కొత్త జోనల్‌ విధానం అమల్లోకొస్తే 20 వేల పోస్టులు!

New Zonal System Will Provide Employment In Telangana - Sakshi

ప్రభుత్వ వర్గాల అంచనా

61 రకాల కీలక పోస్టులు 95% స్థానికులకే

సీఎం కేసీఆర్‌కు ప్రధాని హామీపై నిరుద్యోగుల్లో ఆశలు.. సవరణఉత్తర్వులొస్తే గ్రామీణ ప్రాంతాల వారికి అధిక లాభం

రాష్ట్రస్థాయి కీలక పోస్టులన్నీ పదోన్నతులపైనే భర్తీ

డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ నుంచి రాష్ట్రస్థాయి పోస్టుల తొలగింపు

డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, సీటీవో వంటి 34 రకాల పోస్టులన్నీ మల్టీ జోన్‌లోకే  

సాక్షి, హైదరాబాద్‌: 13 శాఖలు.. 20 వేల పోస్టులు... రాష్ట్రంలో కొత్త జోనల్‌ విధానం అమల్లోకి వస్తే ఇప్పటికిప్పుడు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం ఉన్న గణాంకాలివి. ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త జోనల్‌ విధానానికి రాష్ట్రపతి ఆమోదం లభిస్తే ఈ మేరకు ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఉద్యోగాల భర్తీతోపాటు అనేక రకాల సమస్యలకూ పరిష్కారం లభిస్తుందని చెబుతున్నాయి. ముఖ్యంగా గ్రూప్‌–1 ఉద్యోగాల్లోని ఇంజనీర్‌ పోస్టుల మొదలు స్పెసిఫైడ్‌ గెజిటెడ్‌ కేటగిరీ పోస్టులు, మల్టీజోన్, జోనల్‌ పోస్టుల్లో ఇతర రాష్ట్రాల నుంచి పోటీపడే అభ్యర్థుల సంఖ్య పూర్తిగా తగ్గిపోవడంతోపాటు రాష్ట్రంలోని 31 జిల్లాల ప్రాతిపదికన పోస్టులను భర్తీ చేస్తే గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులకూ అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొంటున్నాయి. స్థానికతే కీలకంగా మారి 61 రకాల కీలక పోస్టుల్లోనూ 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కనున్నాయి. రాష్ట్రస్థాయి కీలక పోస్టులన్నీ పదోన్నతుల ద్వారా భర్తీ, డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ నుంచి రాష్ట్రస్థాయి పోస్టుల తగ్గింపు, 34 రకాల పోస్టులు మల్టీజోన్‌లోకి రావడం లాంటి అంశాల్లో కూడా కొత్త జోనల్‌ విధానంతో సానుకూలత రానుంది. దీంతో ప్రధాని మోదీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇచ్చిన హామీపై రాష్ట్రంలోని నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నారు.

ఇలాంటి సమస్యలుండవు...
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టీఎస్‌పీఎస్సీ మొదటగా ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టగా ఒడిశా, బిహార్, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌ నుంచి అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అవి జోనల్‌ పోస్టులే అయినా 30 శాతం ఓపెన్‌ కోటాలో అవకాశం ఉన్నందున మూడు రాష్ట్రాల నుంచి 70 మందికిపైగా అభ్యర్థులు వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి అంతకంటే ఎక్కువ మందే దరఖాస్తు చేసుకున్నారు.

అంతేకాదు.. గ్రూపు–1 కేటగిరీలోని డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌ వంటి రాష్ట్రస్థాయి (స్పెసిఫైడ్‌ గెజిటెడ్‌ కేటగిరీ) పోస్టుల్లో 100 శాతం ఓపెన్‌ కోటానే. ప్రస్తుత నిబంధనల ప్రకారం వాటికి మన రాష్ట్రంతోపాటు ఇతర రాష్ట్రాల వారూ పోటీ పడే అవకాశం ఉంది. అదే గ్రూపు–1 కేటగిరీలోని మిగతా పోస్టుల్లో కొన్ని మల్టీజోన్, మరికొన్ని జోనల్‌ పోస్టులు ఉండగా వాటిల్లోకి ఇతర రాష్ట్రాల వారు ఓపెన్‌ కేటగిరీ కింద మల్టీజోనల్‌లో 40 శాతం, జోనల్‌ కింద 30 శాతం మంది వస్తున్నారు. ఇప్పుడు కొత్త జోనల్‌ విధానం అమల్లోకి వస్తే వీటిలో 95 శాతం పోస్టులు స్థానికులకే దక్కనున్నాయి.

మారుమూల ప్రాంతాల యువతకు లబ్ధి...
రాష్ట్రంలో ఉద్యోగాలను ప్రస్తుతం 31 జిల్లాలవారీగా కాకుండా పాత 10 జిల్లాల ప్రకారమే భర్తీ చేయాల్సి వస్తోంది. దీంతో కొత్త జిల్లాల్లోని మారుమూల ప్రాంతాలకు చెందిన యువతీయువకులు వెనుకబడిపోతున్నారు. దరఖాస్తు చేసుకుంటున్నా పట్టణ ప్రాంతాల వారితో సమానంగా పోటీ పడలేకపోతున్నారు. అదే కొత్త జిల్లాలకు ఆమోదం లభిస్తే ప్రస్తుతం 10 జిల్లాలకు ఉన్న పోస్టులను 31 జిల్లాలకు విభజించి భర్తీ చేస్తారు. దీంతో ఆయా జిల్లాల్లో పోటీ తగ్గుతుంది. మూరుమూల ప్రాంత నిరుద్యోగులకూ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అందుకే కొత్త జోనల్‌ విధానం ఆమోదానికి రాష్ట్రం పట్టుదలతో ఉంది. ముఖ్యంగా 9 వేలకుపైగా పంచాయతీ కార్యదర్శి పోస్టులను కొత్త జోనల్‌ విధానం అమోదం తరువాత భర్తీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. తద్వారా 31 జిల్లాల్లోని మూరుమూల ప్రాంతాల నిరుద్యోగులకు ఎక్కువ అవకాశాలు కల్పించవచ్చని భావిస్తోంది. ఇవేకాదు మరో 12 శాఖల్లోని మరో 10 వేలకు పైగా పోస్టుల భర్తీకి కొత్త విధానంలో నోటిఫికేషన్లు జారీ చేయాలన్న ఆలోచనలో ఉంది.

అనేక సమస్యలకు పరిష్కారం...
కొత్త జోనల్‌ విధానానికి రాష్ట్రపతి ఆమోదముద్ర పడితే జిల్లా పోస్టులే కాదు మల్టీజోన్‌ పరిధిలోకి తెచ్చేలా నిర్ణయించిన 34 రకాల కేటగిరీ పోస్టుల్లో మరో 21 రకాల జోనల్‌ కేటగిరీ పోస్టులు 95 శాతం స్థానికులకే దక్కనున్నాయి. తెలంగాణలోని నిరుద్యోగ యువతకే, అందులోనూ స్థానికులకే ఉద్యోగ అవకాశాలు లభించేలా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త జోనల్‌ విధానం ఆమోదానికి ప్రధాని మోదీ హామీ ఇవ్వడంతో ఉద్యోగులు, నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. అది అమల్లోకి వస్తే ఆ జోనల్‌ విధానానికి అనుగుణంగా రాష్ట్రం, జోన్, జిల్లాస్థాయి పోస్టుల వర్గీకరణకు మార్గం సుగమం కానుంది. ఆ దిశగా సీఎం కేసీఆర్‌ చర్యలు వేగవంతం చేశారు. మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానితో ఈ అంశంపై చర్చించగా అందుకు మోదీ సానుకూలత వ్యక్తం చేశారు. దీంతో రాష్ట్రంలో కొత్త నియామక నిబంధనలకు మార్గం సుగమం అవుతుందన్న భావన వ్యక్తమవుతోంది. తద్వారా జిల్లా, జోనల్‌ స్థాయిలో స్థానికులకు 95 శాతం ఉద్యోగాలు లభించడమే కాదు రాష్ట్రస్థాయి పోస్టుల విధానం తొలగింపు కారణంగా కీలకమైన ఆ పోస్టులు ప్రస్తుతం జోనల్‌ విధానంలో ఉన్న ఉద్యోగులకే పదోన్నతిపై దక్కనున్నాయి. ప్రస్తుతం జిల్లాస్థాయి పోస్టుల్లో 80 శాతం స్థానికులకు, 20 శాతం ఓపెన్‌ కేటగిరీ, జోనల్‌లో 70 శాతం స్థానికులకు, 30 శాతం ఓపెన్‌ కేటగిరీ, మల్టీజోన్‌లో స్థానికులకు 60 శాతం, ఓపెన్‌ కేటగిరీలో 40 శాతం విధానం ఉంది. అయితే ప్రభుత్వం ప్రతిపాదిత కొత్త విధానంలో రాష్ట్రస్థాయి కేడర్‌నే తొలగించింది. మిగతా అన్ని కేడర్లలో స్థానికులకు 95 శాతం, ఓపెన్‌ కేటగిరీలో 5 శాతం రిజర్వేషన్‌ వర్తించేలా నిర్ణయించింది.

అందరికీ లబ్ధి చేకూరేలా...
జోన్ల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ప్రభుత్వం డైరెక్టు రిక్రూట్‌మెంట్‌ విధానం నుంచి 34 రకాల స్టేట్‌ కేడర్‌ (స్పెసిఫైడ్‌ గెజిటెడ్‌ కేటగిరీ) పోస్టులను తొలగించింది. వాటిని మల్టీ జోనల్‌ పరిధిలోకి తెచ్చి భర్తీ చేయాలని నిర్ణయించింది. కొత్త జోనల్, జిల్లా విధానం అమల్లోకి వస్తే ఆ ఉద్యోగాలు వచ్చిన వారు సర్వీసుపరంగా నష్టపోకుండా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే పోస్టుల భర్తీ ప్రక్రియను మల్టీజోనల్‌ స్థాయిలో చేసినా, పోస్టింగ్‌లు మాత్రం రాష్ట్రస్థాయి కేడర్‌లో ఇచ్చేలా చర్యలు చేపట్టింది. తద్వారా కన్‌ఫర్మ్‌డ్‌ ఐఏఎస్, ఐపీఎస్‌లుగా ప్రమోట్‌ అయ్యే వారికి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంది. అంతేకాదు ఆ పోస్టులు తెలంగాణ నిరుద్యోగులకే వచ్చేలా చర్యలు చేపట్టింది. మల్టీజోనల్‌లో వాటిని భర్తీ చేయడం ద్వారా 95 శాతం రాష్ట్రస్థాయి పోస్టులు తెలంగాణ వారికే లభించనున్నాయి. గతంలో రాష్ట్రస్థాయి పోస్టుల్లో లోకల్‌ రిజర్వేషన్లు 50 శాతం మినహాయిస్తే మిగతా పోస్టులకు ఎవరైనా పోటీ పడే వీలుండగా ఇప్పుడది సాధ్యం కాదని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. మల్టీజోనల్‌ ఓపెన్‌ కోటా కేవలం 5 శాతమే ఉన్నందున ఇతర రాష్ట్రాల వారు పెద్దగా వచ్చే వీలుండదని చెబుతున్నారు. కొత్త జోనల్‌ విధానానికి ఆమోదం లభిస్తే అది అమలు చేసే వీలు ఏర్పడనుంది.

కొత్త జోనల్‌ విధానం ఇదీ...
తెలంగాణలో ప్రస్తుతమున్న రెండు జోన్ల స్థానంలో ఏడు కొత్త జోన్లు ఏర్పడతాయి. అందులో మొదటి నాలుగు జోన్లను ఒక మల్టీజోన్‌గా మిగిలిన మూడు జోన్లను రెండో మల్టీజోన్‌గా పరిగణిస్తారు. మరోవైపు ఒకటో తరగతి నుంచి 7వ తరగతి వరకు చదువులో వరుసగా నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడే స్థానికులు అవుతారు.
ప్రతిపాదిత 7 జోన్లు ఇవీ...
కాళేశ్వరం జోన్‌..
జిల్లాలు: భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, జనాభా: 28.29 లక్షలు.
బాసర జోన్‌...
జిల్లాలు: ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జనాభా: 39.74 లక్షలు.
రాజన్న జోన్‌...
జిల్లాలు: కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, జనాభా: 43.09 లక్షలు.
భద్రాద్రి జోన్‌...
జిల్లాలు: వరంగల్‌ రూరల్, వరంగల్‌ అర్బన్, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, జనాభా: 50.44 లక్షలు
యాదాద్రి జోన్‌...
జిల్లాలు: సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, జనగామ, జనాభా: 45.23 లక్షలు
చార్మినార్‌ జోన్‌...
జిల్లాలు: హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, జనాభా: 1.03 కోట్లు
జోగుళాంబ జోన్‌...
జిల్లాలు: మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నాగర్‌ కర్నూల్, వికారాబాద్, జనాభా: 44.63 లక్షలు.
మల్టీజోన్ల పరిధిలోకి వచ్చే జోన్లు...
1. కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి
2. యాదాద్రి, చార్మినార్, జోగుళాంబ. 

మల్టీజోన్‌ పరిధిలోకి వచ్చే స్టేట్‌ కేడర్‌ పోస్టులివీ...
డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్, కమర్షియల్‌ టాక్స్‌ ఆఫీసర్, రీజనల్‌ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్, కో–ఆపరేటివ్‌ సొసైటీ డిప్యూటీ రిజిస్ట్రార్, డిస్ట్రిక్ట్‌ పంచాయతీ ఆఫీసర్, డిస్ట్రిక్ట్‌ రిజిస్ట్రార్, డివిజనల్‌ ఫైర్‌ ఆఫీసర్, డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ జైల్స్, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్, అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్, గ్రేడ్‌–2 మున్సిపల్‌ కమిషనర్, డిస్ట్రిక్ట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్, డిస్ట్రిక్ట్‌ బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్, డిస్ట్రిక్ట్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్, డిస్ట్రిక్ట్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఆఫీసర్, లేబర్‌ సెక్రటరీ అండ్‌ గ్రేడ్‌–2 ట్రెజరర్, అకౌంట్స్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్, మండల పరిషత్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్, లీగల్‌ మెట్రాలజీ అసిస్టెంట్‌ డైరెక్టర్, డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీసు (కమ్యూనికేషన్స్‌), అసిస్టెంట్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్టు, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఎండోమెంట్స్, పాలిటెక్నిక్‌ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్, స్టాటిస్టిక్స్‌శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్, గనులశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్, మెడికల్‌ కాలేజీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్, హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ వర్క్స్‌ మేనేజర్, డిప్యూటీ జనరల్‌ మేనేజర్, ఆయుష్‌ డిపార్ట్‌మెంట్‌ లెక్చరర్స్, గ్రేడ్‌–అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్స్‌.

జోనల్‌ పరిధిలోకి వచ్చే గెజిటెడ్‌ ఆఫీసర్‌ పోస్టులివీ...
గ్రేడ్‌–3 మున్సిపల్‌ కమిషనర్, డిప్యూటీ తహసీల్దార్, గ్రేడ్‌–2 సబ్‌ రిజిస్ట్రార్, జూనియర్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఆఫీసర్, కో–ఆపరేటివ్‌ సబ్‌రిజిస్ట్రార్, అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్, అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్, మార్కెటింగ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్, చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు ఆఫీసర్, ఇండస్ట్రీస్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్, అసిస్టెంట్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్, అసిస్టెంట్‌ బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్, డిప్యూటీ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్, జూనియర్‌ లెక్చరర్, డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్, అగ్రికల్చర్‌ ఆఫీసర్, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్, హార్టీకల్చర్‌ ఆఫీసర్, ఫారెస్టు రేంజ్‌ ఆఫీసర్, ఫారెస్టు సెక్షన్‌ ఆఫీసర్, గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీ ట్యూటర్, ఫిజికల్‌ డైరెక్టర్, ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ బాయిలర్స్, ఆయుష్‌ మెడికల్‌ ఆఫీసర్‌.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top