మీరెక్కడ నేర్చుకున్నారు?

Narendra Modi slams Rahul Gandhi on Hindu jibe - Sakshi

హిందూయిజంపై రాహుల్‌కు మోదీ ప్రశ్న   రాజస్తాన్‌లో ఎన్నికల ప్రచారం

హిందుత్వను సంపూర్ణంగా తెలుసుకోవడం అసాధ్యమని వ్యాఖ్య

జోధ్‌పూర్‌: హిందూ మతంపై తన పరిజ్ఞానాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్‌ వ్యాఖ్యల్ని ప్రధాని మోదీ తిప్పికొట్టారు. సాధారణ పనివాడిని (కామ్‌దార్‌) అయిన తనకు హిందూ మతం గురించి పూర్తిగా తెలియదని, కానీ నామ్‌దార్‌ (రాహుల్‌)కు మాత్రం దాని గురించి మాట్లాడే హక్కు ఉందని వ్యంగ్యంగా అన్నారు. హిందూయిజాన్ని మీరెక్కడ నేర్చుకున్నారని కాంగ్రెస్‌ను ప్రశ్నించారు. రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో సోమవారం ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు. ‘హిందూ మతం గురించి పూర్తిగా తెలుసని నామ్‌దార్‌ గొప్పలకు పోతున్నారు. సాధువులు, పండితులు కూడా అలాంటి ప్రకటనలు చేయలేదు. నేను మాత్రం ఓ సాధారణ పనివాడిని. ఎంతో పురాతనమైన, విశిష్ట సంస్కృతితో కూడిన హిందూయిజం, హిందుత్వల గురించి సంపూర్ణంగా ఎప్పుడూ తెలుసుకోలేను’ అని అన్నారు.

గాంధీ కలల్ని వమ్ము చేశారు..
పారిశుధ్యంపై గాంధీజీ కన్న కలల్ని కాంగ్రెస్‌ వమ్ము చేసిందని మోదీ ఆరోపించారు. తమ వంశాన్ని మాత్రమే ప్రజలు గుర్తుపెట్టుకోవాలని వారు ఆరాటపడ్డారని మండిపడ్డారు. గాంధీ స్వప్నాల్ని నిజం చేసే బాధ్యత ఇప్పుడు తనపై ఉందని తెలిపారు. విదేశీయులు కూడా ఇప్పుడు భారత్‌లో వివాహాలు చేసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారని, మన పర్యాటక రంగ అభివృద్ధికి ఇదే నిదర్శనమని అన్నారు. ‘ఫకీర్‌ గాంధీ(జాతిపిత గాంధీ) ప్రజల మనసుల్లో ఉంటే నామ్‌దార్‌(రాహుల్‌) గాంధీని మరచిపోతారనే భయంతోనే వారు గాంధీజీ ఆశయాల్ని విస్మరించారు’ అని అన్నారు.

పారిశుద్ధ్యంతోనే పర్యాటకం..
అధికారంలోకి వచ్చాక భవనాలు, వంతెనలు, హోటళ్లు నిర్మిస్తానని హామీ ఇవ్వలేదని, మరుగుదొడ్లు మాత్రమే కడతానని మాటిచ్చానని తెలిపారు. పర్యాటక రంగానికి పారిశుద్ధ్యమే కీలకమని, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ దిశగా ఏమీ చేయలేదన్నారు. ‘కాంగ్రెస్‌ దేశాన్ని దాదాపు నాలుగు దశాబ్దాలు పాలించింది. వారు పారిశుద్ధ్యం గురించి మాట్లాడటం ఎప్పుడూ వినలేదు. స్వచ్ఛ భారత్‌ అభియాన్‌తో దేశం శుభ్రం కావడమే కాకుండా పర్యాటక రంగం కూడా వృద్ధి చెందింది.

వీధి వ్యాపారుల నుంచి ప్రయాణ కంపెనీల వరకు ఎందరికో పర్యాటకం వల్ల ఉపాధి అవకాశాలు పెరిగాయి. దేశంలో ఆకర్షణీయ పర్యాటక గమ్యస్థానాల్లో రాజస్తాన్‌ కూడా ఒకటిగా ఎదిగింది. జోధ్‌పూర్, ఉదయ్‌పూర్, జైసల్మీర్‌లలో కోటలు మోదీ అధికారం చేపట్టాక వచ్చాయా? కాంగ్రెస్‌ హయాంలో లేవా? అయినా పర్యాటకం అప్పుడు ఎందుకు అభివృద్ధి చెందలేదు?’ అని ప్రశ్నించారు. సరైన ప్రచారం లేకనే కాంగ్రెస్‌కాలంలో పర్యాటక రంగంలో కాస్త వెనకబడ్డామని ఆయన అన్నారు.

నెహ్రూకు వ్యవసాయం తెలీదు
తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్‌ 134వ జయంతి సందర్భంగా మోదీ.. ఆయనతో పాటు తొలి ప్రధాని నెహ్రూను ప్రస్తావించారు. విదేశీయుల దాడిలో ధ్వంసమైన సోమనాథ్‌ ఆలయ పునరుద్ధరణకు రాజేంద్ర ప్రసాద్‌ హాజరుకావడంపై నెహ్రూ అభ్యంతరం వ్యక్తం చేశారని గుర్తు చేశారు. ఎప్పుడూ చొక్కాపై గులాబీ పువ్వు ధరించే నాయకుడికి తోటల గురించి తెలుసు కానీ, రైతులు, వ్యవసాయం అంటే తెలియదని ఎద్దేవా చేశారు. అందువల్లే రైతులు ఎన్నో కష్టాలు పడ్డారని పరోక్షంగా నెహ్రూను ఉద్దేశించి అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top