
సాక్షి, నల్గొండ: దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి సీఎం అయిన కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చలేని టీఆర్‌ఎస్‌ను, కేసీఆర్‌ను 2019 ఎన్నికల్లో కసిగా ఓడించాలని రాష్ట్ర ప్రజలకు కోమటిరెడ్డి పిలుపునిచ్చారు. నిరుద్యోగులకు, బడుగు బలహీన వర్గాలకు, రైతులకు అండగా ఉండే కాంగ్రెస్ పక్షాన ప్రజలు నిలవాలని కోరారు. తాను పార్టీ మారతారని ఎవరెవరో ఏమేమో అంటున్నారని, అదంతా కేవలం దుష్ప్రచారమేనని చెప్పారు. చనిపోయినా కూడా నా మీద కాంగ్రెస్ జెండానే ఉంటుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.