ప్రశాంత్‌ కిషోర్‌, నితీష్‌ మధ్య బయటపడ్డ విభేదాలు..!

Nitish Kumar Fires On Prashant Kishor - Sakshi

ఇష్టంలేకపోతే బయటకు వెళ్లిపోవచ్చు..

ప్రశాంత్‌ తీరుపై నితీష్‌ కుమార్‌ ఆగ్రహం!

సాక్షి, న్యూఢిల్లీ : బిహార్‌ రాజకీయాల్లో అనూహ్య పరిణామం​ చోటుచేసుకుంది. జేడీయూ అధ్యక్షుడు సీఎం నితీష్‌ కుమార్‌, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌కు మధ్య విభేదాలు బయటపడ్డాయి. ప్రశాంత్‌ కిషోర్‌పై మంగళవారం నితీష్‌ తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ‘పార్టీలో ఉండాలనుకుంటే ఉండు లేకపోతే లేదు’ అంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. పార్టీలో కొనసాగాలి అనుకుంటే జేడీయూ నిబంధనలకు కట్టుబడి ఉండాలని లేకపోతే పార్టీ వదిలి వెళ్లాలని నితీష్‌ తేల్చిచెప్పినట్లు సమాచారం. అయితే దీనిపై వెంటనే స్పందించిన ప్రశాంత్‌ కిషోర్‌.. తాను బిహార్‌ వచ్చి సమాధానం చెబుతానని, కొంత సమయం వరకు వేచి చూడాలని సమాధానమిచ్చారు. తాజా పరిణామం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. (అమిత్‌ షాకు ప్రశాంత్‌ కిషోర్‌ కౌంటర్‌..!)

కాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు వివాదాస్పద చట్టాలను ప్రశాంత్‌ కిషోర్‌ బహిరంగంగానే విమర్శిస్తున్న విషయం తెలిసిందే. అలాగే నితీష్‌ కుమార్‌ ప్రస్తుతం ఎన్డీయే మిత్రపక్షంగా కొనసాగుతున్నప్పటికీ.. బీజేపీ వ్యతిరేక పక్షాలకు మద్దతుగా ప్రశాంత్‌ వ్యవహరిస్తున్నారు. ట్విటర్‌ వేదికగా కేంద్ర ప్రభుత్వ విధానాలను తప్పుపడుతున్నారు. అంతటితో ఆగకుండా బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రశాంత్‌ తలదూర్చారు. ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌కు రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న ఆయన.. హస్తినలో ఆప్‌ విజయానికి ప్రణాళికలు రచిస్తూ... తీవ్రంగా కృషి చేస్తున్నారు. అలాగే ఆప్‌ తరఫున ప్రచార బరిలోనూ దిగుతానని ఇటీవల ప్రకటించారు. (ఆ చట్టాలను అడ్డుకోవాలంటే రెండే మార్గాలు)

మరోవైపు జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్‌ పార్టీ విధానాలపై సోషల్‌ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీలపై దేశ వ్యాప్తంగా రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ పెద్ద ఎత్తున ఉద్యమించారని వారిని అభినందిస్తూ ఇటీవల ఆయన ట్వీట్‌ కూడా చేశారు. ఇంత వరకూ బాగానే ఉన్నా.. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ప్రశాంత్‌ కిషోర్‌ మధ్య మాటల యుద్ధం సాగిన విషయం తెలిసిందే. షాహీన్‌బాగ్‌ ఘటనపై ఇద్దరూ సోషల్‌ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సందించుకున్నారు. (ప్రశాంత్‌ కిషోర్‌కు మరో ప్రాజెక్టు..!)

ఈ పరిణామాలన్నింటినీ నిశితంగా పరిశీలించిన బీజేపీ నాయకత్వం ప్రశాంత్‌ వ్యవహారంగా తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ నేపథ్యంలో ఆయన్ని కంట్రోల్‌లో పెట్టాలని నితీష్‌ను బీజేపీ పెద్దలు మందలించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్‌ కిషోర్‌ వ్యవహారంపై నితీష్‌ బహిరంగ వ్యాఖ్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. ప్రశాంత్‌ జేడీయూకి రాజీనామా చేసి బయటకు వెళ్తారా లేక నితీష్‌కు సంజాయిషీ ఇస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top