
సాక్షి, న్యూఢిల్లీ: ‘పాకిస్థాన్ మనల్ని విభజించాలని చూస్తోంది. కానీ భారత్ ఉమ్మడిగానే ఉంటూ పోరాడుతుంది. ఒక్కటిగానే మనుగడ సాగిస్తూ.. విజయం సాధిస్తుంది’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఆయన గురువారం భారీ వీడియో కాన్ఫరెన్స్‌లో సుమారు కోటిమంది బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తలతో మాట్లాడారు. ‘మేరి బూత్.. సబ్సే మజ్‌బూత్’ పేరిట ప్రధాని నిర్వహిస్తున్న ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రపంచంలోనే అతిపెద్దదని, ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 10కోట్ల మంది ప్రజలకు వివిధ వేదికల ద్వారా చేరుతుందని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, పాక్ చేతిలో భారత పైలట్‌గా బంధీగా ఉన్న సమయంలోనే ఈ వీడియో కాన్ఫరెన్స్‌ను మోదీ నిర్వహిస్తుండటంతో ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రసంగించిన ప్రధాని మోదీ ఏమన్నారంటే..
- అన్ని రంగాల్లో మనం తీవ్రంగా కటోరంగా శ్రమించాల్సిన అవసరముంది. దేశాన్ని కాపాడుతున్న వారికి పట్ల మనం కృతజ్ఞత చూపించాలి. వాళ్లు ఉన్నందువల్లే దేశం అభివృద్ధిలో కొత్త శిఖరాలను అందుకోగలుగుతోంది.
- భద్రతా దళాల నైతిక విలువలు దెబ్బతీసేవిధంగా ఎలాంటి చర్యలను మనం చేపట్టరాదు.
- పాకిస్థాన్ మనల్ని విడదీయాలని చూస్తోంది. మనం సైనికుల్లా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది.
- శత్రువు మనల్ని అస్థిర పరచాలని చూస్తున్నాడు. ఉగ్రవాద దాడులు జరిపాడు. మన అభివృద్ధిని అడ్డుకోవడమే వారి లక్ష్యం. వారి దుష్ట కుట్రలను ఎదుర్కొనేందుకు నేడు దేశపౌరులందరూ ఒక్కటిగా నిలబడ్డారు.