‘సర్జికల్‌’పై సాక్ష్యాలు కావాలట! | PM Modi attacks Congress for seeking video proof of surgical strike | Sakshi
Sakshi News home page

‘సర్జికల్‌’పై సాక్ష్యాలు కావాలట!

Nov 27 2018 4:43 AM | Updated on Mar 18 2019 9:02 PM

PM Modi attacks Congress for seeking video proof of surgical strike - Sakshi

భిల్వారాలో ప్రచార సభావేదికపై నుంచి అభివాదం చేస్తున్న మోదీ, బీజేపీ నేతలు

భిల్వారా:  ముంబైలో 2008, నవంబర్‌ 26న లష్కరే తోయిబా ఉగ్రవాదుల మారణహోమం సమయంలో దేశభక్తి గురించి మాట్లాడిన కాంగ్రెస్‌ నేతలు, రెండేళ్ల క్రితం భారత ఆర్మీ చేపట్టిన సర్జికల్‌ స్ట్రైక్స్‌పై మాత్రం వీడియో సాక్ష్యాలు అడిగారని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ఈ దారుణానికి పాల్పడినవారిని ఎన్నటికీ విడిచిపెట్టబోమనీ, సరైన సమ యం కోసం ఎదురుచూస్తున్నామన్నారు.  ముంబైపై పాక్‌ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు దాడిచేసి 166 మందిని బలికొన్న ఘటనకు సోమవారంతో పదేళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో రాజస్తాన్‌లోని భిల్వారాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ.. ఉగ్రవాదం, మావోయిజంపై కాంగ్రెస్‌ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు.

రిమోట్‌ కంట్రోల్‌ పాలన నడిచేది..
ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీఏ చైర్‌పర్సన్, అప్పటి కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ లక్ష్యంగా మోదీ విరుచుకుపడ్డారు. ‘‘నవంబర్‌ 26... పదేళ్ల క్రితం ఇదే రోజున ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వాన్ని ఓ మేడమ్‌(సోనియా) రిమోట్‌ కంట్రోల్‌తో పాలించేవారు. ముంబైపై ఉగ్రవాదులు దాడికి తెగబడి మన ప్రజలు, భద్రతా బలగాలను హత్య చేసినప్పుడు కేంద్రంతో పాటు మహారాష్ట్రలోనూ కాంగ్రెస్‌ ప్రభుత్వాలే ఉన్నాయి. నాకు బాగా  గుర్తుంది. దాడి జరిగిన సమయంలో రాజస్తాన్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జరుగుతోంది.

ఉగ్రదాడులను ఖండించిన వివక్ష నేతలపై అప్పట్లో అధికార కాంగ్రెస్‌ నేతలు అంతెత్తున ఎగిరిపడ్డారు. ‘ఇది యుద్ధం. పాకిస్తాన్‌ భారత్‌ పై దాడిచేసింది. కానీ ప్రతిపక్షాలన్నీ దీన్ని రాజకీయం చేయాలని చూస్తున్నాయి. ఇలాంటి సమయాల్లో అన్ని పార్టీలు కేంద్రానికి అండగా నిలవాలి. ఉగ్రదాడులపై రాజకీయాలు చేయడం సరికాదు’ అంటూ నీతులు చెప్పారు. కానీ రాజస్తాన్‌ ఎన్నికల్లో గెలిచేందుకు ఈ ఉగ్ర ఘటనను ఓ అస్త్రంగా కాంగ్రెస్‌ నేతలు వాడుకున్నారు’’ అని మోదీ దుయ్యబట్టారు.

‘ముంబై’ దోషులను విడిచిపెట్టబోం..
‘2016 సర్జికల్‌ దాడులతో భారత సైన్యం ఉడీ ఉగ్రదాడి ఘటనపై ప్రతీకారం తీర్చుకుంది.  శత్రువులను వారి ఇంట్లో దూరి చావుదెబ్బ కొట్టింది. ఇలాంటి గొప్ప సమయంలో కాంగ్రెస్‌ నేతలు ఏమడిగారో తెలుసా? సర్జికల్‌ దాడులు నిజంగానే జరిగాయనటానికి వీడియో సాక్ష్యాలను చూపాలన్నారు. ఆపరేషన్ల సమయంలో సైనికులు చేతిలో కెమెరాలు తీసుకుని వెళతారా? వాళ్లు తమ ప్రాణాలకు తెగించి దేశం కోసం పోరాడేందుకు వెళ్లారు. ఈ సమయంలో మాత్రం కాంగ్రెస్‌ నేతలకు పదేళ్ల క్రితం వల్లించిన దేశభక్తి ప్రవచనాలు గుర్తుకురాలేదు’ అని ప్రధాని మండిపడ్డారు.  

నా కులంపైనే కాంగ్రెస్‌కు మక్కువ..
‘ఉగ్రవాదులు, నక్సల్స్, మావోయిస్టులు.. చిన్నారుల చేతికి తుపాకులు ఇచ్చి అమయాకులను చంపుతున్నారు. ఓవైపు ఇలాంటి ఉగ్రమూకలకు అర్థమయ్యే భాషలో కేంద్రం జవాబిస్తుంటే, మరోవైపు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఆయన అనుచరగణం నక్సలైట్లను విప్లవకారులుగా కీర్తిస్తూ సర్టిఫికెట్లు అందజేస్తోంది. ఎన్నికలు సమీపించేకొద్దీ కాంగ్రెస్‌ నేతలు నా కులం గురించి, నా తండ్రి పేరు గురించి బాగా అడుగుతున్నారు. కానీ ఓ భారత ప్రధానిగా నేను అమెరికాకు వెళ్లి ఆ దేశ అధ్యక్షుడితో భేటీ అయితే అభివృద్ధి, సంక్షేమం గురించి మాత్రమే ఆయన మాట్లాడతారు. నా కులం గురించి అడగరు. దేశంలోని 125 కోట్ల మంది ప్రజల కులాలకు ప్రధానిగా నేను ప్రాతినిధ్యం వహిస్తున్నా’ అని ప్రధాని మోదీ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement