సవాల్‌పై తోక ముడిచిన టీడీపీ: మల్లాది

Malladi Vishnu And Vellampalli Srinivas Fire On TDP Leaders - Sakshi

సాక్షి, విజయవాడ: గత నాలుగు రోజులుగా జరుగుతున్న పరిస్థితులను గమనిస్తే టీడీపీ ఆత్మరక్షణ ధోరణిలో పడిపోయిందని... ఎన్నో ఏళ్లుగా ఉలుకు పలుకు లేని సీఎం చంద్రబాబు.. ఎన్నికల భయంతోనే అనూహ్యంగా అఖిలపక్షం, సంఘాలు అంటూ పిలుపునిచ్చారని వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి మల్లాది విష్ణు విమర్శించారు. చంద్రబాబు నిద్రపోతే ఇన్నిరోజులు వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి కలలో వచ్చేవారని, కానీ ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా వస్తున్నట్లు టీడీపీ నేతల మాటల ద్వారా తెలుస్తుందన్నారు. దమ్ముంటే మీరు చేసిన వ్యాఖ్యలపై బహిరంగ చర్చకు రావాలని చేసిన సవాల్‌కు టీడీపీ తోక ముడిచిందన్నారు. 

మీ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకోవడానికి మాత్రమే అఖిలపక్షం ఏర్పాటు చేశారు. కానీ అందులో పాల్గొన్న నేతలు మిమ్మల్ని పొగుడుతూ, మీ గురించి ఒక్క మాటైనా మాట్లాడారా అని చంద్రబాబును ప్రశ్నించారు. నేతల దిష్టిబొమ్మల తగలబెడుతుంటే మీ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుంది. శాంతిభద్రతలు ఏ విధంగా నిర్వహిస్తున్నారో ఏపీ ప్రజలకు అర్థమవుతోంది. ఏ ముఖం పెట్టుకుని అఖిలపక్షానికి హాజరు కావాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీలో ఓ ఎమ్మెల్యే, మరో ప్రాంతంలో ఓ ఎమ్మెల్సీ చంద్రబాబు కాళ్లు మొక్కారు. అసలు ఇలాంటి సంప్రదాయం వైఎస్ఆర్‌సీపీలో లేనే లేవని గుర్తు చేశారు. టీడీపీ చేస్తున్న వ్యాఖ్యలకు, ఆరోపణలకు ఒకే ఒక్కడు.. విజయసాయిరెడ్డి సమాధానం చెప్పారని గుర్తు చేశారు. నిజాయితీ గానీ, చిత్తశుద్ధిగానీ ఉంటే విజయసాయిరెడ్డిపై చేసిన వ్యాఖ్యలను మీ ఇష్టమున్న చోట బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరినా తోక ముడిచిన నేతలు టీడీపీ నేతలని ఎద్దేవా చేశారు.

బీజేపీతో నాలుగేళ్లుగా చెట్టాపట్టాలేసుకుని తిరిగి మోసపోయాక ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీ డిమాండ్‌ను ప్రత్యేక హోదాగా మార్చేశారు. అందుకు కారణం వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. వైఎస్‌ఆర్‌సీపీ నేతల పోరాటంతో దిగొచ్చిన చంద్రబాబు ఇప్పుడు హోదా అంటూ కొత్తరాగం అందుకున్నారని ఎద్దేవా చేశారు. ఎంపీలందరూ కలిసి రావాలని, ఎంపీలందరూ ముకుమ్మడి రాజీనామాలు చేస్తే యావత్‌ భారతదేశం ఏపీవైపు చూస్తుందని చెబితే అధికార టీడీపీ ఎంపీలు పట్టించుకోవడం లేదన్నారు. మీరు మాట్లాడినటువంటి మాటలు ఏ పార్టీ నేతలు మాట్లాడరని, తెలుగుదేశం ఆత్మ గౌరవం అంటే ఇదేనా అని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబును, టీడీపీ నేతలను మల్లాది విష్ణు ప్రశ్నించారు.

సైకిల్ చోరీ చేసిన చరిత్ర టీడీపీ ఎమ్మెల్సీది!
సాక్షి, విజయవాడ: టీడీపీ ఎంపీ సుజనా చౌదరి బ్యాంకులకు ఎన్ని వందల కోట్లు ఎగ్గొట్టరన్నది, ఎలా కుచ్చుటోపీ పెట్టారో పాయింట్లుగా వివరంగా పచ్చ మీడియాలోనే ఇచ్చారని వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. అలాంటి ఆర్థిక నేరగాళ్లను తన పక్కన పెట్టుకుని, వారికి మంత్రి పదవులు సైతం ఇప్పించిన చంద్రబాబుకు వైఎస్ఆర్‌సీపీ నేతలపై వ్యాఖ్యలు చేసినందుకు నిజంగా సిగ్గుపడాలన్నారు. విజయవాడలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వెల్లంపల్లి శ్రీనివాస్ బుధవారం ఇక్కడి మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై టీడీపీ చేస్తున్న దుష్ప్రచారంపై మండిపడ్డారు. 

తమ పార్టీ నేతలపై వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నపై సైకిల్‌ను చోరీ చేసిన కేసులున్నాయని వెల్లంపల్లి తెలిపారు. అడ్డదారిలో పదవులు పొందడం కాదని, దమ్ము ధైర్యం ఉంటే పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల ఓట్లతో ఎన్నికవ్వాలని​బుద్ధా వెంకన్నకు సవాల్ విసిరారు. బుద్దా వెంకన్న, జలీల్‌ ఖాన్‌, దేవినేని ఉమ, కేశినేని నానిలకు వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కవని విమర్శించారు. వీరితో పాటు మరికొందరు నేతలకు ఇదే గతి పడుతుందని వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top