సీఎం పదవి నుంచి నన్ను తప్పించండి! | Manohar Parrikar May Give Up CMship | Sakshi
Sakshi News home page

Sep 15 2018 9:49 AM | Updated on Sep 15 2018 2:42 PM

Manohar Parrikar May Give Up CMship - Sakshi

సీఎం మనోహర్‌ పర్రీకర్‌

గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పర్రీకర్‌ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుసుస్తోంది.

పనాజీ : గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పర్రీకర్‌ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు తెలుసుస్తోంది. ఆరోగ్యం కుదుటపడకపోవడంతో చికిత్స కోసం మళ్లీ అమెరికా వెళ్లాలని పర్రీకర్‌ భావిస్తున్నారు. ఇదే విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చెప్పి సీఎం పదవి నుంచి తనను తప్పించమని కోరినట్లు సమాచారం.

‘వినాయక చవితి సందర్భంగా అమిత్‌ షాకు పర్రీకర్‌ ఫోన్‌ చేసి శుభాకాంక్షలు చెప్పారు. అలాగే తన అనారోగ్య సమస్యల గురించి చెప్పి పదవి నుంచి తప్పించాలని కోరారు. దీనికి సానుకులంగా స్పందించిన అమిత్‌ షా కొద్ది రోజుల వరకూ పదవిలో కొనసాగాలని కోరారు. ప్రధాని మోదీ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల దిశగా పార్టీ కేంద్రం ఆలోచిస్తోంద’ని బీజేపీ నాయకుడొకరు మీడియాకు తెలిపారు.

కాగా, ప్రత్యామ్నాయంపై కేంద్ర బీజేపీ దృష్టి సారించింది. ఈ మేరకు ఢిల్లీ నుంచి ఒక బృందాన్ని సోమవారం గోవా పంపనుంది. ప్రస్తుత పరిణామాలు, ప్రభుత్వ పని తీరుపై పార్టీ నాయకులతో ఈ బృందం చర్చించనుంది. మంత్రి వర్గంలోనూ మార్పులు చేయనున్నట్లు సమాచారం. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంత్రులు పాండురంగ్ మద్కాకర్, ఫ్రాన్సిస్ డి సౌజాలను కూడా మంత్రి వర్గం నుంచి తొలగించాలని భావిస్తున్నారు. సీఎంగా పర్రీకర్‌ను కొనసాగమని కోరడమా, వేరే వ్యక్తిని నియమించడమా అనే అంశంపై పార్టీ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రాంకియాటైటిస్‌తో బాధపడుతున్న పర్రీకర్‌ చికిత్స కోసం ఈ ఏడాది మార్చిలో అమెరికా వెళ్లారు. దాదాపు ఏడు నెలల తర్వాత సెప్టెంబరు 7న పరీకర్‌ భారత్‌కు తిరిగి వచ్చారు. కాగా మళ్లీ ఆరోగ్యం క్షీణించడంతో గోవాలోని కేండోలిమ్‌లో ఓ ప్రైవేట్‌  ఆసుపత్రిలో చేరారు. చికిత్స కోసం ఆయన ఇప్పటివరకూ మూడుసార్లు అమెరికా వెళ్లివచ్చారు. తాజాగా ఆయన తిరిగి చికిత్స కోసం న్యూయార్క్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు పర్రీకర్‌ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి లేకపోవడంతో రాష్ట్రంలో పాలన కుంటుపడిందని, అభివృద్ది ఆగిపోయిందని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ ఆరోపిస్తుంది. ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిని మార్చడమా లేదా పర్రీకర్‌ను కొనసాగిస్తూ బాధ్యతలను తగ్గిస్తారా అనేది కొద్ది రోజుల్లో తెలియనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement