కమలంలో కలకలం | Odisha BJP Leaders And Activists Discontent on Party High Commission | Sakshi
Sakshi News home page

కమలంలో కలకలం

Jun 19 2020 11:42 AM | Updated on Jun 19 2020 11:42 AM

Odisha BJP Leaders And Activists Discontent on Party High Commission - Sakshi

జయపురం: మొదటి నుంచి పార్టీ బలోపేతానికి అహర్నిశలు పనిచేస్తూ వస్తున్న పాత నేతలు, కార్యకర్తలకు బీజేపీ రాష్ట్ర కార్యనిర్వాహక వర్గంలో స్థానం కల్పించడం లేదని జయపురం అసెంబ్లీ నియోజక వర్గం పార్టీ నాయకులు, శ్రేణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారిని అధిష్టానం అందలం ఎక్కిస్తోందని విమర్శిస్తున్నారు. స్థానిక స్టేడియం గ్రౌండ్‌లో పలువులు పాత బీజెపీ శ్రేణులు బుధవారం  సమావేశమై రాష్ట్ర బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలను తూర్పారబట్టారు. ఈ సందర్భంగా సీనియర్‌ బీజేపీ నేత, జయపురం అర్బన్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌ అధ్యక్షుడు దేవేంద్ర బాహిణీపతి అసంతృప్తి వెలిబుచ్చారు.   గత ఎన్నికల నుంచి పార్టీలో  ఇటువంటి పోకడలు పొడచూపాయన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చి బీజేపీలో చేరిన వారికి పార్టీ పట్టం గడుతూ పార్టీ బలోపేతానికి నిరంతరం పనిచేస్తున్న పాత వారిని పక్కకు నెడుతోందని ఆవేదన  వెళ్లగక్కారు. 

గత ఎన్నికలలో పలు పార్టీలు మారి బీజేపీలో చేరిన గౌతమ సామంత రాయ్‌కు పార్టీ టికెట్‌ ఇచ్చారని మొదట్నుంచి  తామంతా పార్టీలో ఉన్నామని ఇతర పార్టీ నుంచి వచ్చి చేరి తమకు   తమకు పాఠాలు చెబితే సహించేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర పార్టీ, కొరాపుట్‌ జిల్లా  పార్టీ నేతలు ఈ విషయంలో తగు చర్యలు చేపట్టక పోతే తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. జయపురం నియోజకవర్గంలో గౌతమ సామంతరాయ్‌ ప్రవేశాన్ని  పాత బీజేపీ నేతలు, కార్యకర్తలు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. వారు నిర్వహించే ఏ సభకు గాని సమావేశానికి గాని సామంతరాయ్‌ను ఆహ్వానించడం లేదు.  అయినా రాష్ట్ర నాయకత్వం గౌతమ సామంతరాయ్‌ను అక్కున చేర్చుకుంది. గత సాధారణ ఎన్నికల్లో జయపురం ఎమ్మెల్యే టికెట్‌  కోసం పలువురు పాత నేతలు ప్రయత్నించినా గౌతమ సామంతరాయ్‌కు పార్టీ టికెట్‌ ఇచ్చింది. అప్పటినుంచే   పార్టీ పాత శ్రేణులలో అసంతృప్తి సెగలు రాజుకున్నాయి. అయితే గౌతమ సామంతరాయ్‌ను బీజేపీ శాశ్వత ఆహ్వానితునిగా ఇటీవల పార్టీ అధిష్ఠానం నియమించడంతో పాత నేతల్లో గతంలోనే రాజుకున్న అసంతృప్తి సెగ తీవ్రస్థాయికి చేరుకుంది.

జయపురంలో బీజేపీ అంతంత మాత్ర
ఇప్పటికే అంతంతమాత్ర బలం ఉన్న జయపురం నియోజకవర్గం  బీజేపీలో ప్రస్తుతం తలెత్తిన అసంతృప్తి పార్టీని మరింత దిగజారుస్తుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సమావేశంలో సీనియర్‌ నేతలు అరుణ భటమిశ్రా, పట్టణ పార్టీ అధ్యక్షుడు అమర్‌లాల్‌ అహుజ, లలిత అగర్వాల్, మీనకేతన పరిచ, శుభేంద్ర బ్రహ్మ, విజయ సాహు, మోహన దొర, శంకర మహంతి, త్రినాథ్‌ రావు, మనోజ్‌ నాయక్, సుధాంశు జెన, జగదీష్‌ పాఢి, దుర్గా ప్రసాద్‌ ఎర, మోహన్‌ మఝి, గౌర దాస్, శ్యామ మోహన్, లక్ష్మీనరసింహ పాఢి, వసంత స్వంయి, సంతోష్‌ మహాపాత్రో తదితరులు  పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement