బాబూ.. అప్పుడు నీ ఆస్తి ఎంత?

Mohan Babu Fires On Chandrababu - Sakshi

సీఎం చంద్రబాబుపై నిప్పులుచెరిగిన సినీనటుడు మోహన్‌బాబు 

జగన్‌ సీఎం కావడం ఖాయమని వెల్లడి

ఆయన మంచి పరిపాలన అందిస్తారని ఆశాభావం

పంచ భూతాల సాక్షిగా హైదరాబాద్‌లో ఎలాంటి వివక్ష లేదని స్పష్టీకరణ

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన ఆస్తి ఎంత? ఇప్పుడు ఎంత? అని ప్రముఖ సినీనటుడు మోహన్‌బాబు సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు ఏమైనా పుచ్చలపల్లి  సుందరయ్యా, లేక గౌతు లచ్చన్నా? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గడిచిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో భూమి, మట్టి, ఇసుక సహా అన్నీ దోచేశారని నిప్పులుచెరిగారు. తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు తీవ్ర అన్యాయం చేశారని, ఆయన నుంచి పార్టీని లాగేసుకోవడమే కాకుండా ఆయన్ని పార్టీ సభ్యత్వం నుంచి కూడా తొలగించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.  

వైఎస్సార్‌సీపీ స్వీప్‌ చేస్తుంది.. 
త్వరలో రానున్న ఏపీ ఎన్నికల్లో  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ క్లీన్‌ స్వీప్‌ చేస్తుందని.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని మోహన్‌బాబు స్పష్టం చేశారు. మంగళవారం లోటస్‌పాండ్‌లో వైఎస్‌ జగన్‌ సమక్షంలో మోహన్‌బాబు వైఎస్సార్‌సీపీలో చేరారు. అనంతరం ఆయన హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్‌ హోటల్‌లో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగారు. మహానటుడు ఎన్టీఆర్‌ తనకు దైవంతో సమానమని, ఆయన మరణం తర్వాత బీజేపీకి మద్దతు పలికానని గుర్తు చేసుకున్నారు. సుదీర్ఘ కాలం రాజకీయాలకు దూరంగా ఉన్నానన్నారు. తాజా రాజకీయ పరిణామాలతో మంచి పరిపాలన అందిస్తారనే నమ్మకంతో వైఎస్సార్‌సీపీలో చేరినట్లు స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో పరిపాలన అధ్వానస్థితికి చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు.  

మంచి పాలనకు మద్దతివ్వాలనే జగన్‌ వెంట..  
వైఎస్సార్‌ కుటుంబం ఇచ్చిన మాటమీద నిలబడే కుటుంబమని మోహన్‌బాబు పేర్కొన్నారు. తాను ఇప్పుడు వైఎస్సార్‌సీపీలో చేరడం వల్ల వైఎస్‌ జగన్‌కు ఒరిగేది ఏమిలేదని, అయితే మంచి పాలనకు మద్దతు ఇవ్వడానికి మాత్రమే పార్టీలో చేరినట్లు వెల్లడించారు. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు నడుచుకుంటానని మోహన్‌బాబు స్పష్టం చేశారు.  

రూ. 19 కోట్లు బకాయిలు ఉన్నారు 
రాజకీయ కారణాలతో తాను ఫీజుల గురించి పోరాటం చేస్తున్నానన్న ఆరోపణలపై మోహన్‌బాబు స్పందిచారు. తమ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఫీజు బకాయిలు విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు మూడేళ్ల నుంచి చాలాసార్లు లేఖలు రాశానని, పలుమార్లు ఫోన్‌లో మాట్లాడానని మోహన్‌బాబు చెప్పారు. అయితే ఎప్పటికప్పుడు ఇదిగో అదిగో అంటూ చంద్రబాబు కాలయాపన చేశారే కానీ, ఇంతవరకు  బకాయిలు విడుదల చేయలేదని, దాదాపు రూ. 19 కోట్ల బకాయిలు ఉన్నాయని తెలిపారు. తన కాలేజీలకు మొత్తం బకాయిలు విడుదల చేశామని ప్రణాళిక సంఘం సభ్యుడు కుటుంబరావు వ్యాఖ్యానించినట్లు వచ్చిన వార్తలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం దృష్టిలో పడడానికి, కాకా పట్టడానికి అసత్యాలు ప్రచారం చేస్తున్నాడని కుటుంబరావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే పంచ భూతాల సాక్షిగా ఆంధ్రులపై తెలంగాణలోని హైదరాబాద్‌లో ఎలాంటి వివక్ష, పక్షపాతం లేదని, ఇక్కడ అంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, నటుడు మంచు విష్ణు, మంచు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top