మంత్రివర్గంలో కొత్త ముఖాలు

New Persons In KCR Cabinet - Sakshi

ఎర్రబెల్లి, నిరంజన్‌రెడ్డి, పువ్వాడ, రెడ్యానాయక్‌లకు చాన్స్‌

వివేకానందగౌడ్, ఆరూరి పేర్లు కూడా... నేడు టీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో కొలువుదీరనున్న టీఆర్‌ఎస్‌ కొత్త మంత్రివర్గంలో పలు మార్పులు చోటుచేసుకోనున్నాయి. స్పీకర్‌ మధుసూదనాచారి, మంత్రు లు తుమ్మల నాగేశ్వర్‌రావు, ఆజ్మీరా చందూలాల్, జూపల్లి కృష్ణారావు, పట్నం మహేందర్‌రెడ్డి ఈ ఎన్నికల్లో ఓడిపోవడంతో వారి స్థానాల్లో తీసుకోవాల్సిన కొత్త వారి జాబితాను సీఎం కేసీఆర్‌ ఇప్పటికే సిద్ధం చేశారు. తెలంగాణలో ఎమ్మెల్యేల సంఖ్య ప్రకారం ముఖ్యమంత్రితోపాటు 17 మందికి మంత్రివర్గంలో చోటు ఉండగా సామాజిక లెక్కల ప్రకారం చూస్తే సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, డి.ఎస్‌. రెడ్యానాయక్, పువ్వాడ అజయ్‌కుమార్‌లకు కొత్తగా అవకాశం లభించొచ్చని తెలుస్తోంది.

జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్‌) స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన ఎర్రబెల్లి దయాకర్‌రావు (పాలకుర్తి) కు కేసీఆర్‌ అవకాశం ఇవ్వనున్నట్లు తెలిసింది. అలాగే పట్నం మహేందర్‌రెడ్డి (తాండూరు) స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి (వనపర్తి)కి బెర్త్‌ ఖాయంగా కనిపిస్తోంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన మంత్రి అజ్మీరా చందూ లాల్‌ (ములుగు) స్థానంలో ఇదే జిల్లా నుంచి ఇదే సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి డి. ఎస్‌. రెడ్యానాయక్‌ (డోర్నకల్‌)ను కేసీఆర్‌ మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు తెలిసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌ నుంచి పువ్వాడ అజయ్‌ కుమార్‌ (ఖమ్మం) మాత్రమే విజయం సాధించడం, ఈ జిల్లాకు చెందిన తుమ్మల ఓటమి పాలవడం, ఇద్దరూ ఒకే సామాజికవర్గం కావడంతో తుమ్మల స్థానంలో పువ్వాడకు కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉంది.

భారీ మార్పులు ఉంటే...  
ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో మార్పులు చేయాలని భావిస్తే ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, టి. పద్మారావుగౌడ్, జోగు రామన్న స్థానంలో అరూరి రమేశ్, కె.పి. వివేకానందగౌడ్, దానం నాగేందర్‌ పేర్లను పరిశీలించనున్నారు. సీఎం కేసీఆర్‌ తన జట్టును పూర్తిస్థాయిలో మార్చాలని భావిస్తే అనూహ్యంగా కొత్త వారి పేర్లు జాబితాలో ఉండనున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈసారీ రెండు ఉప ముఖ్యమంత్రి పదవులను కొనసాగించే యోచనలోనే ఉన్నారు.

ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి, నాయిని నర్సింహారెడ్డిలను మారిస్తే వారి స్థానంలో అరూరి రమేశ్‌ (వర్ధన్నపేట)కు అవకాశం ఇవ్వనున్నట్లు తెలిసింది. హైదరాబాద్‌కు చెందిన టి. పద్మారావుగౌడ్‌ను మారిస్తే కె.పి. వివేకానందగౌడ్‌ (కుత్బుల్లాపూర్‌)కు చోటు కల్పించే అవకాశం ఉంది. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని మంత్రి జోగు రామన్నను మార్చాల్సి వస్తే అదే సామాజిక వర్గానికి చెందిన దానం నాగేందర్‌ (ఖైరతాబాద్‌)కు బెర్త్‌ ఖాయం కానుంది. కాగా, సాధారణ ఎన్నికల్లో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎర్రబెల్లి దయాకర్‌రావు, డి.ఎస్‌. రెడ్యానాయక్, ముంతాజ్‌ఖాన్‌ (యాకుత్‌పుర)లలో ఒకరిని ప్రొటెం స్పీకర్‌గా నియమించే అవకాశం ఉంది. అలాగే స్పీకర్‌గా ఈటల రాజేందర్‌ (హుజూరాబాద్‌) పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

నేడు టీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ 
కొత్తగా ఎన్నికైన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం బుధవారం ఉదయం 11.30 గంటలకు తెలంగాణ భవన్‌లో జరగనుంది. ఈ భేటీలో టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్‌ను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. బుధవారం నుంచి ఆదివారం వరకు మంచి రోజులు ఉండటంతో సీఎంగా ప్రమాణస్వీకారం చేసేందుకు వాటిలో ఏదో ఒక తేదీని కేసీఆర్‌ ఎంచుకోనున్నారు.

తెలంగాణ తల్లికి వందనం... 
ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణ భవన్‌ చేరుకున్న కేసీఆర్‌... తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అలాగే ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్‌ చిత్రపటానికి నివాళర్పించారు. ఆపై మీడియా సమావేశంలో పాల్గొని అక్కడి నుంచి రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ నరసింహన్‌ను కలిశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top