాయి. ఆ తర్వాత 1957లో జరిగిన ఎన్నికల్లో పీడీఎఫ్‌ అభ్యర్థి దొడ్డ నర్సయ్య, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వీబీ.రావుపై గెలిపారు. నర్సయ్యకు 21,521 ఓట్లు వస్తే వీబీ.రావుకు 15,634 ఓట్లు దక్కాయి. 

1962లో ఎగిరిన కాంగ్రెస్‌ జెండా..
నియోజకవర్గం ఏర్పాటైన పదేళ్ల తర్వాత హుజూర్‌నగర్‌పై కాంగ్రెస్‌ జెండా ఎగిరింది. అక్కిరాజు వాసుదేవరావు ఈ నియోజకవర్గ తొలి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే. 1962 ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తే 25,394 ఓట్లు రాగా సీపీఐ అభ్యర్థిగా బరిలో నిలిచిన దొడ్డ నర్సయ్యకు 22,561 ఓట్లు పడ్డాయి. 2,833 ఓట్ల మెజారిటీతో వాసుదేవరావు విజయం సాధించారు. 1967 ఎన్నికల్లోనూ వాసుదేవరావు కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగి 26,618 ఓట్లు పొందారు. ఈ ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థిగా బరిలోకి దిగిన దొడ్డ నర్సయ్యకు 23,730 ఓట్లు వచ్చాయి.

దీంతో ఎన్నికల్లోనూ వాసుదేవరావుకే విజయం దక్కింది. హుజూర్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల చరిత్రలో 1962, 1967 ఎన్నికల్లో ప్రత్యర్థులుగా తలపడింది వీరిద్దరే. 1972 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీకి దిగిన వాసుదేవరావుపై స్వతంత్ర అభ్యర్థి కె.జితేందర్‌రెడ్డి గెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి 26,699 ఓట్లు వస్తే.. స్వతంత్ర అభ్యర్థికి 41,007 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత 1978 ఎన్నికల నాటికి ఈ నియోజకవర్గం  రద్దయింది. 

పునర్విభజనతో హస్తం ఆధిపత్యం..
పునర్విభజనతో ఈ నియోజకవర్గం నేరేడుచర్ల, గరిడేపల్లి, మఠంపల్లి, హుజూర్‌నగర్, మేళ్లచెరువు మండలాలతో ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత 2016లో నేరేడుచర్ల నుంచి పాలకవీడు, మేళ్లచెరువు నుంచి చింతపాలెం మండలాలను కొత్తగా ఏర్పాటు చేశారు. వీటితో కలిపి నియోజకవర్గంలో ఏడు మండలాలయ్యా యి. పునర్విభజనతో ఏర్పాటయిన ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు జరిగిన మూడు ఎన్నికల్లో హస్తందే ఆధిపత్యం కొనసాగింది.

2009లో జరిగిన ఎన్నికల్లో నల్లమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డిపై గెలిచారు. ఈ ఎన్నికల్లో ఉత్తమ్‌కు 80,835 ఓట్లు రాగా, జగదీశ్‌రెడ్డికి 51,641 ఓట్లు పోలయ్యాయి. 2014 ఎన్నికల్లోనూ ఉత్తమ్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు.  కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ఉత్తమ్, టీఆర్‌ఎస్‌ నుంచి కాసోజు శంకరమ్మ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఉత్తమ్‌కు 69,879 ఓట్లు పడగా శంకరమ్మకు 45,955 ఓట్లు వచ్చాయి. 

2018 ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన టీఆర్‌ఎస్‌..
2009 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బరిలోకి దిగితే 51,641 ఓట్లు, 2014 ఎన్నికల్లో ఆ పార్టీకి 45,955 ఓట్లు వచ్చాయి. అయితే 2018 ఎన్నికల్లో మాత్రం టీఆర్‌ఎస్‌.. కాంగ్రెస్‌ పార్టీకి గట్టి పోటీనిచ్చింది. ఆపార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన శానంపూడి సైదిరెడ్డి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఉత్తమ్‌కు 92,966 ఓట్లు రాగా, సైదిరెడ్డికి 85,530 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఉత్తమ్‌ 7,436 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. స్వల్ప ఓట్ల తేడాతో ఉత్తమ్‌ గట్టెక్కారు.

అయితే ఈసారి విజయం తమదేనని ఇటు టీఆర్‌ఎస్, అటు కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీలు «ధీమాగా చెబుతున్నాయి. ఈ ఎన్నికల్లో నాలుగో సారి కాంగ్రెస్‌ జెండా ఎగురవేస్తుందా..? లేక టీఆర్‌ఎస్‌ బోణి కొడుతుందా, ఇతర పార్టీలు ప్రభంజనం చూపుతాయన్న చర్చ నియోజవకర్గ వ్యాప్తంగా హాట్‌ టాఫిక్‌గా మారింది.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top