రాష్ట్రాభివృద్ధికి బాబు చేసింది శూన్యం

Peddireddy Ramachandra Reddy comments about Chandrababu - Sakshi

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

ఎర్రచందనం స్మగ్లర్‌కు పీలేరు టీడీపీ టికెట్‌ ఎలా ఇచ్చారు?

అందరం కలసికట్టుగా జగన్‌ను సీఎం చేసుకుందామని పిలుపు

పీలేరు (చిత్తూరు జిల్లా): రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేసింది శూన్యమని, గతంలో ఎన్నడూ లేని విధంగా రాక్షస పాలన రాజ్యమేలుతోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన చిత్తూరు జిల్లా పీలేరులో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు స్వార్థం కోసం ఎంతటికైనా దిగజారుతాడని విమర్శించారు. ఈ ఎన్నికల్లో జగన్‌ నాయకత్వంలో 150 స్థానాల్లో ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందని, అందరం కలసికట్టుగా పనిచేసి జగన్‌ను సీఎంగా చేసుకుందామని పిలుపునిచ్చారు.

ఆ భూముల్ని పేదలకు పంచుతాం
పీలేరులో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములను టీడీపీ నేతలు ఆక్రమించుకున్నారని పెద్దిరెడ్డి ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆక్రమణకు గురైన భూములను స్వాధీనం చేసుకొని అర్హులైన పేదలకు పంచుతామని తెలిపారు. 2014 ఎన్నికలప్పుడు పీలేరు బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ కిశోర్‌ను ఎర్రచందనం స్మగ్లర్‌గా ఆరోపించారని, అయితే ఇప్పుడు సిగ్గులేకుండా అతనికే పీలేరు టికెట్‌ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. రాజంపేట ఎంపీగా పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని, పీలేరు ఎమ్మెల్యేగా చింతల రామచంద్రారెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. పీలేరును అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తామని భరోసా ఇచ్చారు. జగన్‌ చిన్నాన్న వై.ఎస్‌.వివేకానందరెడ్డిని అతి దారుణంగా అధికార పార్టీ అండతో హత్య చేశారని పెద్దిరెడ్డి ఆరోపించారు.

సీఎంకు దమ్ము ధైర్యం ఉంటే సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్‌ చేశారు. తను ఆడించినట్లు ఆడే సిట్‌ విచారణతో ఎటువంటి ప్రయోజనం ఉండదన్నారు. తన స్వార్థం కోసం అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించిన ఘనత బాబుకు దక్కుతుందన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ ఇక్బాల్‌ అహ్మద్, డాక్టర్‌ కె.వెంకట్రామయ్య, ఎ.టి. రత్నశేఖర్‌రెడ్డి, మహ్మద్‌ షఫీ, ఎం.వెంకట్రమణారెడ్డి, డి.జగన్‌మోహన్‌రెడ్డి, ఎంపీపీ డి.హరిత తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top