చంద్రబాబుపై విరుచుకుపడ్డ మోత్కుపల్లి

Motkupalli Narasimhulu Slams Chandrababu Over Tirumala Yatra - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చంద్రబాబును గద్దె దించటమే ధ్యేయంగా ఇకపై తాను పని చేస్తానని తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు ఉధ్ఘాటించారు. అవసరమైతే ఏపీలోని విపక్షాలన్నింటితో కలిసి తాను పని చేస్తానని ఆయన ప్రకటించారు. మోత్కుపల్లి తిరుమల యాత్ర నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గురువారం ఆయన్ని కలిసి సంఘీభావం ప్రకటించారు. అనంతరం తన నివాసంలో మోత్కుపల్లి మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 

సొంత జెండా లేనోడివి... ‘రాజకీయాల్లో చీడపురుగులా తయారయ్యావు. అ‍ల్లుడి వేషంలో ఎన్టీఆర్‌ను చంపి టీడీపీ జెండా ఎత్తుకెళ్లిన దుర్మార్గుడు. ఆ జెండా చూసే జనాలు ఓట్లేశారు తప్ప.. నీ ముఖం చూసి కాదు. చంద్రబాబును నమ్మొద్దని ఎన్టీఆర్‌ ఆనాడే చెప్పారు. అంతేకాదు టీడీపీ నుంచి చంద్రబాబును ఎన్టీఆర్‌ బహిష్కరించారు. బాబు కారణంగా ఎన్టీఆర్‌ శిష్యులు చనిపోయారు. ఎన్టీఆర్‌ లాంటి మహానీయుడిని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. కేసీఆర్‌, వైఎస్‌ జగన్‌, పవన్‌లది సొంత జెండా. టీడీపీ జెండా నందమూరి కుటుంబానిది. వాళ్లను మోసం చేసి ఆ పదవి అనుభవిస్తున్నావ్‌. దమ్ముంటే ఆ జెండాను వాళ్లకిచ్చేయ్‌. సొంత జెండాతో పోటీ చేసి గెలువు. కమ్మ కులంలో చెడపుట్టిన వ్యక్తి’ అని మోత్కుపల్లి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.
 
బాబు కాదు.. నమ్మకద్రోహి... ‘చంద్రబాబును నాయకుడని ఎవరూ అనరు. ఓ బ్రోకర్‌.. ఓ దొంగ. జెండా దొంగవని స్వయానా ఎన్టీఆరే అన్నారు.  బ్రోతల్‌ హౌజ్‌ కన్నా దారుణంగా టీడీపీని నడుపుతున్నావ్‌. తెలంగాణలో పార్టీ దుస్థితికి కారణం నువ్వు కాదా?.. కులాల మధ్య చిచ్చు పెట్టినవ్‌. డబ్బున్నోడికే, పాపాలు చేసినోడికే టికెట్లు ఇస్తున్నవ్‌.. ఇది మోసం కాదా? రాజ్యసభ సీట్లను అమ్ముకోలేదా? టీజీ వెంకటేశ్‌కు రాజ్యసభ సీటు అమ్మలేదా?.. పైసల్‌ పెట్టి ఓట్లు కొంటావ్‌.. అసలు ఆ సాంప్రదాయం నేర్పిందే చంద్రబాబు. అందరినీ వాడుకుని వదిలేస్తావ్‌. స్వయానా నరేంద్ర మోదీని మోసం చేసినవ్‌.. నువ్వేం మిత్రుడివి. గత ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ను వాడుకున్నావ్‌. ఓటుకు కోట్లు కేసులో గొంతు నీదే అని ప్రజలతో చెప్పిస్తా.. రాజీనామా చేసే దమ్ముందా?’ అని మోత్కుపల్లి చంద్రబాబుకు సవాల్‌ విసిరారు. 

కరివేపాకులా వాడుకున్నావ్‌.. ‘ఎన్టీఆర్‌ మీద అభిమానంతోనే పార్టీలో కొనసాగా. ఎన్టీఆర్‌ ఆశయ సాధన కోసం కృషి చేస్తున్న నన్ను చంద్రబాబు పార్టీకి దూరం చేశారు. వేరే పార్టీల నుంచి ఆహ్వానాలు అందినా ఏనాడూ వాటి గురించి ఆలోచించలేదు. ఇన్నేళ్లలో నేను ఏ పదవినీ ఆశించలేదు. రాజకీయాల కోసం నన్ను కరివేపాకులా చంద్రబాబు వాడుకున్నాడు. బాబు కారణంగానే ఎన్టీఆర్‌ శిష్యులు చనిపోయారు. నీచ కులాల్లో ఎవరు పుడతారని చంద్రబాబు అన్నాడు. వచ్చే ఎన్నికల్లో దళిత వర్గాల ప్రజలు బాబుకి గట్టిగా బుద్ధి చెప్తారు. వంద గజాల లోతులో చంద్రబాబు రాజకీయాల్ని బొందపెడతారు’ అని పేర్కొన్నారు. 

వైఎస్‌ జగన్‌తో కలిసి పాదయాత్ర చేస్తా.. ‘ఎప్పుడైతే నన్ను పార్టీలోంచి సస్పెండ్‌ చేసిండో అప్పుడే నీ పతనం ప్రారంభమైంది. నీతిమంతులపై నిందలేస్తే పుట్టగతులు లేకుండా పోతావ్‌. ప్రజా సమస్యల కోసం వైఎస్‌ జగన్‌ రోడ్డెక్కి పాదయాత్ర చేస్తున్నారు. పేదలను అక్కున చేర్చుకునే కుటుంబం వారిది. ఆయన ప్రజాసంకల్పయాత్రకు సంఘీభావం తెలుపుతున్నా. అవరసమైతే నేను ఆయనతో ఓ రోజు పాదయాత్ర చేస్తా. పవన్‌ యాత్రలోనూ పాల్గొంటా. వామపక్ష ర్యాలీలకూ హాజరవుతా. నమ్మేవాడి గొంతు కోసే నమ్మకద్రోహివి. పోనీలే అని గమ్మున ఉంటే కిరాయికి అమ్ముడుపోయానని నాపై తప్పుడు మెసేజ్‌లతో సోషల్‌ మీడియాలో ప్రచారం చేయిస్తావా? పిచ్చి పిచ్చిగా మెసేజ్‌లు పెడితే ఊరుకోను. నువ్వేమైనా దొరవా? సుద్ద పుసవా? నరహంతకుడివి.. దొంగవి... ఎన్టీఆర్‌ స్పిరిట్‌ నాలో ఎంతకాలం ఉంటే అంతకాలం పని చేస్తా’ అని మోత్కుపల్లి పేర్కొన్నారు. 

బాబు ఉంటే హోదా రానేరాదు... ఏపీ ప్రత్యేక హోదా విషయంలో అడ్డుతగులుతుంది చంద్రబాబేనని మోత్కుపల్లి అభిప్రాయపడ్డారు. ప్యాకేజ్‌ ముద్దు అని అసెంబ్లీ తీర్మానం చేసింది చంద్రబాబేనని, రైతుల భూముల విషయంలోనూ అడ్డగోలు అవినీతి జరిగిందని మోత్కుపల్లి ఆక్షేపించారు. సింగపూర్‌, అమెరికా అంటూ కథలు చెబుతూ ఈ ఐదేళ్లలో సాధించిందేంటని చంద్రబాబును నిలదీశారు. పదవి కోసం దిగజారుడు రాజకీయ చేసావ్‌. బలహీన వర్గాల అన్నదమ్ములు బొందపెట్టడం ఖాయమని చెప్పుతున్నా.

అందుకే తిరుమల యాత్ర... ఎన్టీఆర్‌ ఆశయం.. దుర్మార్గుడ్ని గద్దె దించటం. ఆ ఆశయ సాధన కోసమే తిరుమల మెట్లు ఎక్కుతున్నా అని మోత్కుపల్లి స్పష్టం చేశారు. చంద్రబాబును ఓడించేందుకు రాజకీయ శక్తులన్నీ ఏకం కావాలని ఈ సందర్భంగా మోత్కుపల్లి మరోసారి పిలుపునిచ్చారు. 

యాత్రకు వైఎస్సార్‌సీపీ సంఘీభావం... 
మోత్కుపల్లి తిరుమల యాత్ర నేపథ్యంలో వైఎ‍స్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. మోత్కుపల్లిని తన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా యాత్రకు వైఎస్సార్‌సీపీ సంఘీభావం ప్రకటిస్తున్నట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. అనంతరం ఆయన కూడా ప్రెస్‌మీట్‌లో మోత్కుపల్లి పక్కన కూర్చున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top