
కిడ్నీ బాధితుల కుటుంబసభ్యులతో మాట్లాడుతున్న పవన్
సాక్షి, శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆరోగ్య శాఖ మంత్రి లేకపోవడం కన్నా దౌర్భాగ్యం మరేదీ లేదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మండిపడ్డారు. 24 గంటల్లో రాష్ట్రానికి ఆరోగ్య శాఖ మంత్రిని నియమించకపోతే నిరసన దీక్షకు దిగుతానని హెచ్చరించారు.
బుధవారం స్థానిక టికేఆర్ కల్యాణ మండపంలో ఇచ్చాపురం, పలాస నియోజకవర్గాల కిడ్నీ వ్యాధి బాధితుల కుటుంబ సభ్యులను పవన్ కలుసుకున్నారు. వారి సమస్యలపై ముఖాముఖి నిర్వహించారు. ఉద్దానంలో కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారి సమస్యలపై 48 గంటల్లో ప్రభుత్వం స్పందించాలని కోరారు.
వ్యాధి మూలలను కనుగొనేందుకు కిడ్నీ సమస్యలపై కమిటీ ఏర్పాటు చేయకపోయినా బస్సు యాత్రను ఆపి మరీ దీక్షకు దిగుతానని తెలిపారు. తెలుగుదేశం పార్టీ(టీడీపీ)కి ఇచ్చిన హామీలను నెరవేర్చే చిత్తశుద్ధి లేదన్నారు. కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.