ఆ చట్టాలను అడ్డుకోవాలంటే రెండే మార్గాలు

Prashant Kishor Said Two Ways Stop Citizenship Law And NRC - Sakshi

పట్నా: నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజెన్స్‌( ఎన్‌ఆర్‌సీ), పౌరసత్వ సవరణ చట్టంపై రాజకీయ వ్యూహకర్త, జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌ కిషోర్‌  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్‌ఆర్‌సీ అడ్డుకోవటం కోసం ప్రజలు, రాజకీయ నాయుకులు రెండు బలమైన మార్గాలను ఎంచుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ట్విటర్‌ వేదికగా స్పందించారు. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌ఆర్‌సీపై ప్రజలు, నాయకులు వ్యతిరేకంగా అన్ని మాధ్యమాల్లో శాంతియుతంగా నిరసనలు వ్యకం చేయాలని ఆయన సూచించారు. ఆదే విధంగా బీజేపీయేతర 16 మంది ముఖ్యమంత్రులు ఏకమై పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించాలని ప్రశాంత్‌ కిశోర్‌ పిలుపునిచ్చారు.

ఎన్‌ఆర్‌సీ, పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌.. ఎన్‌ఆర్సీని రాష్ట్రంలో అమలు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఎన్‌ఆర్సీని బిహార్‌లో అమలు చేయాల్సిన అవసరం ఏముందని నితీష్‌ కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఎన్డీయేతర ముఖ్యమంత్రులు కేంద్రంపై తీవ్రంగా పోరాడుతున్న విషయం తెలిసిందే. ఎన్డీయేలో భాగస్వామ్య పక్షంగా ఉన్న జేడీయూ పార్లమెంట్‌ ఉభయ సభల్లోనూ క్యాబ్‌ బిల్లుకు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై పార్టీ ఉపాధ్యక్షుడు, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. 2014లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రశాంత్‌ కిషోర్‌ విస్తృతంగా కృషిచేసిన విషయం తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top