దీదీపై మండిపడ్డ సుష్మా స్వరాజ్‌

Mamata Banerjee Wanted To Give PM Modi A Tight Slap Of Democracy - Sakshi

కోల్‌కతా : సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. రాజకీయ విమర్శలు దాటి.. వ్యక్తిగత ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తన ప్రభుతాన్ని డబ్బు దండుకొనే సిండికేట్లు నడుపుతున్నాయంటూ విమర్శించిన మోదీపై.. దీదీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో మోదీకి ఓటమి తప్పదని ఆమె హెచ్చరించారు. ప్రధాని మోదీని అసత్యాలు పలికే వ్యక్తిగా దీదీ వర్ణించారు.

అంతేకాక తాను హిందువుల పండగలు, ఉత్సవాలను అడ్డుకొంటున్నానంటూ బీజేపీ నేతలు చేస్తోన్న ఆరోపణలపై కూడా మమతా స్పందించారు. జై శ్రీరాం అంటే.. దీదీ జైలులో పెడుతుందని మోదీ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన మమతా.. తాను బీజేపీ నినాదంతో ఏకీభవించనని.. జై శ్రీరాం బదులు జై హింద్‌ అని నినదిస్తానని వెల్లడించారు. శ్రీరాముడి పేరుతో రాజకీయాలు చేయటం ప్రారంభించిన బీజేపీ గత ఐదేళ్లలో ఒక్క చిన్న రామ మందిరాన్ని కూడా నిర్మించలేదని ఆమె ధ్వజమెత్తారు. ప్రస్తుత ఎన్నికల్లో మోదీకి ప్రజాస్వామ్య చెంపదెబ్బ గట్టిగా తగులుతుందని, ఓటమి తప్పదని దీదీ పేర్కొన్నారు.

దీదీ హద్దు మీరారు : సుష్మా స్వరాజ్‌
మమతా బెనర్జీ మోదీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై.. బీజేపీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌ స్పందించారు. దీదీ అన్ని హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో దీదీని ఉద్దేశిస్తూ ట్వీట్‌ చేశారు. ‘మమతా బెనర్జీ మీరు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి.. కానీ మోదీ ఈ దేశానికి ప్రధాని. మెరుగైన పాలన అందించడం కోసం భవిష్యత్తులో మీరు, మేము కలిసి పని చేయాల్సి వస్తుంది. కాబట్టి కోపాన్ని అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదం’టూ సుష్మా స్వరాజ్‌ ట్వీట్‌ చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top