గరీబోళ్ల రాజ్యం రావాలి

Laxman Fires on TRS and Congress - Sakshi

     సామాజిక న్యాయమే బీజేపీ లక్ష్యం: కె.లక్ష్మణ్‌

     కేసీఆర్‌ సర్కార్‌లో తెలంగాణ ద్రోహులు

     నాడు ఉద్యమం కోసం.. నేడు ఉద్యోగం కోసం ఆత్మహత్యలు

     కాంగ్రెస్‌ కౌరవ సైన్యాన్ని ఎదుర్కొనే సత్తా బీజేపీకి ఉంది

     జగిత్యాల సభలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లపై ధ్వజం

సాక్షి, జగిత్యాల/ జగిత్యాల టౌన్‌: తెలంగాణలో గడీల రాజ్యం పోయి.. గరీబోళ్ల రాజ్యం రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ఆకాంక్షించారు. బీజేపీ జన చైతన్యయాత్ర సోమవారం జగిత్యాలకు చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో లక్ష్మణ్‌ టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలపై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ ద్రోహులతో జత కలసి అభివృద్ధి మంత్రాన్ని జపిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్‌.. ఇచ్చిన మాట తప్పారని, నాడు ఉద్యమం కోసం ఆత్మహత్యలు జరిగితే.. నేడు ఉద్యోగాల కోసం జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ హయాంలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లను పిచ్చుకగూళ్లుగా అభివర్ణించిన కేసీఆర్‌.. ఎన్ని డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు నిర్మించి ఇచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్రంలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు పునాదులకే పరిమితమయ్యా యని విమర్శించారు. ఎంపీ కవిత ప్రాతి నిధ్యం వహిస్తున్న నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో చేసేందుకు పనిలేక ఎంతోమంది గల్ఫ్‌బాట పట్టారని గుర్తుచేశారు. గల్ఫ్‌ ఏజెంట్ల మోసాల బారిన పడి అక్కడి జైళ్లలో మగ్గుతున్న వారిని విడిపించడంలో కవిత ఏ చొరవ తీసుకోవడం లేదని ఆరోపించారు. అదే తెలంగాణ చిన్నమ్మ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ గల్ఫ్‌ జైళ్లలో బందీలను విడిపిస్తున్నారని పేర్కొన్నారు. మూతబడ్డ నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని వంద రోజుల్లో పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ఇప్పటి వరకు ఎందుకు తెరిపించలేక పోయిందని ప్రశ్నించారు. ఓ పక్క చేనేత కార్మికులను ప్రోత్సహిస్తామంటూ గొప్పలు చెబుతూనే.. బతుకమ్మ పేరిట సూరత్‌ నుంచి చీరలు కొనుగోలు చేసి ఈ ప్రాంత చేనేత కార్మికుల పొట్ట కొడుతోందని ధ్వజమెత్తారు.

తెలంగాణ వస్తే దళితుడినే తొలి ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్‌.. వారిని మోసం చేసి సీఎం అయ్యారని విమర్శించారు. రాష్ట్రంలో దళితులపై దాడులు జరిగినా పట్టించుకునే పాపాన పోలేదని విమర్శించారు. కాంట్రాక్టు ఉద్యోగులను ఎందుకు రెగ్యులరైజ్డ్‌ చేయలేదో చెప్పాలని లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కరించాలన్నందుకు 14 వేల రేషన్‌ డీలర్లను రోడ్డుపాలు చేసిన ఘనత టీఆర్‌ఎస్‌కే దక్కిందన్నారు. మజ్లిస్‌ పార్టీని గల్లీ నుంచి ఢిల్లీ వరకు చేరవేసింది టీఆర్‌ఎస్‌యేనని చెప్పారు. అధికార టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే సత్తా కేవలం బీజేపీకి మాత్రమే ఉందని పేర్కొన్నారు. సామాజిక న్యాయమే బీజేపీ ధ్యేయమని, వాజ్‌పేయి హయాంలో ముస్లింను.. మోదీ హయాంలో దళితుడిని రాష్ట్రపతిగా చేయడమే ఇందుకు నిదర్శమన్నారు  

తెలంగాణలోనూ అదే సంప్రదాయం 
‘ఇప్పటికే ప్రధాని మోదీ సారథ్యంలో దేశంలో కాంగ్రెస్‌ కంచుకోటలన్నింటినీ బీటలు వారిం చాం. ఇదే సంప్రదాయం త్వరలోనే తెలంగాణలోనూ కొనసాగిస్తాం’ అని లక్ష్మణ్‌ అన్నారు.  కాంగ్రెస్‌ దేశంలో అన్ని పార్టీలను కలుపుకుంటూ కౌరవ సైన్యాన్ని తయారు చేస్తోందని, దాన్ని ఎదుర్కొనే సత్తా బీజేపీ పాండవులకు ఉందని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ హయాంలో స్కాంలు జరిగితే టీఆర్‌ఎస్‌ పాలనలో అవినీతి రాజ్యమేలుతోందన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top